116 డివిజన్లకే పేర్లు ప్రకటించిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌, వెలుగు: జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు నామినేషన్లు ముగిసే టైముకు కాంగ్రెస్‌  పార్టీ 116 డివిజన్లకు క్యాండిడేట్లను ప్రకటించింది. మరో 34 డివిజన్లను కన్ఫర్మ్​ చెయ్యలేదు. ముఖ్యంగా సికింద్రాబాద్‌  లోక్​సభ సీటు పరిధిలోని డివిజన్లే పెండింగ్‌లో పడ్డాయి. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకే ఈ పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సికింద్రాబాద్​ సెగ్మెంట్​ కమిటీకి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కో ఆర్డినేటర్‌గా, వీహెచ్, మర్రి శశిధర్‌ రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, పి.విష్ణువర్ధన్‌ రెడ్డి, దాసోజు శ్రవణ్‌, ఆదం సంతోష్‌ మెంబర్లుగా ఉన్నారు. ఇక్కడి పలు డివిజన్లలో క్యాండిడేట్లను ఖరారు చేసే విషయంలో నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్టు తెలిసింది.

దాంతో ఎవరికి వారు తమ అనుచరులతో నామినేషన్లు వేయించారు. దాంతో పార్టీ తరఫున ఆశావహులంతా నామినేషన్లు వేసినట్టు అయింది. నేతల పంచాయితీ తేలిన తర్వాత.. కన్ఫర్మ్​ చేసిన క్యాండిడేట్లకు నేరుగా పార్టీ బీఫారాలు ఇవ్వాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్​ ముఖ్య నేత ఒకరు తెలిపారు. మొత్తంగా జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లకుగాను.. కాంగ్రెస్‌ నుంచి 275 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటినీ ముగిసే (ఈ నెల 22) వరకు బీఫామ్‌ అందజేసే అవకాశం ఉంది. వాస్తవానికి  కాంగ్రెస్‌ తొలి విడతగా 47 మందితో, తర్వాతి రోజు 34 మందితో లిస్టులు విడుదల చేసింది. శుక్రవారం మరో 35 మంది పేర్లతో మూడో జాబితాను ప్రకటించింది. మొత్తంగా 116 మంది పేర్లను ప్రకటించింది.

23న కాంగ్రెస్‌ మేనిఫెస్టో

కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 23న మేనిఫెస్టో ప్రకటించనుంది. శుక్రవారం ఆ పార్టీ కోర్‌ కమిటీ నేతలు  సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్‌  ఆధ్వర్యంలో జరిగిన భేటీలో పీసీసీ చీఫ్​ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. మేనిఫెస్టో అంశాలపై చర్చించారు.