- అక్రమ క్వారీల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు
- రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్ల నిరంతర తనిఖీలు
- వీడీసీ ఆగడాలకు బ్రేక్
- పకడ్బందీ ప్రణాళికలు రూపొందించిన కలెక్టర్
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నిరోధించేందుకు కలెక్టర్ పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. పకడ్బందీ నిఘా సారించే దిశగా కసరత్తు మొదలుపెట్టారు. దీనికనుగుణంగా ఇసుక లభ్యమయ్యే వాగుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు వాగుల వద్ద తనిఖీలు చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించారు. వాగుల వద్ద ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ ఆఫీసులకు అనుసంధానం చేయనున్నారు.
కోట్లలో వ్యాపారం
కొంతకాలంగా జిల్లాలో అనేక వాగులు, కుంటల్లోని ఇసుకను అక్రమంగా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతా లకు తరలిస్తున్నారు. ప్రతిరోజు రూ.లక్షల విలువైన ఇసుకను దూర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. విస్తరిస్తున్న నిర్మాణాల కారణంగా ఇసుకకు భారీగా డిమాండ్ ఏర్పడుతుండడంతో ఇసుకాసురులు.. రాజకీయ నాయకుల అండదండలతో సిండికేటగా ఏర్పడి పెద్ద ఎత్తున వాగుల్లో జేసీబీలు, ప్రొక్లైనర్లతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. జిల్లాలోనే కాకుండా నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు తరలించి కోట్లలో వ్యాపారాలు చేస్తున్నారు.
తవ్వకాల కోసం వేలం పాటలు!
జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ఉన్న వాగులను వీడీసీలు ఆ వాగులను తమ గుప్పిట్లోకి తీసుకొని యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తు న్నారు. తమ గ్రామాలకు ఆనుకొని ఉన్న వాగుల్లో ఇసుక తవ్వకాల కోసం అనేక గ్రామాల వీడీసీలు బహిరంగంగానే వేలం పాటలు నిర్వహించి లక్షల రూపాయలను వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి.
అయితే చాలా గ్రామాల్లో ఇసుక తవ్వకాల వ్యవహారంపై వివాదాలు జరుగుతున్నప్పటికీ వీడీసీల ఆదిపత్య ధోరణి కారణంగా ఈ వ్యవహారం బయటకి పొక్కడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వాగులలో అక్రమ ఇసుక తవ్వకాలు, తరలింపుపై కలెక్టర్ కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతున్నారు.
వాగుల వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలు
కడెంకు ఆనుకుని ఉన్న గోదావరి పరివాహకంలోని రాజుర, పెంబి తదితర ప్రాంతాల్లోని వాగుల్లో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాల దందా కొనసాగుతోంది. దీనికి తోడు స్వర్ణ ప్రాజెక్టు పరిధిలోని మలక్ చించోలి, ఆలూరు, బోరిగామ, కాల్వ, వెంగ్వాపేట, చిట్యాల, జాఫ్రాపూర్, మాదాపూర్ తదితర గ్రామాల్లోని వాగుల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయని సంబంధిత శాఖ అధికారులు చెప్తున్నారు.
ఎప్పటికప్పుడు కలెక్టర్కు నివేదికలు
కలెక్టర్ ఇసుక అక్రమ తవ్వకాలు సరఫరాపై ఉక్కు పాదం మోపనున్నారు. దీనికనుగుణంగా వివిధ వాగుల పరివాహక ప్రాంతాల్లో క్వారీలున్న చోట తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ అధికారులు ప్రతిరోజు నిఘా నివేదికలను కలెక్టర్కు అందించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. కడెం ప్రాజెక్టు పరిధిలోని పలికేరువాగు, స్వర్ణ ప్రాజెక్టు పరిధిలోని స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుక క్వారీల వద్ద రెండ్రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.