- 30 మందికి పైగా కార్మికుల జీతాలు స్వాహా
- విచారణకు ఆదేశించిన కలెక్టర్
వనపర్తి, వెలుగు : జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేసే కార్మికులకు ఇచ్చే జీతాల్లో కాంట్రాక్టర్ కోత విధించడమే కాకుండా, వారికి జీతాలిచ్చినట్లుగా ఏడాదిన్నరగా రూ.లక్షలు కాజేస్తున్న వైనం వెలుగు చూసింది. హాస్పిటల్లో సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్ విభాగాల్లో పని చేసేందుకు ఒక ఏజెన్సీకి కాంట్రాక్టు అప్పగించారు. 148 మంది కార్మికులతో పని చేయిస్తున్నట్లు చూపిన కాంట్రాక్టర్ 30 మంది కార్మికులు పని చేయకున్నా చేస్తున్నట్లుగా అటెండెన్స్ చూపించి ప్రతి నెలా రూ.లక్షల్లో జీతాలు కాజేస్తున్నాడు.
ఏడాదిన్నరగా ఈ తతంగం నడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. చివరకు కార్మికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
ఒక్కో కార్మికుడికి రూ.4 వేలు కోత..
ఔట్ సోర్సింగ్‌పై పని చేసే కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రూ.15,500లు చెల్లించాల్సి ఉండగా, రూ.11,500 ఇస్తున్నాడు. 148 మంది కార్మికులకు ఇస్తున్నట్లుగా చూపుతున్నా, వాస్తవంగా 118 మందికే వేతనం ఇస్తున్నట్లుగా గుర్తించారు. ఇలా నెలకు రూ.4.65 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు. ఈ విషయం గత ప్రభుత్వం హయాంలోని ఓ ప్రజాప్రతినిధి వద్ద పని చేసే ఆఫీసర్‌కు తెలవడంతో ఆయన ప్రతి నెలా మామూళ్లు తీసుకునేవాడని అంటున్నారు.
దీంతో తన అక్రమాలకు అడ్డు ఉండదన్న ధీమాతో కాంట్రాక్టర్ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇక ఒక్కో కార్మికుడు షిఫ్ట్ పద్దతిలో 8 గంటలు పని చేయాల్సి ఉండగా, 10 గంటలు పని చేయించుకుంటున్నట్లు కార్మికులు వాపోతున్నారు.
అటెండెన్సే లేదు..
కార్మికుల అటెండెన్స్ రిజిస్టర్‌ను సూపరింటెండెంట్‌కు చూపించి జీతాల బిల్స్ చేయాల్సి ఉండగా, నెలవారీ అటెండెన్స్‌ను ఒక పేపర్‌పై అందజేస్తున్నాడు. బయెమెట్రిక్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాల్సి ఉండగా, అక్రమాలకు వీలు ఉండదన్న ఉద్దేశంతో మెషీన్ చెడిపోయినట్లుగా చూపి అక్రమాలకు పాల్పడుతున్నాడు. 3 నెలల జీతాలు పెండింగ్‌లో ఉండగా, ఇటీవల కార్మికులు ధర్నా చేయడంతో ఒక నెల బకాయి విడుదల చేశారు. ఇంకా రెండు నెలల జీతాలు ఇవ్వాల్సి ఉంది. వాస్తవంగా బిల్లులతో సంబంధం లేకుండా ఏజెన్సీ కార్మికులకు ప్రతి నెలా జీతాలు ఇవ్వాలి.
ఎంక్వైరీ రిపోర్టు ఇచ్చాం..
కలెక్టర్ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్‌పై ఎంక్వైరీ చేసి రిపోర్టును కలెక్టర్‌కు అందజేశాం. ఆఫీసర్ల నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. కార్మికుల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేలా ఏర్పాటు చేస్తాం.
- రంగారావు, ఇన్ చార్జి సూపరింటెండెంట్