సికింద్రాబాద్, వెలుగు: బల్దియా నిర్లక్ష్యంతో కమ్యూనిటీ హాళ్లు స్థానికులకు ఉపయోగ పడట్లేదు. ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇంటి ముందటే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సిటీలోని కాలనీలు, బస్తీల్లో కమ్యూనిటీ హాళ్లలో చాలా వరకు వృథాగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిధులు రాక మధ్యలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల పనులు పూర్తయినా సౌలతులు కల్పించకపోగా అసంపూర్తిగా ఉండిపోయాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో నిధులు మంజూరైనా నిర్మాణ పనులు మొదలే పెట్టలేదు. కోట్లతో నిర్మిస్తుండగా ఏ లక్ష్యం కోసం కడుతున్నారో కూడా అధికారులకే తెలియడంలేదు. ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై స్థానికులకు అవగాహ న కూడా కల్పించడంలేదు. దీంతో ఎలా వాడుకోవాలనేది కూడా బస్తీవాసులకు తెలియదు. మొత్తంగా సిటీలో కమ్యూనిటీ హాళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలోని కమ్యూనిటీ హాళ్లు తప్ప బల్దియా పర్యవేక్షణలోని ఏ ఒక్క కమ్యూనిటీ హాల్లో కనీస సౌలతులు లేక పేదలకు, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేవు.
రూ. 34 కోట్లతో మరో 14 నిర్మించగా..
ఆధునిక వసతులతో అతి తక్కువ ఖర్చుతో పేద, మధ్య తరగతి ప్రజలు ఫంక్షన్లు చేసుకునేందుకు సిటీలో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం14 నిర్మించాలని 2016లో బల్దియా ప్రతిపాదనలు చేసి రూ.34 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో 10 హాళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో నాలుగింటి పనులు ఇంకా షురూ చేయలేదు. పూర్తయిన సీతాఫల్మండి, మారేడుపల్లి, కూకట్పల్లిలోనివి అందుబాటులోకి రాగా మిగతావి ప్రారంభానికి ఎదురు చూస్తున్నాయి. అందుబాటులోకి వచ్చిన వాటిలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల కార్యక్రమాలు, బంధువుల ఫంక్షన్లకు మాత్రమే వాడుతున్నారు. సికింద్రాబాద్ సెగ్మెంట్ సీతాఫల్మండిలో నిర్మించిన మల్టీ పర్సపస్ ఫంక్షన్ హాల్ టీఆర్ఎస్ నేతలకు అడ్డాగా మారిపోయింది. ఎమ్మెల్యే సంబంధీకులు, పార్టీ కార్యకర్తలకు తప్ప ఇతరులెవరూ వినియోగించుకుంటున్న దాఖలాలు లేవు. మారేడుపల్లి, ఇతర ప్రాంతాల్లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఉప్పల్ సెగ్మెంట్ రామంతాపూర్‌లో 2016లో రూ.3.5 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నాలుగేండ్లకు పనులు పూర్తయినా ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. సికింద్రాబాద్ సెగ్మెంట్అడ్డగుట్టలో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాలు నిర్మించేందుకు రూ.2.25 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసిన బల్దియా అధికారులు ముందుగా అక్కడి పాత కమ్యూనిటీ హాల్‌ను కూల్చివేశారు. భవన నిర్మాణ పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాకపోగా సదరు స్థలం అసాంఘిక కార్యకలాపాలకు, ఆటోలు, ట్రాలీ ఆటోల పార్కింగ్‌కు అడ్డగా మారింది. ఇలా సిటీలోని చాలా చోట్ల ఉన్న కమ్యూనిటీ హాళ్లలో
నిరుపయోగంగా ఉండిపోయాయి.
ఉన్నట్లు తెలిసినా..
సిటీలో సుమారు 500 వరకు కమ్యూనిటీ హాళ్లు ఉండగా, వీటిలో చాలా ప్రాంతాల్లో కనీస వసతులు లేకపోవడంతో వాటిని స్థానికులకు ఉపయోగపడడంలేదు. కొన్ని చోట్ల కమ్యూ నిటీ హాళ్లు ఉన్నట్లు తెలిసినా, వాటిని బల్దియా కార్యక్రమాల కొరకు మాత్రమే వాడుకుంటా రనేది తెలుస్తుంది. స్థానికులు కూడా వాడుకోవచ్చనే దానిపై బల్దియా అవగాహన కలిగించిన దాఖలాలు లేవు. సికింద్రాబాద్ లో 24 కమ్యూనిటీ హాళ్లు ఉండగా, మరో 20 హాళ్లను వివిధ బస్తీలు, కాలనీల్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నవి కూడా వినియోగంలో లేవు. కొత్త వాటికి నిధులు రాక మధ్యలోనే నిలిచిపోయాయి. మరికొన్ని పూర్తయినా బిల్లులు చెల్లించకపోగా సదరు కాంట్రాక్టర్లు బల్దియాకు అప్పగించడం లేదు. ఇలా కమ్యూనిటీ హాళ్ల నిర్వహణ ఆగమాగంగా తయారై ప్రారంభానికి నోచుకోకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయి.
చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా
మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని అధికారులు రెండేండ్ల కిందట ఉన్న హాలును కూల్చేశారు. ఇంకా నిర్మించడం లేదు. దీంతో ఇరుకుగా ఉండే ఇండ్ల మధ్య చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇబ్బందిగా మారింది. నిధులు మంజూరైనా స్థానిక ఎమ్మెల్యే, బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. - గంట రాజుసాగర్, అడ్డగుట్ట
త్వరలోనే అందుబాటులోకి తెస్తాం
నిరుపయోగంగా ఉన్న కమ్యూనిటీ హాళ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. త్వరలోనే పూర్తి చేసి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రారంభిస్తాం. - దశరత్, డిప్యూటీ కమిషనర్, సికింద్రాబాద్ సర్కిల్