కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై ఫోకస్
మునుగోడు, (నల్గొండ జిల్లా): మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని మార్చింది. గత ఉప ఎన్నికల ఓటమిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారానికి రెడీ అయ్యింది. టీఆర్ఎస్-బీజేపీ పార్టీలకు దీటుగా ప్లాన్లు వేస్తూ.. సిట్టింగ్ సీటును కైవసం చేసుకుంటామంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టడం ద్వారా కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగు పరచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మునుగోడులో ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇంచార్జ్ల నియామకం
ఉప ఎన్నికలు జరుగుతున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు దృష్టి సారించారు. మునుగోడులోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇంచార్జ్ లను నియమించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీ నుంచి ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన పాల్వాయి స్రవంతి తన గెలుపు కోసం అందర్నీ కలుపుకుని వెళ్లేలా కృషి చేస్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లిన పాల్వాయి స్రవంతి మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆయన ఇంటికి పాల్వాయి స్రవంతి వెళ్లినప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు.
విషయం తెలుసుకుని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి తిరిగొచ్చాక పాల్వాయి స్రవంతిని రమ్మని ఆహ్వానించగా ఆమె వెళ్లి కలిశారు. ఎన్నికల ప్రచారానికి రావాలని స్రవంతి కోరగా వస్తానని ఎంపీ కోమటి రెడ్డి మాటిచ్చారని.. ఆయనను పాల్వాయి స్రవంతి ప్రసన్నం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు మద్దతుగా వెంకట్ రెడ్డి కూడా ప్రచారం చేస్తారని ఆమె ధీమాతో ఉన్నారు. పాల్వాయి స్రవంతి నేరుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికే వెళ్లి కలిసి మాట్లాడిన ఘటన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్తేజ పరచింది.
మరోవైపు సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క, మధు యాష్కీ గౌడ్, మాజీ ఎంపీ వి.హనుమంత రావులతో పాల్వాయి స్రవంతి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు టికెట్ ఆశించిన అసంతృప్త నేతలతో పాల్వాయి స్రవంతి భేటీ అయ్యారు. టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, కైలాష్ లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సమావేశమై తాజా పరిస్థితులను రేవంత్ రెడ్డి వివరించారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ సీనియర్లు దిశానిర్దేశం చేశారు. పాల్వాయి స్రవంతిని మునుగోడు అభ్యుర్థిగా ఎంపిక చేయడం వెనక ఉన్న ఉద్దేశాన్ని పార్టీ నేతలకు వివరించారు. సిట్టింగ్ సీటును కాపాడుకునే విధంగా నేతలంతా సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు గేరు మార్చి టాప్ గేరులో వెళ్లేందుకు అవసరమైన వ్యూహ ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎదుటి పార్టీలకు ధన, అధికార బలం అండగా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జనబలాన్నే నమ్ముకుని ముందుకు వెళుతోంది. అస్త్ర శస్త్రాలను రెడీ చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. గత ఎన్నికల్లో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లోనూ మునుగోడులో కాంగ్రెస్ గెలిచిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.