
నర్సంపేట, వెలుగు : భూ సమస్యను పరిష్కరించాలని వరంగల్జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో గురువారం ఓ రైతు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పులి రమేశ్ అదే గ్రామానికి చెందిన జయప్రకాశ్ అనే రైతు వద్ద సర్వేనెంబర్ 257/ అ/2లో 2. 05 ఎకరాల భూమి కొన్నాడు. భూమికి అప్పట్లో బాట సైతం చూపించాడు. భూమిపై భాగంలో ఉన్న రైతులు తాడెం నరసయ్య, ప్రభాకర్, రామ్ చంద్రు, చిరంజీవి, వినయ్, కార్తీక్ ఆరుగురు కలిసి తనకు బాట లేదని కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు.
ఇదేంటని ప్రశ్నిస్తే తనపైనే దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. తనపై దాడికి దిగి బెదిరిస్తున్న ఆరుగురిపై కేసు ఫైల్ చేయకుండా పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. దీంతో చేసేదేమి లేక ఆత్మహత్యే శరణ్యంగా భావించి టవర్ ఎక్కినట్లు చెప్పాడు. రెండు గంటల పాటు టెన్షన్ వాతావరణం ఉండడంతో పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.