గొర్రెల స్కీం డీడీల సొమ్ము వాపస్​

గొర్రెల స్కీం డీడీల సొమ్ము వాపస్​
  • 849 మంది బ్యాంకు ఖాతాలో డబ్బుల డిపాజిట్
  • మరో 222  దరఖాస్తుదారుల కోసం వెయిటింగ్​
  • అర్హత లేని వారికి బీఆర్​ఎస్​ సర్కారు లో స్కీం మంజూరు
  • అక్రమాల కారణంగా పథకాన్ని ఆపేసిన కాంగ్రెస్​ సర్కారు 

నిజామాబాద్, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన  గొర్రెల స్కీంలో అవకతవకలు జరగ్గా లబ్ధిదారుల నుంచి అప్పటి  ప్రభుత్వం తీసుకున్న వాటా డబ్బులను కాంగ్రెస్ సర్కారు వాపస్ చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో రెండో విడతలో  మొత్తం 1,071 దరఖాస్తుదారులు డీడీ రూపంలో డబ్బులు చెల్లించారు. కాగా 849 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం  డబ్బులు  వెనక్కి ఇచ్చింది. మిగతా 222 మంది నుంచి అప్లికేషన్ల చేసుకుంటే డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో కూడా జమ చేస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అర్హత లేని వారిని గతంలో గొర్రెల పథకంలో సెలెక్ట్​  చేశారనే ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ రెండో విడతలో డబ్బులు కట్టి గొర్రెలు తీసుకోని వారికి వెనక్కి ఇచ్చేస్తోంది.  

 రెండు ఫేజ్​లలో రూ.203 కోట్ల సొమ్ము

గొల్ల కుర్మల కుల వృత్తులను ప్రోత్సహించే క్రమంలో 2017-–18లో గొర్రెల స్కీంను అప్పటి బీఆర్​ఎస్​ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది.  కులవృత్తి చేసుకునే వారిని పక్కనబెట్టి పార్టీ అనుకూలురు, గులాబీ లీడర్స్​ అనుచరులకు ఇందులో పెద్దపీట వేశారు.   ఇష్టారీతిన స్కీం నడిపి ఫస్ట్​ ఫేజ్​లో 10,722,  సెకెండ్​ ఫేజ్​లో 929 మంది పేర్లతో యూనిట్లు శాంక్షన్​ చేసి సుమారు రూ.203 కోట్ల డబ్బును పేమెంట్​ చేశారు. యూనిట్​ కాస్ట్​ను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచారు.

కానీ గొర్రెల పంపిణీలో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో  కాంగ్రెస్​ సర్కారు స్టేట్​ లెవల్​ విచారణ చేయించింది.  దీంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కీంను తక్షణం ఆపేసి లబ్ధిదారుల వాటాగా తీసుకున్న డబ్బులను రిటర్న్  ఇవ్వాలని ఆఫీసర్లను గవర్నమెంట్ ఆదేశించింది.  

రూ.3.71 కోట్లు వాపస్​

అవినీతితో నడిచిన స్కీంను నిలిపేసి అసలు దరఖాస్తు చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకునేందుకు కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. గొర్రెల పథకానికి దరఖాస్తు చేసే వారు లబ్దిదారు వాటాగా రూ.43,750 డబ్బును బ్యాంకు డీడీ రూపంలో అందించారు.  ఆరు నెలల వాలిడిటీ మాత్రమే ఉండే డీడీలను బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ నగదుగా మార్చేసుకుంది. ఇప్పుడా సొమ్ము రిటర్న్ చేయడానికి కాంగ్రెస్​ సర్కారు దరఖాస్తుదారుల బ్యాంకు అకౌంట్స్​ తప్పనిసరి చేసింది. నిజమైన దరఖాస్తుదారులు ఉంటే వారి ఖాతాకు నేరుగా డబ్బు డిపాజిట్​ అవుతుంది.  ఇలా గత రెండు నెలల్లో 849 మందికి రూ.3.71 కోట్లను రిటర్న్​ చేశారు.  

అప్లికేషన్స్​ ఇస్తేనే మనీ రిటర్న్​

గవర్నమెంట్​ ఆదేశాల మేరకు  నడుచుకుంటున్నాం. స్కీం శాంక్షన్​ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్న వారు ఇప్పుడు స్వయంగా వచ్చి లెటర్​ ఇచ్చి బ్యాంకు అకౌంట్​ ఇతర వివరాలు తెలపాలి. వారి ఖాతాలకే డబ్బులు పంపిస్తాం.

 జగన్నాథ్​చారి, జిల్లా వెటర్నరీ ఆఫీసర్​