- ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
- త్వరలోనే ఉత్తర్వులు
- చైర్మన్లుగా పార్టీ నేతలకు అవకాశం
- జిల్లా కలెక్టర్ లేదా అడిషనల్ కలెక్టర్కు వైస్ చైర్మన్ బాధ్యతలు!
హైదరాబాద్, వెలుగు : రాష్ర్టంలో జిల్లాకు ఒక అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకు కసరత్తు అంతా పూర్తయిందని, త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుందని మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో హెచ్ఎండీఏతో కలిపి 10 అథారిటీలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా జిల్లా కేంద్రాలవారీగా ఈ అథారిటీలు రానున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటికి చైర్మన్లుగా పార్టీ నేతలను నియమించనున్నారు.
అలాగే వైస్ చైర్మన్ లేదా ఎండీలుగా కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా.. రాష్ర్ట జనాభాలో సుమారు 49 శాతం పట్టణ జనాభానే ఉంది. 2031 వరకు అర్బన్ జనాభా 60 శాతానికి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జనాభాకు అనుగుణంగా మౌలికవసతులు అయిన నీరు, కరెంట్, రోడ్లు, డ్రైనేజ్ ఇలాంటి సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా రూ.వేలకోట్లు ఖర్చుపెడుతున్నాయి. వీటికి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి మరింత పెరగనుంది.
జిల్లా కేంద్రానికి ఉన్న సమీప గ్రామ పంచాయతీలను విలీనం చేసి ఈ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. టౌన్ ప్లానింగ్ తో స్కీమ్ లను ఈ అథారిటీలో అమలు చేయడంతో పాటు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు, సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు స్లమ్ ఏరియాల అభివృద్ధి కూడా వేగం కానుంది. ఈ అథారిటీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అధికారులను నియమించనుంది. అర్బన్ ఏరియా డెవలప్ మెంట్ కు కేంద్ర ప్రభుత్వం నుంచీ నిధులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
ప్రస్తుతం 10 అథారిటీలు
రాష్ర్టంలో తొలి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ హుడా 1975లో ఏర్పాటు కాగా హైదరాబాద్ శివా రులో 30 మున్సిపాలిటీలను విలీనం చేసి 2008లో హెచ్ఎండీఏగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. తరువాత వరంగల్ మున్సిపాలిటీ ఉండగా కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ, వీటితో పాటు కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ, నిజమాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ, స్తంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ఖమ్మం)
శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కరీంనగర్), నీలగిరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (నల్గొండ), మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ, గజ్వేల్ డెవలప్ మెంట్ అథారిటీ, సిద్దిపేట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ, యాదగిరిగుట్ట డెవలప్ మెంట్ అథారిటీ, వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ, కొడంగల్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు ఉన్నాయి.