- సబ్‌లీజు, రెంట్లతో కోట్లాది రూపాయల ఆదాయం
- 21 ప్రాజెక్టుల గుర్తింపు.. ఆరింటి అగ్రిమెంట్ రద్దు
- హైకోర్టును ఆశ్రయించిన యూనివర్సల్ రియల్టర్స్
- నాలుగు వారాల్లో బకాయిలు మొత్తం చెల్లించాలన్న కోర్టు
- మిగతా వాటి లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో అత్యంత విలువైన హౌసింగ్ బోర్డు భూములు లీజుకు తీసుకున్న సంస్థలు చాలా వరకు ఆ ఫీజును చెల్లడం లేదు. బోర్డు నోటీసులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎంతో కాస్ట్లీ భూముల్ని కారుచౌకగా లీజుకు తీసుకుంటున్న సంస్థలు వీటిలో నిర్మాణాలు చేపట్టి ఇతర సంస్థలకు వందల కోట్ల రూపాయలకు రెంట్లకు, సబ్ లీజుకు ఇస్తున్నాయి. కోట్లాది రూపాయలు వెనకేసుకుంటూ కూడా బోర్డుకు కట్టాల్సిన ఫీజులు బకాయి పెడుతున్నాయి. బోర్డు నోటీసులు ఇస్తున్నా కూడా కొన్ని సంస్థలు చెల్లించడం లేదు. ఇప్పటి వరకు ఇలాంటి 21 ప్రాజెక్టులను గుర్తించారు. అందులో హౌసింగ్ బోర్డు ఆరు ప్రాజెక్టులతో అగ్రిమెంట్రద్దు చేసి.. నోటిఫికేషన్జారీ చేసింది. అవసరమైతే మిగతా సంస్థలతో కూడా లీజు ఒప్పందం రద్దు చేసుకోవాలని యోచిస్తున్నది. మరోవైపు హౌసింగ్ బోర్డు బిల్డింగ్స్‌లో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కూడా పెద్ద మొత్తంలో కిరాయిలు బకాయి ఉన్నాయి. వాటిని చెల్లించాల్సిందిగా ఇప్పటి నోటీసులు ఇచ్చినట్టు బోర్డు అధికారుల తెలిపారు.
యూనివర్సల్ రియల్టర్స్‌తో అగ్రిమెంట్ రద్దు
గచ్చిబౌలిలోని ఓల్డ్ ముంబై హైవే పక్కన ఉన్న 19.95 ఎకరాల హౌసింగ్ బోర్డు భూమిని ఐదు ప్రాజెక్టులు(బిట్లు)గా యూనివర్సల్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2005 ఏప్రిల్ 30న లీజుకు తీసుకుంది. కొన్ని సంస్థలకు సబ్ లీజుకు ఇవ్వగా ఇందులో రాడిసన్ హోటల్, లీ మెరిడియన్ హోటల్, ప్లాటినా కాంప్లెక్స్, ఆంబియన్స్ పార్క్ వ్యూ, బొటానికా అపార్ట్ మెంట్స్ తో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. అయితే హౌసింగ్ బోర్డుకు యూనివర్సల్సంస్థ లీజు ఫీజు రూ.220 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఐదు నెలల నుంచి ఈ బకాయిలు కట్టాల్సిందిగా నోటీసులు ఇస్తున్నా స్పందించడం లేదు. దీంతో లీజు అగ్రిమెంట్ ను రద్దు చేసిన హౌసింగ్ బోర్డు పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం సదరు ప్రాపర్టీ హౌసింగ్ బోర్డు భూమలు అని, వాటిని అమ్మే హక్కు ఈ కంపెనీకి లేదని స్పష్టం చేసింది. ఈ భూముల్లో ఉన్న హోటల్స్, అపార్ట్ మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని అమ్మకం, కొనుగోళ్లను నిషేధిస్తున్నామని, హౌసింగ్ బోర్డు పర్మిషన్ తీసుకోకుండా బ్యాంకులు ఈ భూముల్లో ఉన్న ఆస్తులపై లోన్లు ఇవ్వొద్దని పేర్కొంది.
Also Read :- గ్రేటర్ లో సిల్ట్ నుంచి ఇసుక తీసేందుకు వాటర్ బోర్డు ప్లాన్
మధుకాన్ ల్యాండ్ అగ్రిమెంట్ రద్దు
లీజుకు తీసుకున్న హౌజింగ్ బోర్డు భూముల్లో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్న బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరావుకు చెందిన కంపెనీ మధుకాన్ ప్రాజెక్టు అగ్రిమెంట్ ను కూడా రద్దు చేస్తున్నట్లు నోటిఫికేషన్ ఇచ్చింది. మధుకాన్ 2005 ఫిబ్రవరి 9న కూకట్ పల్లిలో 9.04 ఎకరాలు లీజుకు తీసుకుంది. జేఎన్టీయూ ఎదురుగా భారీ కమర్షియల్ కాంప్లెక్స్, నామా హోటల్స్, రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు, మెగా మాల్ నిర్మిస్తున్నది. ఈ సంస్థ హౌసింగ్‌బోర్డుకు రూ.100 కోట్లు బకాయి ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్ ను రద్దు చేసి.. నిర్మాణాలు వెంటనే ఆపాలని నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందు అరణ్య నుంచి భూమి స్వాధీనం
నాగోల్ బండ్లగూడలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న టైమ్‌లో ఇందు ఈస్టర్ ప్రావిన్స్ ప్రాజెక్ట్ లిమిటెడ్ హౌసింగ్ బోర్డు నుంచి భూమి లీజుకు తీసుకుంది. ఇందులో పెద్ద ఎత్తున విల్లాలు, అపార్ట్ మెంట్లు నిర్మించింది. బోర్డుతో కంపెనీ చేసుకున్న అగ్రిమెంట్ ను కంపెనీ ఉల్లంఘించటంతో ఇటీవల ఇందులో ఖాళీగా ఉన్న 10. 30 ఎకరాలను హౌసింగ్ బోర్డు స్వాధీనం చేసుకుంది.
హైకోర్టులో యూనివర్సల్ రియల్టర్స్ పిటిషన్
హౌసింగ్ బోర్డు అగ్రిమెంట్ రద్దు, నోటిపికేషన్జారీపై యూనివర్సల్ రియల్టర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం నాలుగు వారాల్లో హౌసింగ్ బోర్డుకు బకాయి మొత్తం రూ.225 కోట్లు చెల్లించాలని సంస్థను ఆదేశించింది. హౌసింగ్ బోర్డు తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
బోర్డు రద్దు చేసిన అగ్రిమెంట్ భూముల్లోని నిర్మాణాలు
1. రాడిసన్ హోటల్ (0.95 ఎకరాలు)
2. లీ మెరిడియన్ హోటల్ (2.61 ఎకరాలు)
3. కమర్షియల్ కాంప్లెక్స్(1.99 ఎకరాలు)
4. ఆంబియన్స్ పార్క్ వ్యూ (4.10 ఎకరాలు)
5. బొటానికా అపార్ట్ మెంట్స్ (7. 27 ఎకరాలు)
మధుకాన్ ల్యాండ్ అగ్రిమెంట్
1. మధుకాన్ హైట్స్ (1. 12 ఎకరాలు)
2. నామా హోటల్స్ (2. 62 ఎకరాలు)
3. మధుకాన్ మెగా మాల్స్ (5.30 ఎకరాలు)