- మొత్తం 34 పనులకు
- రూ. 13 కోట్ల సీజీఎఫ్ నిధుల కేటాయింపు
- కనీస వసతులతో పాటు గర్భాలయాలు, మండపాలు, ధ్వజస్తంభాల నిర్మాణం
- టీటీడీ సహకారంతో 17 జిల్లాల్లో 159 భజన మందిరాలు
హైదరాబాద్, వెలుగు : గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆదరణ కరువైన ఆలయాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా భక్తులకు అవసరమైన వసతులు కల్పించడంతో పాటు, పురాతన ఆలయాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తోంది. అన్ని ఆలయాల్లో విడతల వారీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఉన్న ఆలయాల్లో 34 పనులు చేపట్టేందుకు సీజీఎఫ్ నిధులను కేటాయించింది. అత్యధికంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అంతేకాకుండా భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచే ఉద్దేశంతో టీటీడీ సహకారంతో రాష్ట్రంలో 159 భజన మందిరాలను సైతం నిర్మించనున్నారు.
34 పనులకు రూ.13 కోట్లు
ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఆలయాల పరిస్థితిని ఆరా తీసి ఓ రిపోర్ట్‌ను తయారు చేసింది. ఏ ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి ? ఎక్కడెక్కడ వసతులు లేవు ? ఏ ఆలయాలకు ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటుందన్న వివరాలను దేవాదాయశాఖ సేకరించింది. పలు దఫాలుగా నిధులు కేటాయించి అన్ని ఆలయాలకు మరింత ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే కొన్ని ఆలయాల్లో భక్తులకు సరైన వసతులు లేకపోవడం, మరికొన్ని ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిపైనే ఫోకస్ పెంచి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 16 జిల్లాల్లోని పలు ఆలయాల్లో 34 పనులకు ప్రణాళిక రూపొందించింది.
ఆలయాలకు వచ్చే భక్తులకు మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పార్కింగ్ సౌకర్యాలు, వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా, గర్భాలయాలు, మండపాలు, ప్రాకారాలు, ధ్వజస్తంభాల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ఈ పనుల కోసం సీజీఎఫ్ (కామన్ గ్రాంట్ ఫండ్) నుంచి రూ.13 కోట్లు కేటాయించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 6, కరీంనగర్ జిల్లాలో 5 పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం రూ. 5.57 కోట్లతో వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 13 ఆలయాల్లో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు.
Also Read :- పోగుళ్లపల్లిలో ఏకలవ్య మోడల్ స్కూల్
వచ్చేనెల 14వ తేదీతో బిడ్ ముగియనుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఆలయాల్లో భక్తులకు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లోని 13 పనులకు టెండర్లు పిలిచామని, ఈ ప్రక్రియ పూర్తయితే త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
భజన మందిరాల నిర్మాణానికి శ్రీకారం
ఆధ్మాత్మక చింతన పెంపొందించేందుకు రాష్ట్రంలో 159 భజన మందిరాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భజన మందిరాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ప్రపోజల్స్ పంపగా ఆ సంస్థ ఆధ్వర్యలో కొనసాగుతున్న శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు చేసింది. ప్రతి మందిరానికి రూ.10 లక్షలు వెచ్చించనున్నారు. 17 జిల్లాల్లో భజన మందిరాలు నిర్మించేందుకు రూ.15 కోట్లు కేటాయించింది. ఈ మందిరాల నిర్మాణానికి విడతల వారీగా నిధులు మంజూరు చేయనున్నారు. ఈ జిల్లాల్లో పూర్తయిన తర్వాత మిగిలిన జిల్లాల్లో మందిరాల నిర్మాణం చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ ఆఫీసర్లు తెలిపారు. భక్తిభావం ఉట్టిపడేలా ప్రతి రోజు కీర్తనలు, భజనలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ
ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆఫీసర్లతో పలు ధపాలుగా సమావేశాలు నిర్వహించి ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల యాదాద్రిలో బంగారం తాపడం పనులు, 69 అడుగుల లింక్ బ్రిడ్జి పనులు, భద్రాచలం ఆలయ విస్తరణకు నిధులు మంజూరు చేయించడంతో పాటు రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన వేములవాడ, బాసర, కొండగట్టు, భద్రాచలం, కీసరగుట్ట ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు.