స్కూళ్లు, హాస్టల్స్ లో​బువ్వ ఎలా ఉంది..?..బడి బాటలో 325 మంది ఆఫీసర్లు 

స్కూళ్లు, హాస్టల్స్ లో​బువ్వ ఎలా ఉంది..?..బడి బాటలో 325 మంది ఆఫీసర్లు 

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా యంత్రాంగం బడి బాట, హాస్టల్​ బాట పట్టింది. స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, స్టూడెంట్స్​తో కలిసి లంచ్​ చేసింది. బువ్వ ఎలా ఉంటోందని ఆరా తీసింది. కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్లు సహా హెచ్​వోడీలు హాస్టల్స్​లో నిద్రించారు. విద్య, సంక్షేమంపై యాదాద్రి కలెక్టర్​ హనుమంతరావు దృష్టి సారించారు. ఇందులో భాగంగా అన్ని డిపార్ట్​మెంట్స్​ ఆఫీసర్లను స్కూళ్లను సందర్శించాలని ఆదేశించారు. జిల్లాలోని 658 స్కూల్స్​లో సోమవారం ఒక్కరోజే దాదాపు 325 స్కూల్స్​ను మధ్యాహ్న సమయంలో సహా వివిధ డిపార్ట్​మెంట్లకు చెందిన 325 మంది ఆఫీసర్లు సందర్శించారు.

జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, హాస్టల్స్​ను ఆఫీసర్లు సందర్శించారు. కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్​కలెక్టర్లు జీ వీరారెడ్డి, గంగాధర్, డీఆర్​డీవో నాగిరెడ్డి సహా 85 మంది ఆఫీసర్లు హాస్టల్​బాట పట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు హాస్టల్స్​కు వెళ్లిన ఆఫీసర్లు ముందుగా స్టూడెంట్స్​కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. స్టూడెంట్స్​కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో రికార్డ్​ చేసుకున్నారు.

డిన్నర్​కోసం రెడీ చేసిన వంట సరుకులను పరిశీలించారు. వండిన అనంతరం స్టూడెంట్స్​తో కలిసి భోజనం చేశారు. బువ్వ రోజు ఎలా ఉంటుందో ఆరా తీశారు. హాస్టల్స్​లో స్టూడెంట్స్​ ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో అడిగారు. కలెక్టర్​ అందించిన చెక్​లిస్ట్​ ప్రకారం అన్ని సమకూర్చారా..? లేదా..? అన్నది నమోదు చేసుకున్నారు. రాత్రి పిల్లలతో కలిసి అక్కడే నిద్రించారు.