డబుల్‍ ఇండ్లు పంపిణీకి రెడీ

డబుల్‍ ఇండ్లు పంపిణీకి రెడీ
  •     ఓరుగల్లులో నిర్మాణం పూర్తయిన ఇండ్లు పంచాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
  •     ఆఫీసర్ల లిస్టు, ఓపెన్‍ డ్రాలో పంపిణీ
  •     అర్హులకే అందజేసేందుకు గ్రేటర్ ఎమ్మెల్యేల ఫోకస్‍

వరంగల్‍, వెలుగు : డబుల్‍ బెడ్‍రూం ఇండ్లను పేదలకు పంచాలని కాంగ్రెస్‍ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఓరుగల్లులో నిర్మాణం పూర్తి చేసుకుని అవినీతి అక్రమాలు, రాజకీయాలతో తాళాలేసిన  ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నది. ఈ నెలాఖరులో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‍ మొదలు పెడతామని, మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు కట్టిస్తామని హౌసింగ్‍, రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‍ ఎమ్మెల్యేలు డబుల్‍ ఇండ్ల పంపిణీపై ఫోకస్‍ పెట్టారు. ఇండ్ల కేటాయింపులో గత బీఆర్‍ఎస్‍ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, లావాదేవీలతో సంబంధం లేకుండా అర్హులకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు.  

10 ఏండ్లలో పంచింది.. 5,321 ఇండ్లే.. 

గత బీఆర్‍ఎస్‍ ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు కట్టిస్తున్నామని శంకుస్థాపనలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. వాటి నిర్మాణం, పంపిణీ చేయడంలో ఫెయిల్‍ అయ్యారు. ఒక్కో నియోజకవర్గంలోనే వేలాది ఇండ్లు కడుతున్నట్లు చెప్పినా, 12 నియోజకవర్గాల్లో పేదలకు పంచిన ఇండ్లు 5,321 మాత్రమే. ఉమ్మడి జిల్లాకు మొత్తంగా 25,994 ఇండ్లు మంజూరైనట్లు చెప్పినా, కేవలం 11,049 ఇండ్లు మాత్రమే కట్టారు. అందులో సగం కూడా పంపిణీ చేయలేదు.  

గ్రేటర్‍ డబుల్‍ ఇండ్లల్లో అక్రమ వసూళ్లు

వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో దేశాయిపేటలో 200 ఇండ్లు, దూపకుంటలో తొలి విడతలో 600., వరంగల్‍ పశ్చిమలో హనుమకొండ కొత్త బస్టాండ్‍ ఏషియన్‍ మాల్‍ వెనకాల ఉన్న అంబేద్కర్‍, జితేందర్‍ సింగ్‍ కాలనీలో 594, హంటర్‍రోడ్‍ న్యూ శాయంపేటలో దాదాపు 500పైగా ఇండ్లు నిర్మించారు. అప్పటి బీఆర్‍ఎస్‍ ఎమ్మెల్యేల అనుచరులు పలుచోట్ల అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. కొందరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. కాగా, అప్పటి మంత్రి కేటీఆర్‍ ఇండ్ల పంపిణీకి  రిబ్బన్‍ కట్‍ చేశారు కానీ, ఎవరికీ కేటాయించలేదు. లబ్ధిదారులు పలుమార్లు ఇండ్ల ముందు, కలెక్టర్‍ ఆఫీసుల ముందు ఆందోళనలు, ధర్నాలు చేసినా డబ్బులు ఇచ్చినోళ్లతో ఇబ్బందులు వస్తాయనే టెన్షన్‍తో అప్పటి ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. 

పంపిణీపై ఎమ్మెల్యేల ప్రత్యేక దృష్టి..

గ్రేటర్ వరంగల్‍ పరిధిలోని వరంగల్‍ తూర్పు, పశ్చిమ పరిధిలోని దాదాపు 1900 డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు పంపిణీ చేసేందుకు గ్రేటర్ వరంగల్‍ ఎమ్మెల్యేలు, మంత్రి కొండా సురేఖ, నాయిని రాజేందర్‍రెడ్డి రెడీ అయ్యారు. ఇప్పటికే పూర్తయిన ఇండ్ల సంఖ్య, జిల్లా కలెక్టర్ల వద్దనున్న అసలైన లబ్ధిదారుల వివరాలు తెప్పించుకున్నారు. ఇండ్లు కట్టకముందు ఆ స్థలంలోని గుడిసెవాసుల్లో ఎవరున్నారు.? ఆపై అక్రమార్కులు చేర్చిన పేర్లు ఏంటనే విషయమై ఆఫీసర్ల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇరువురూ డబుల్‍ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.

అసలైన లబ్ధిదారులకు న్యాయం చేశాక, మిగతావి అర్హులకు ఓపెన్‍ డ్రా ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులోనూ ఇండ్లు దక్కని పేదలకు ఇందిరమ్మ ఇండ్లలో అవకాశం కల్పించేలా చొరవ తీసుకుంటున్నారు. దీంతో గతంలో ఇండ్లు ఇస్తామనే పేరుతో డబ్బులు వసూలు చేసిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.