అప్పుల్లో సామాన్యుడు..సంకీర్ణ సర్కార్ కొసల్లేనా.?

అప్పుల్లో సామాన్యుడు..సంకీర్ణ సర్కార్ కొసల్లేనా.?

దేశంలో ప్రభుత్వాల ఆర్థిక పాలసీలు అనాలోచితంగా ఉండడం వల్ల ప్రభుత్వాలతో పాటు సామాన్యులు కూడా అప్పుల్లో కూరుకుపోతున్నారు. ప్రతినెలా కనీసం ఆరువేల రూపాయల సంపాదన లేక దేశంలోని 50 శాతం మంది ప్రజల బతుకుబండి నడవడం అతికష్టంగా మారిపోయింది. అయితే పాలకులకు ఇది పట్టదు, వారికోసం బడ్జెట్ రూపొందించే పరిస్థితి లేదు. దేశంలో ఒక వ్యక్తి ఆదాయం కన్నా అప్పు ఎక్కువ అయిపోతుంది. 18 శాతం మందికి ఆదాయం, అప్పు సమానం అనే పరిస్థితి ఉంది. జీవితం అనేది కఠినంగా మారిపోతున్నది. జీవితం నిజానికి ఎవరికి కూడా సులభతరం కాదు, జీవితాన్ని సులభతరం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు అవసరమైన వెసులుబాటు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడా కలగట్లేదు. పదేండ్ల నుంచి సామాన్యుల జీవన పరిస్థితులపైన ప్రభుత్వానికి కూడా దృష్టి లేదు. వారి మేలు కోసం ఒక ఆలోచన, కార్యాచరణ అనేది లేనేలేదు. కార్పొరేట్లలకు వెసులుబాట్లు, రుణమాఫీలు ఇవ్వడం మాత్రమే వాటికి తెలుసు. ఎన్నికలలో గెలువడం, ప్రజలను తమ దిక్కు ఎలా తిప్పు కోవాలి, అనే యావ తప్ప ఇంకేమిలేదు. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి అంటూ విడదీసి రాజకీయ ప్రయోజనం పొందడమే ప్రభుత్వాలకు, పార్టీలకు టార్గెట్ అయిపోయింది.

తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి

ప్రస్తుతం దేశంలో సగటున ఒక వ్యక్తి ఆదాయం 1,27,000 రూపాయలు ఉంటే, అప్పు 1,33,055 రూపాయలు ఉంది. 50 శాతం మంది ఆదాయం నెలకు రూ.6 వేలు కూడా లేదు. మరోవైపు అంబానీ తన కొడుకు పెళ్లికి రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. అసమానతల దేశంలో ఇదో పరిహాసం లాంటి పరిస్థితి అనక తప్పదు. ఈ పెళ్లికి మన పీఎం సహా నేతలంతా వెళ్లి వస్తారు. మధ్య తరగతి వారి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉన్నది. దేశంలో జీడీపీ లో 60 శాతం అప్పులకే వెళ్తున్న పరిస్థితి. సంస్కరణలు, కార్పొరేట్ లలో చేంజ్ 2014 కు ముందుకన్నా ఎక్కువ జరిగింది. పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. టాక్స్ వసూళ్లు, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు తప్ప వేరే మార్గం లేదు. సంపాదన తగ్గడం, పీఎస్​యూ ల అమ్మకం వల్ల, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి, బతకడానికి ఓల్డ్ ఏజ్ లో పనికి వస్తుందని దాచుకున్న ఈపీఎఫ్ ల ను అర్ధతంగా విత్​డ్రా చేసుకోవడం, ఉపాధి లేక కొట్లాది మందిలో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల మార్కెట్ దెబ్బతిన్నది. రెవెన్యూ తగ్గింది. ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరగడం వల్ల తీవ్ర నష్టం కలుగుతున్నది. పెరుగుతున్న ధరలను కంట్రోల్ చేయక పోగా పేలాలు మొదలు పాలు, పెరుగు లాంటి వాటి మీద కూడా జీఎస్టీ వేసే పరిస్థితి వచ్చింది. దేశం పరిస్థితి ఆర్థిక నిపుణులలో ఆందోళన కలిగిస్తున్నది. మరో దిక్కు లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను షేర్ మార్కెట్ నుంచి గత ఏడాది విత్​డ్రా చేసుకోవడం కూడా ఆందోళన కలిగిస్తున్నది. ఇంకా ఈ పరంపర కొనసాగుతున్నది. రూ.12 లక్షల కోట్ల గౌతమ్ అదానీ స్కాం మీద ఇప్పటికీ కేంద్రం సమాధానం ఇవ్వలేదు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నోళ్లు వాటిని తీర్చే పరిస్థితి లేదు. ఎనిమిది వేల మంది దాకా పెట్టుబడి దారులు విదేశాల బాట పట్టే పరిస్థితి ఉండగా వారిని ఆపే పరిస్థితి, యంత్రాంగం కనిపిస్తలేదు. ఆర్బీఐ చేసిన సూచనల ప్రకారం పెద్ద కంపెనీలు చాలా వరకు దివాలా తీసాయి. 80కి పైగా కంపెనీల్లో ఉపాధి అవుట్ అయిపోయింది. ఉద్యోగాలు ఊడి పనిచేసే వారు ఇంటి వద్దే ఉండే పరిస్థితి ఉంది. 

