ఓయూ, వెలుగు: డీఎస్సీ పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్‌చేస్తూ నిరుద్యోగులు, స్టూడెంట్లు సోమవారం అర్ధరాత్రి తర్వాత ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రూపు–1, గ్రూపు-–2 పోస్టులను పెంచాలని కోరారు. మంగళవారం ఉదయం కొందరు స్టూడెంట్లు ప్రొఫెసర్ కోదండరాం ఇంటి ముట్టడికి యత్నించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వీ నాయకులు ఓయూలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. వెంట వెంటనే పరీక్షలు నిర్వహిస్తుండడంతో డీఎస్సీ అభ్యర్థులు మానసిక ఒత్తిడితో ఉన్నారన్నారు. సీఎం స్పందించి, డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు చటారి దశరథ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ ను విమర్శించే హక్కు లేదు
సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఎన్ఎస్ యూఐ నాయకుడు వలిగొండ నరసింహ చెప్పారు. ఉనికి కోసం ఉద్యమం కాదని, విద్యార్థుల భవిష్యత్తు కోసం కొట్లాడాలని సూచించారు. ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేసిన చోట మంగళవారం పసుపు నీళ్లు చల్లి క్లీన్చేశారు. పేపర్‌లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసింది కేసీఆర్ కుటుంబం అని మండిపడ్డారు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యల చేసుకున్నప్పుడు, పరీక్షలు వాయిదా పడ్డప్పుడు కనీసం స్పందించని విద్యార్థి నాయకులు ఇప్పుడు దిష్టిబొమ్మలు దహనం చేయడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థి నాయకులు రెడ్డి శ్రీను, బాలు తదితరులు పాల్గొన్నారు.