హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సిటీలో ఇతర పార్టీ నేతలను.. హస్తం గూటికి చేర్చే పనిలో పడింది. ఇక గ్రేటర్ ను మూడు భాగాలుగా చేసి పార్టీ ప్రెసిడెంట్లను నియమించాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తులపై దృష్టి పెట్టింది. వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్లు రెడీ చేసింది. ఇప్పటికే ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డికి... ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి పార్టీ కండువా కప్పినట్లు తెలుస్తోంది. అదే విధంగా లోకల్ గా బలమైన నేతలకు టికెట్ల ఎరవేసి.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.
హైదరాబాద్ పై మరింత పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఓ వైపు చేరికలకు ప్రాధాన్యం ఇస్తూనే... మరోవైపు సొంత పార్టీ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే పనిలో పడ్డారు. గ్రేటర్ లోనే ముగ్గురు నేతలను డీసీసీ ప్రెసిడెంట్లుగా నియమించాలని భావిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అంజన్ కుమార్ యాదవ్.. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం పార్టీలో చాలా మంది పోటీపడుతున్నారు. ఐతే సిటీని మూడు విభాగాలుగా విభజించి.. ప్రెసిడెంట్లను పెట్టాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం..
గ్రేటర్ లోని హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ల కింద మొత్తం 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఐదు స్థానాలకు ఒక డీసీసీ అధ్యక్షుడి చొప్పున ముగ్గురిని డీసీసీ ప్రెసిడెంట్లుగా పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ డీసీసీలుగా ఏర్పడనున్నాయి. లేదంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పేర్లతో నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు ప్రెసిడెంట్లను కూడా రేవంత్ తన వర్గం నేతలకు కట్టబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు గాంధీ భవన్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు ప్రెసిడెంట్ల పదవుల విషయంలో ఓ ఇద్దరు నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ డీసీసీ పదవి కోసం ఓ మైనార్టీ నేత సిరీయస్ గా పట్టుబడుతున్నట్లు టాక్. ఎంఐఎం పార్టీకి చెందిన ఒకరిద్దరు కార్పొరేటర్లు పదవిస్తే పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. అందుకు తగ్గట్లుగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.