సర్కారు దవాఖానాలు బాగుజేయాలె

దేశంలో సర్కారు దవాఖానాల పరిస్థితి రోజు రోజుకు దయనీయ స్థితికి దిగజారి పోతోంది. వైద్య, ఆరోగ్య రంగానికి ప్రభుత్వాలు బడ్జెట్ లో సరైన ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రపంచంలోని 189 దేశాల్లో ఇండియా179వ స్థానంలో నిలిచిందని 2020–-21 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ప్రజల ఆయురారోగ్యాలకు భరోసా కల్పించడంలో, సర్కారు దవాఖానాలకు పరిపుష్టి నింపడంలో ప్రభుత్వాలు నానాటికీ వెనుకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానాలు నిర్లక్ష్యానికి గురికావడం వల్లే  ప్రైవేట్, కార్పొరేట్ రంగంలోని హాస్పిటల్స్​ ధనార్జనే ధ్యేయంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. 1947వ సంవత్సరంలో కేవలం 8 శాతం ప్రైవేట్ దవాఖానాలు ఉండగా, ప్రస్తుతం 93 శాతం వరకు హాస్పిటల్స్​ ప్రైవేటు, కార్పొరేటు రంగంలోనే ఉండటం బాధాకరం. 64 శాతం దవాఖానాల పడకలు, 80- నుంచి 85 శాతం డాక్టర్లు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలోనే ఉన్నారు. దేశంలో సుమారు 75 శాతం డిస్పెన్సరీలు, 60 శాతం దవాఖానాలు, 80 శాతం డాక్టర్లు పట్టణాలు, నగరాల్లోనే కేంద్రీకృతమై ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు వైద్యపరమైన ఇబ్బందులు తప్పడం లేదు.

తలసరి వ్యయం తక్కువే..

ప్రజారోగ్యంపై భారత ప్రభుత్వం ఏటా చేసే తలసరి వ్యయం మన పొరుగున ఉన్న శ్రీలంక, చైనాల కన్నా తక్కువే ఉంటోంది. ఆరోగ్య బీమాకు బ్రిటీష్ ప్రభుత్వం 83.5 శాతం వాటా సమకూర్చుతుంటే  భారత్ కేవలం 32 శాతం వెచ్చిస్తున్నట్లు బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ తెలిపింది. 76 శాతం భారతీయులకు ఆరోగ్య బీమా లేనందువల్ల చికిత్సకు సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇటీవల వెలువడిన జాతీయ ఆరోగ్య ముఖచిత్రం ప్రకారం తెలంగాణలో 75 శాతం, ఏపీలో 50 శాతానికి పైగా దవాఖానాల ఖర్చులను సామాన్యులు సొంతంగా భరిస్తున్నారు. ఇలాంటి స్థితిలో చాలామంది సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితులు ఉన్నాయి. అమెరికా, స్వీడన్, జపాన్ లాంటి దేశాలు ప్రజారోగ్యానికి జీడీపీలో 10 శాతానికి పైగా నిధులు కేటాయిస్తుంటే ? మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. 

సిబ్బంది కొరత

రాజ్యాంగంలోని పౌర హక్కుల్లో అంతర్భాగమైన ప్రజల వైద్య చికిత్సల వ్యయం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. దేశంలో 24 శాతం ఆరోగ్య ఉపకేంద్రాలు, 29 శాతం పీహెచ్ సీలు, 38 శాతం సీహెచ్​సీల కొరత ఉన్నట్లుగా 2019-–20 గ్రామీణ ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. దవాఖానాల్లో అవసరాల మేరకు తగినంత సంఖ్యలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది లేని దుస్థితికి ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంది. కరోనాకు సీజనల్ వ్యాధులు తోడైనందున సర్కారు డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించడంలో చాలా ఒత్తిడికి లోనౌతున్నారు. ప్రజలు పూర్తి ఆరోగ్యంగా జీవించాలంటే ? వైద్య, ఆరోగ్య రంగానికి బడ్జెట్​లో నిధులు పెంచాల్సి ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు, యంత్రాలు, మందులు,
 డాక్టర్లు, ఆ రంగంలోని అన్ని రకాల సిబ్బందిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి. వైద్యం మొత్తం వ్యాపారం కావడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల సంపాదనంతా వారి వైద్యానికే పెట్టాల్సి వస్తోంది. ఆరోగ్య బీమాను చిత్తశుద్ధితో అమలు చేస్తూ  ప్రభుత్వం సర్కారీ వైద్య ఆరోగ్య రంగానికి ఆర్థిక పరిపుష్టి నింపాలె. పాలకులు చిత్తశుద్ధితో వైద్యారోగ్యంపై దృష్టి పెట్టాలి. 
-మేకిరి దామోదర్ సోషల్ ఎనలిస్ట్, వరంగల్