స్టూడెంట్స్​అవస్థలు వర్ణనాతీతం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ లో సెకండ్ ​క్లాస్​ చదువుతున్న ఓ బాలుడు స్కూల్ ​బ్యాగుతో బస్సు దిగుతూ బ్యాలెన్స్​ చేయలేక కిందపడ్డాడు. బస్సు ముందుకు కదలడంతో చక్రాల కింద నలిగాడు. రెండు రోజుల కింద జరిగిన ఈ హృదయ విదారక ఘటన బాలలపై బడి బ్యాగుల భారాన్ని స్పష్టంగా సూచిస్తోంది. బియ్యం బస్తాల్లాంటి బడి సంచులను వీపు మీద మోసుకుంటూ వెళ్లే విద్యార్థులను చూస్తే జాలి కలుగక మానదు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే స్టూడెంట్స్​అవస్థలు వర్ణనాతీతం. పుస్తకాలు, నోట్ బుక్స్, గైడ్లు, స్టడీ పేపర్స్, టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా అన్ని బ్యాగులో పెట్టుకొని ఆ బరువును మోసేందుకు పిల్లలు అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని దశాబ్దాల తరబడి వేధిస్తున్న ఈ సమస్యను పరిష్కరించాలని ఎన్నో కమిటీలు సిఫార్సులు చేసినా, కోర్టులు పలుమార్లు తీర్పులు ఇచ్చినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. విద్యా రంగంలో ప్రైవేటు సంస్థల ఆధిపత్యం పెరగడం, కార్పొరేట్ సంస్కృతి విస్తరించడంతో విద్యార్థుల పుస్తకాల సంఖ్య పెరుగుతూ వచ్చి బడి సంచి మోత భారంగా మారింది.

ఆదేశాల అమలు ఏది?
అమెరికా, చైనా, ఫ్రాన్స్, నార్వే వంటి దేశాల్లో బడి సంచుల బరువుపై ఎప్పటినుంచో నియంత్రణ అమలవుతున్నది. మనదేశంలో బడి సంచి బరువును తగ్గించాలని ఎన్నో కమిటీలు, కమిషన్లు సిఫార్సు చేసినా పక్కాగా అమలు కావడం లేదు. ఇప్పటివరకు ప్రతిపాదించిన మూడు జాతీయ విద్యా విధానాలు, 1964 కొఠారి కమిషన్, యశ్​పాల్ కమిటీ సైతం స్కూల్​బ్యాగుల బరువు తగ్గించాలని నొక్కి చెప్పాయి. పుస్తకాల బరువు తగ్గించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2017 జులై18న జీవో నెం. 22 ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ వాటి అమలుపై విద్యాశాఖ శ్రద్ధ పెట్టలేదు. విద్యార్థి బరువులో పుస్తకాల బరువు10 శాతం మించకూడదని అనేక పరిశోధనలు చెప్తున్నా, కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్  వాటిని పట్టించుకోవడం లేదు. చాలా బడుల్లో తరగతులు పైఅంతస్తులో ఉంటున్నాయి. బుక్స్​పైకి మోసుకెళ్లేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ బడులు సూచించే పుస్తకాలు అధికంగా ఉండటం, మధ్యాహ్న భోజనం లేకపోవడం వల్ల లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అదనపు భారంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఈ అకడమిక్​ఇయర్ ఆంగ్ల మాధ్యమ బోధన జరుగుతున్నందున అన్ని సబ్జెక్టుల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియాలు ఉండే విధంగా విద్యాశాఖ ఒక సబ్జెక్టుకు రెండు బుక్స్​ ముద్రించింది. దీనివల్ల గతంతో పోలిస్తే పుస్తకాల బరువు పెరిగింది.

స్కూల్​ బ్యాగ్​ పాలసీ ఏం చేబుతోంది?
కేంద్ర ప్రభుత్వం స్కూల్ బ్యాగ్ పాలసీ-2020 పేరిట కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పుస్తకాల బరువు విద్యార్థుల బరువులో10 శాతానికి మించకూడదని, నెలలో కనీసం10 రోజులు పుస్తకాల సంచి లేకుండానే స్టూడెంట్​బడికి వెళ్లే విధానం అమలు చేయాలని సూచించింది. ప్రీ ప్రైమరీకి మొత్తానికే పుస్తకాలు ఉండకూడదు. ఒకటో తరగతికి మూడు బుక్స్(1.078 కిలో గ్రాములు) రెండో తరగతికి మూడు బుక్స్(1.080 కి.గ్రా), మూడో తరగతికి నాలుగు(1.572కి.గ్రా), నాలుగో తరగతికి నాలుగు(1.804 కి.గ్రా), ఐదో తరగతికి నాలుగు(1.916 కి.గ్రా), ఆరో తరగతికి 10 బుక్స్(3.080 కి.గ్రా), ఏడో తరగతికి10 బుక్స్​(3.508 కి.గ్రా.), టెన్త్​కు13 పుస్తకాలు(4.182 కిలోగ్రాములు దాటొద్దు) ఉండాలి. తరగతుల్లో  విద్యార్థులు మానసిక స్థితిని బట్టి పుస్తకాల సంఖ్య లెక్క కట్టాలని చెప్పింది. కానీ కార్పొరేట్, ప్రైవేట్ బడుల్లో ప్రభుత్వ గైడ్​లైన్స్ అమలు కావడం లేదు. ప్రైవేట్ బడిలో ఒకటో తరగతి చదివే బాలుడి పుస్తకాల సంచి పది కిలోలు ఉంటే, టెన్త్​కు వచ్చేసరికి అది 30 కిలోలకు పెరుగుతున్నది. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ప్రైవేటు స్కూల్స్​మోయలేనంత బరువు ఉన్న బ్యాగులను బడిలో పెట్టుకునేందుకు డెస్కులు ఏర్పాటు చేయడం లేదు. స్కూల్ బ్యాగులను మోయడం వల్ల పిల్లలకు వెన్ను నొప్పి సమస్యలు వస్తున్నాయి. బడికి వెళ్లడం ఒక రకంగా వారు భారంగా భావిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన స్కూల్ బ్యాగ్ మార్గదర్శకాలను బడులు తక్షణమే అమలు చేసేలా చూడాలి. ప్రైమరీ స్కూల్​స్టూడెంట్స్​కు ఎస్సీఈఆర్టీ రూపొందించిన 4 బుక్స్​మాత్రమే వాడేలా చూడాలి. నెలలో మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’ను పక్కాగా అమలు చేయాలి. అప్పుడే విద్యార్థుల వీపు మీద బడి సంచి భారం తగ్గుతుంది.                              - అంకం నరేష్, రాష్ట్ర కో కన్వీనర్​, యూఎఫ్​ఆర్టీఐ