
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ క్యాంపెయిన్‌ను కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని నిర్ణయించింది. ఇటీవల కర్నాటకలోని బెళగావిలో జరిగిన 100 ఏండ్ల క్రితం జరిపిన ఒక మీటింగ్‌ను రీకాల్ చేస్తూ.. ఈ నినాదంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నది. ఈ దేశ నిర్మాణానికి అపార సేవలు అందించిన మహనీయులను బీజేపీ తక్కువ చేసి చూపడం పట్ల జాతీయ కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రతిస్పందిస్తున్నారు. అంబేద్కర్‌కు జరిగిన అవమానం గురించి దేశ ప్రజలను మేల్కొల్పడం ద్వారా ఈ ప్రచార లక్ష్యాన్ని అనేక వేదికల నుంచి కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. గత ఏడాది డిసెంబర్ 17న రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిస్తూ, అంబేద్కర్ పేరును పదే పదే వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అహంకారపూరిత ప్రకటన చేశారు. ‘అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని చెప్పడం ఒక ఫ్యాషన్‌గా మారింది. దేవుని పేరును చాలాసార్లు మాట్లాడి ఉంటే, వారికి స్వర్గంలో స్థానం లభించేది’ అంటూ అమిత్ షా తన ద్వేషాన్ని బయటపెట్టుకున్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోదీ జోక్యం చేసుకుంటారని యావత్ దేశమంతా ఆశించింది. కానీ ప్రధాని మోదీ.. హోం మంత్రికి మద్దతు ఇచ్చి అంబేద్కర్ ను అవమానించడంలో భాగస్వామి అయ్యారు. 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి.. బీజేపీ-, ఆర్ఎస్ఎస్ దశాబ్దాలుగా అంబేద్కర్‌ను, రాజ్యాం గాన్ని ఎలా కించపరుస్తోందో ప్రజలకు తెలపాలని బెళగావి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నారు
1949 నవంబర్ 30న ఆర్‌ఎస్‌ఎస్ తన అధికార పత్రిక 'ఆర్గనైజర్'లో రాజ్యాంగాన్ని 'భారతీయం కానిది' అని ఎలా అభివర్ణించిందో కూడా మనమంతా ఒకసారి మననం చేసుకోవాలి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చగలమని బీజేపీ భావించింది. కానీ, ఈ దేశ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారు. ప్రపంచం మొత్తం ఆదర్శంగా భావించే మహాత్మా గాంధీని ఆయన సొంత దేశంలోని ఒక పాలక పార్టీ నెమ్మదిగా తొలగిస్తోందని ఇంటర్నేషనల్ మీడియా కూడా వార్తలు రాసిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసి బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వారసత్వాన్ని కాపాడేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కేవలం ఆర్ఎస్ఎస్, జనసంఘ్ పార్టీకి మాత్రమే సేవలు అందించారు. అటువంటి నాయకుడిని కీర్తించేందుకు బీజేపీ నేడు దేశవ్యాప్తంగా ఎన్నో చర్యలు చేపడుతోంది.
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం
దేశంలో దళితులు, ఆదివాసీలకు సంబంధించిన చట్టాలను మోదీ సర్కారు పూర్తిగా బలహీనపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బీజేపీ దాని సైద్ధాంతిక గురువైన ఆర్ఎస్ఎస్ ఆలోచనలు భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్థలకు వ్యతిరేకం. బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అవమానించడం లేదా ఆయనకు వ్యతిరేకంగా కుట్ర చేయడం అంటే ఈ దేశంలోని 90 శాతం ప్రజల హక్కులను ఉల్లంఘించడంగానే భావించాలి. ఒకప్పుడు భారతదేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యానికి నిర్మాతగా నిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు రాహుల్ గాంధీ, ఖర్గే నేతృత్వంలో పోరాటం చేస్తున్నది. ఈ నినాదం మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (భీమ్), భారత రాజ్యాంగం (సంవిధాన్) ఆదర్శాలను మరొకసారి ఈ జాతికి తెలిపే ప్రయత్నం చేస్తున్నది.
రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చిన్నపు రెడ్డి పదవిలో ఉన్నప్పుడు తన తీర్పులో భాగంగా ఒకసారి రిజర్వేషన్ల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుకబాటుతనం అనేది ఏ వర్గం, ఏ మతం, ఏ కులంలో ఉన్నా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. పార్ల మెంటు ఎన్నికల సమయంలో బీజేపీ అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లిందన్న విషయం మనకి తెలిసిందే. ప్రజలు వాళ్ల కుట్రలను గ్రహించే 240 సీట్లకు పరిమితం చేశారు. మోదీ సర్కార్ కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీం, జై సంవిధాన్ నినాదాన్ని జనాల్లోకి తీసుకువెళుతోంది.
- సాగర్ వనపర్తి