చలికి గజగజ ..నిజామాబాద్ జిల్లాలో దారుణంగా హాస్టల్​ స్టూడెంట్ల ​పరిస్థితి

  • చనీళ్లతో ఆరుబయటే స్నానాలు
  • ఎస్సీ హాస్టల్స్​కు ఈ యాడాది దుప్పట్లు కూడా ఇయ్యలే 
  • చలికి పిల్లలు వణుకుతున్నా పట్టించుకోని వైనం

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో గవర్నమెంట్ ​హాస్టల్​ స్టూడెంట్స్ ​చలి తీవ్రతకు వణికిపోతున్నారు. పదిరోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి జనం ఇంటి బయటకు రావడానికి జంకుతున్న వేళ, హాస్టల్స్​లో సరైన వసతులు లేక విద్యార్థుల పరిస్థితి దైన్యంగా మారింది. ఆఫీసర్లెవరూ అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. బాత్రూమ్​ల కొరతతో స్టూడెంట్స్​వరండాల్లోనే చన్నీటి స్నానాలు చేస్తున్నారు. ఇరుకు గదులు, దుప్పట్లు లేక, పగిలిన కిటికీల నుంచి వచ్చే చలితో అవస్థలు పడుతున్నారు.

గీజర్లు వాడుతలేరు

జిల్లాలో 32 ఎస్సీ హాస్టళ్లు​ండగా వాటిల్లో 2,800 మంది స్టూడెంట్స్​ఉన్నారు. 27 బీసీ హాస్టళ్లలో  2,808, 3 ఎస్టీ హాస్టళ్లలో 280 ఉంటూ బడులకు వెళ్తున్నారు. వారంతా పేద కుటుంబాల పిల్లలే. చలికాలంలో వేడినీటి స్నానాల కోసం దాదాపు అన్ని హాస్టల్స్​లో గీజర్లు ఉన్నా వాటి నిర్వహణను వార్డెన్లు పట్టించుకోవడం లేదు. రిపేర్లతో బాగయ్యే వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అవసరమైన మేర బాత్​రూమ్​లు లేక పిల్లలు ఆరుబయట చన్నీటి స్నానాలు చేస్తున్నారు. బోధన్​ఎస్సీ బాయ్స్​ హాస్టల్​లో బకెట్లు కూడా లేక నేరుగా నల్లా కింద గుంపుగుంపులుగా వెళ్లి స్నానం చేస్తున్నారు.

వర్ని, వడ్డేపల్లి ఎస్సీ బాయ్స్​హాస్టళ్లలో వరండాలో ఏర్పాటు చేసిన సిమెంట్​ తొట్టి చుట్టూ కూర్చొని చన్నీటి స్నానాలు చేయాల్సిన దుస్థితి ఉంది. నవీపేట ఎస్సీ, బీసీ బాయ్స్, సిరికొండ, నిజామాబాద్, డిచ్​పల్లి ఎస్సీ బాయ్స్, శక్కర్​నగర్​హాస్టళ్లలోనూ ఇలానే ఉంది. వారం రోజులుగా 14 – 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చలి కాలానికి ముందే డోర్లు, కిటికీలకు రిపేర్లు చేయించాల్సి ఉన్నా, వార్డెన్​లు పట్టించుకోలేదు. సిరికొండ, భీంగల్​లో చలి ధాటిని ఆపడానికి స్టూడెంట్స్​ కిటికీలకు తమ తువ్వాళ్లు అడ్డు కడుతున్నారు. ఇన్​చార్జ్​ వార్డెన్లున్న12 హాస్టల్స్​లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. గత గవర్నమెంట్​మెయింటెనెన్స్​ ఫండ్స్​ఇవ్వకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. 

ఇచ్చేవి కాటన్​ దుప్పట్లే 

హాస్టల్స్​ స్టూడెంట్లకు రెండేళ్లకోసారి గవర్నమెంట్​ దుప్పట్లు ఇస్తుంది. అదీ కాటన్​వే. గతేడాది అవి కూడా ఇవ్వకపోగా అంతకు ముందు 75 శాతం మేరకు పంపిణీ చేశారు. విద్యార్థులు ఇప్పటికీ వాటితోనే అడ్జెస్ట్​ అవుతున్నారు. ఇద్దరు స్టూడెంట్స్​కలిపి ఒక దుప్పటి వాడుకుంటున్న ఉదాహరణలు చాలా చోట్ల ఉన్నాయి. వడ్డేపల్లిలో కొత్త హాస్టల్​ బిల్డింగ్​ రెడీగా ఉన్నా దాంట్లోకి మారకుండా ఇరుకు గదుల్లోనే హాస్టల్​ను కొనసాగిస్తున్నారు.