అమృత్ కాల్​లో.. అధిక ధరల మోత 

2024 మార్చి నాటికే దేశం చాలా అప్పుల్లో కూరుకుని పోయింది. ఇక దివాలా దశ వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. దేశాన్ని నడపడానికి  పాలకులు పన్నులు, జీఎస్టీ ఎంత పెంచినా, ఎంత అప్పులు చేసినా పొదుపు పాటించక పోతే, దుబారా అరికట్టక పోతే 2025 నాటికి దేశం మరింత ఆర్థిక సంక్షోభం లోనికి కూరుకుని పోయే ప్రమాదం ఉంటుందంటే అతిశయోక్తి కాదు. దేశంలో ప్రస్తుతం అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు 16 కోట్లు మంది, చదువుకున్న నిరుద్యోగులు 24 కోట్ల మంది ఉన్నారు. పీఎం నరేంద్ర మోదీ గతేడాది ప్రకటించిన 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఒకవేళ ఈ ఏడాది జరిగినా, నిరుద్యోగం తీరే సమస్య కాదు. నాలుగేండ్ల అగ్నివీర్ పథకం ద్వారా భర్తీ చేసే అగ్నివీర్ జాబ్​ల ద్వారా కూడా తీరే సమస్య కాదు. ప్రధాని నరేంద్రమోదీ గతంలో చెప్పినట్టు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం, బ్లాక్ మనీ వెలికి తీసి, అందరి బ్యాంక్ అకౌంట్ లలో రూ.15 లక్షలు వేసి ఉంటే కొంత సమస్య తీరేది కావచ్చు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేదు. గత పది ఏండ్ల పాలనలో మాటలు ఎక్కువ చేతలు తక్కువ. విదేశాల్లో గొప్పలు, విశ్వగురు గా ప్రచారాలు, అమృత్ కాల్ గా గతేడాదిని ప్రకటించి జనానికి చుక్కలు చూపే అధిక ధరలను ముందుంచడం బీజేపీ కి మాత్రమే చెల్లింది. పీఎస్​యూ లను విచ్చలవిడిగా అమ్మడం, మూసి వేయడం, సైన్యంలో సైతం నాలుగేండ్ల అగ్నివీర్ లాంటి గ్యారంటీ లేని ఉద్యోగాలను ప్రవేశపెట్టిన ఘనత ఈ కేంద్ర ప్రభుత్వం సొంతం చేసుకున్నది. దేశమంతా, నిరుద్యోగులు ఈ అగ్నివీర్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసినా, కాల్పుల్లో పలువురు మరణించినప్పటికీ కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. రిక్రూట్​మెట్ ప్రాసెస్ మొదలు పెట్టి మరీ ఈ ప్రాజెక్ట్ ను సమర్థించుకున్నది. 

5 కేజీల ఉచిత బియ్యం ఆన్సర్​ కాదు

దేశంలోని ప్రస్తుత పరిస్థితులతో చాలా మంది రాజీపడి పోతున్నారా? అంటే లేదు అనే సమాధానం వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. అయితే అధిక ధరలు, అసమానతలు, నిరుద్యోగం అన్నింటికీ కేంద్రం సమాధానం 5 కేజీ ల ఉచిత రేషన్ అయిపోయింది. మణిపూర్ మంటలకు ఏడాది దాటినా పరిష్కారం లేదు. పీఎం మోదీ నోట మణిపూర్ గురించి ఒక మంచి మాట లేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ హోదా లోనే ఇటీవల మళ్లీ మణిపూర్ వెళ్లి బాధితులను పరామర్శించి వచ్చారు. రాయ్ బరేలీ వెళ్లారు. అంబానీ కొడుకు పెళ్లికి ఆహ్వానం ఉన్నా వెళ్లలేదు. త్వరలో బడ్జెట్ ఉంటుంది. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఈ సారి కేంద్రం, పీఎం మోదీని.. నిరుద్యోగం, అసమానతలు, అధికధరలు, మణిపూర్, నీట్​పేపర్ లీక్ పై నిలదీసే అవకాశం ఉన్నది. ఇండియా కూటమిలోని ఉద్దండులు అంతా ఈ సారి కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి ఉన్నది. 

సంకీర్ణ సర్కార్​ కొసెల్లేనా?

మిత్రపక్షాల మద్దతు తో మూడోసారి పీఎం అయిన మోదీకి.. ఈ దఫా గత పదేండ్ల లెక్క తానుషాహీగిరి కొనసాగించడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కష్టమే. అటు ఆర్ఎస్ఎస్ తోను అంతర్గతంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి వారితోనూ మోదీ సంబంధాలు అంత ఆరోగ్యకరంగా లేనట్టు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మూడోసారి మోదీ ప్రభుత్వం కొసఎల్లేనా? అనే టాక్ ఉన్నది. మాయల ఫకీరు ప్రాణాలు చిలుకలో ఉన్నట్లు.. పీఎం మోదీ పదవి ఊపిరి ఏపీ సీఎం చంద్రబాబు, అటు బిహార్ సీఎం నితీశ్ కుమార్ చేతుల్లో మోదీ ఫ్యూచర్ అనే పరిస్థితి. ఆ సీఎం ల డిమాండ్ల లిస్టు చాంతాడంత పొడవు కనిపిస్తున్నది. వారిద్దరి మద్దతు ఉన్నన్ని రోజులు ప్రభుత్వం ఊపిరి ఉంటుంది, లేని నాడు కష్టమే. అందుకోసం ఏపీ సీఎం చంద్రబాబు, బిహార్ సీఎం నితీశ్ మాట పీఎం మోదీ వినాల్సిందే. డిమాండ్ లను తీర్చాల్సిందే.

- ఎండి.మునీర్, సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు,