
- ట్యాంక్ ఎక్కిన మిషన్ భగీరథ కార్మికులు
- బెల్లంపల్లిలోని తాండూరులో జీతాల కోసం నిరసన
- తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా
బెల్లంపల్లి రూరల్, వెలుగు : ఇంటింటికీ నీళ్లిచ్చే మిషన్‌భగీరథ పథకంలో పని చేసే కార్మికులు జీతాల కోసం ట్యాంకు ఎక్కి ఆందోళన చేశారు. బుధవారం బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెల్లంపల్లి జోన్‌కు చెందిన ఆరు మండలాల మిషన్‌భగీరథ కార్మికులు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇండ్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు ఇవ్వాలంటూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన కరువైందని, బతుకు భారంగా మారడంతో తప్పని పరిస్థితుల్లో ఆందోళనకు దిగామన్నారు. తాము రోజు నీళ్లు ఎక్కించే వాటర్ ట్యాంకు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. విషయం తెలుసుకున్న సీఐ జగదీశ్, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించినా వినలేదు.
బీజేపీతో కలిసి ఆందోళన
వేతనాల కోసం వాటర్‌ట్యాంకు ఎక్కి కార్మికులు ఆందోళనకు దిగారని తెలుసుకున్న బీజేపీ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కొయ్యల ఏమాజీ అక్కడికి చేరుకొని నిరసనకు మద్దతు పలికారు. మిషన్‌భగీరథతో ఇంటింటికీ నీళ్లిస్తున్నామని గొప్పలు చెప్పుకునే సర్కారు.. కనీసం ఆ పథకంలో పని చేస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తర్వాత తహసీల్దార్ఆఫీస్ ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేశారు.