72 గంటలు గడిస్తే తప్పా ఏం చెప్పలేం.. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడి పరిస్థితి విషమం

ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్‎లోని సంధ్య థియేటర్‎లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో గాయపడిన 11 ఏండ్ల శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నది. లంగ్స్ పని చేయడం లేదని, మరో 72 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమని సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి (35) చనిపోగా.. గాంధీ దవాఖానాలో పోస్టుమార్టం చేసి డెడ్​బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత మూసారాంబాగ్‎లోని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

థియేటర్ మేనేజ్​మెంట్ నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందని, కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడని రేవతి భర్త భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘మా అబ్బాయి శ్రీతేజ్.. అల్లు అర్జున్ అభిమాని. వాడి కోసమే మేము సినిమాకు వచ్చినం. మొదట నా భార్య, పిల్లలు థియేటర్ లోపలికి వెళ్లారు. అప్పటి వరకు అభిమానులు తక్కువే ఉన్నరు. అల్లు అర్జున్ వచ్చాడని తెలిసి లోపల ఉన్నవాళ్లు తోసుకుంటూ బయటికి వచ్చారు. దీంతో నా భార్య, కొడుకు కూడా బయటికి రావాల్సి వచ్చింది. 

బయట ఉన్నోళ్లు అల్లు అర్జున్‎తో కలిసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడే తొక్కిసలాట జరిగింది. నా భార్య, కొడుకు కిందపడిపోయారు. ఊపిరి ఆడకపోవడంతో పోలీసులు సీపీఆర్ చేశారు. మా బాబు అప్పుడు స్పృహలోనే ఉన్నడు. భార్యలో ఎలాంటి చలనం లేదు. వెంటనే హాస్పిటల్‎కు తరలించగా.. చనిపోయింది. అల్లు అర్జున్​ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అభిమానులను తోసేసింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది’’ అని భాస్కర్​తెలిపాడు.