‘ధర్మపురి’ ఈవీఎం స్ట్రాంగ్ ​రూం వ్యవహారంపై ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

‘ధర్మపురి’ ఈవీఎం స్ట్రాంగ్ ​రూం వ్యవహారంపై ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు : ధర్మపురి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూం తాళాలు పోయిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్​ పార్టీ మంగళవారం లేఖ రాసింది. ఓట్ల రీకౌంటింగ్​కు సంబంధించి 17ఏ, 17సీ పేపర్లను సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించడంతో సోమవారం జగిత్యాల జిల్లా మల్యాలలోని వీఆర్​కే కాలేజీలో ఉన్న 3 స్ట్రాంగ్​ రూంలను తెరిచేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ జి.నిరంజన్​ పేర్కొన్నారు.

ఒక రూమ్​ను తెరిచినా.. మిగతా రెండు స్ట్రాంగ్​ రూంలను తెరవలేదని, తాళాలు పోయాయని అధికారులు చెప్పారన్నారు.  కలెక్టర్​ సమక్షంలో తాళాలను పగలగొట్టేందుకు ప్రయత్నించగా.. కాంగ్రెస్​ అభ్యర్థి లక్ష్మణ్​ అడ్డుకున్నారన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థిపై స్వల్ప ఓట్ల తేడాతో నెగ్గిన బీఆర్ఎస్​ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్​ ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారని, ఈ విషయంలో ఏదో గోల్​మాల్​ జరిగి ఉండొచ్చని ఆక్షేపించారు.