సుంకిశాల కూలింది కాంట్రాక్ట్​ సంస్థ నిర్లక్ష్యం వల్లే .. కమిటీ నివేదిక

  సుంకిశాల కూలింది కాంట్రాక్ట్​ సంస్థ నిర్లక్ష్యం వల్లే ..  కమిటీ నివేదిక

సుంకిశాల ప్రాజెక్ట్​ రిటెయినింగ్​వాల్​ కుప్పకూలి 3 నెలలు గడిచినా సదరు కాంట్రాక్ట్​ సంస్థపై  ఉన్నతాధికారులు నేటికీ ఎలాంటి  చర్యలు తీసుకోలేదు. నామమాత్రంగా నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటువేసి చేతులు దులుపుకొన్నారు. సాగర్​ నీటిమట్టం తగ్గితేనే రిపేర్లకు చాన్స్​ ఉండడంతో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్తు అయోమయంలో పడింది. ఆగస్టు 2న  టన్నెల్​గేట్ ​కొట్టుకుపోవడంతో సర్జ్​పూల్​లోకి నీళ్లు దూసుకొచ్చి రిటెయినింగ్​వాల్​ కుప్పకూలింది. ఈ ఘటనతో ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వాటిల్లగా.. ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఓవైపు సాగర్​లో నీటిమట్టం పెరుగుతున్నా.. లీకేజీలపై సైట్​సిబ్బంది హెచ్చరించినా కాంట్రాక్ట్​ సంస్థ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మెట్రో వాటర్​బోర్డు విచారణ కమిటీ తేల్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్​ను బ్లాక్​ లిస్టులో పెట్టాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయినా.. నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆగస్టు 2న ప్రమాదం జరిగినప్పుడు సుంకిశాల ప్రాజెక్టు వద్ద పనులు జరుగుతున్నాయి. ఓవైపు సాగర్​లో నీటి ప్రవాహం పెరుగుతున్నా, సర్జ్​పూల్​లోకి వాటర్​ లీక్​ అవుతున్నట్టు అక్కడి సిబ్బంది సమాచారం ఇచ్చినా కాంట్రాక్ట్​ సంస్థ పట్టించుకోలేదని విచారణ కమిటీ గుర్తించింది. సాగర్​లో 590 అడుగుల నుంచి 450 అడుగుల వరకు వాటర్​లెవల్​ ఏ దశలో  ఉన్నా సొరంగ మార్గం ద్వారా సుంకిశాల పంపుహౌస్​​లోకి నీటిని తరలించే విధంగా డిజైన్​ చేశారు. కానీ 530 అడుగుల నీటి ధాటినే రిటైనింగ్​ వాల్ తట్టుకోలేదని, ఇందుకు నిర్మాణంలోని లోపాలే కారణమని సర్కారుకు ఇచ్చిన నివేదికలో నిపుణుల కమిటీ స్పష్టంచేసింది. 

వాస్తవానికి పంపుహౌస్​​లో మోటార్లు బిగించిన తర్వాత సొరంగం పనులు పూర్తిచేస్తారని, కానీ ఇక్కడ అధికారులు మోటార్లు బిగించకముందే మూడు సొరంగ మార్గాల్లో మూడో మార్గాన్ని ఓపెన్​ చేసి పెట్టారని వెల్లడించింది. రిటైనింగ్​ వాల్, గేట్ల నిర్మాణం పూర్తికావడంతో సొరంగ మార్గాన్ని తెరిచే ఉంచడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తేల్చింది. ఆగస్టు 1న ఉదయం పని ముగించుకుని పంపుహౌస్​ నుంచి వెళ్లిపోయిన సిబ్బంది.. భయంతో రెండో షిఫ్ట్​​లో పనిచేయడానికి రాలేదని, లేదంటే భారీగా ప్రాణనష్టం జరిగేదని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంట్రాక్ట్​సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పిన విచారణ కమిటీ కాంట్రాక్ట్​ సంస్థను బ్లాక్​ లిస్టులో పెట్టాలని సూచించింది