రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు, 2024 ఎన్నికల్లో నిలిచేందుకు కొన్ని స్పష్టమైన లక్ష్యాలను, రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసినట్లుగా కనిపించింది. అయితే 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ కూడా ఇదే తరహాలో జరిగింది. ప్రజలు విసిగిపోయారని, బీజేపీ సులువుగా ఓడిపోతుందని, కాంగ్రెస్ గెలుస్తుందని ఆశించారు. కానీ 2019 ఫలితాలు భిన్నంగా వచ్చాయి. 544 ఎంపీల్లో 300 మంది ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేయబోయే కొన్ని నిర్దిష్ట విషయాలు వెల్లడించినప్పటికీ, నరేంద్ర మోడీని ఓడించడమే ప్రాథమిక ఇతివృత్తంగా నిన్నటి కాంగ్రెస్ ప్లీనరీ నడిచింది.
దేశంలో నిరుద్యోగం బాగా ఉందని, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, సామాజిక విభజనలు ఉన్నాయని ప్లీనరీ పేర్కొంది. దీంతోపాటు పొత్తులు, ప్రతిపక్షాల ఐక్యతపై కూడా ప్లీనరీ దృష్టి పెట్టింది. తమకు మెజారిటీ రాదని, ప్రతిపక్షాల ఐక్యత మాత్రమే బీజేపీని ఓడించగలదని కాంగ్రెస్ బహిరంగంగా అంగీకరించింది. ప్రతిపక్షానికి నాయకత్వం వహించేంత పెద్దది కాంగ్రెస్ మాత్రమేనని, ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపింది. గాంధీల కుటుంబాన్ని పొగుడుతూ, అందరినీ విస్మరిస్తూ ఎన్నో ప్రసంగాలు జరిగాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేషమైన ఆదరణ వచ్చిందని, 130 రోజులు పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ మునిగిపోతున్న కాంగ్రెస్‌కు పునర్జీవం పోశారని ప్లీనరీ పేర్కొంది. ఇలాంటి భజనపరులే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలను కూడా నిలిపివేశారు. దీంతో ప్లీనరీలో కాంగ్రెస్‌కు శక్తినిచ్చే గొప్ప అవకాశం పోయినట్లయింది.
రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వమే అసలు సమస్య!
రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థి అని చెబితే విపక్షాల ఐక్యత ఉండదని గాంధీ వర్గీయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం రాహుల్‌గాంధీని పక్కనపెట్టాలని ఎవరైనా కాంగ్రెస్ లీడర్భావిస్తే, వెంటనే ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లడం ఖాయం. అయితే రాహుల్ గాంధీ తన ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ చెబితే, ఇతర ప్రతిపక్షాలు దానికి ఒప్పుకోవు. ఇది కాంగ్రెస్‌కు చాలా పెద్ద సందిగ్ధావస్థ. ఈ సవాల్‌ను తప్పించుకోవడానికే కాంగ్రెస్ ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తుందని చెబుతున్నది. ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు బీజేపీని ఓడిస్తే రాహుల్‌గాంధీ కిరీటం ఖాయం అన్నది ఆ పార్టీ ఆలోచన.
కలిసిరాని నేతలు
భారత్‌జోడో యాత్రలో ప్రతిపక్షాలన్నీ తనతో కలిసి వస్తాయనీ, “పట్టాభిషేకం” ఉంటుందనీ రాహుల్ గాంధీ అంచనా వేశారు. కానీ రాహుల్ యాత్రలో ముఖ్య నేతలెవరూ పెద్దగా చేరలేదు. దీన్ని బట్టి చూస్తే అలాంటి నేతలకు రాహుల్ గాంధీపై అనుమానం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలను ఓడించాలని, బీజేపీ, కాంగ్రేస్సేతర ప్రభుత్వం రావాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. విచిత్రమేమిటంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కూటమిలో కూడా శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే లాంటి వాళ్లు ప్రధాని కావాలనుకుంటున్నారు. ఈ నాయకులు బహిరంగంగా విధేయతను ప్రదర్శిస్తారు, కానీ రహస్యంగా, వారు రాహుల్ గాంధీని వ్యతిరేకించాలని ఇతర ప్రతిపక్ష నాయకులను ప్రోత్సహిస్తున్నారు.
ప్రతిపక్షాల ఐక్యత అంత ఈజీ కాదు
ప్రతిపక్ష ఐక్యతను కాపాడుకోవడం అంటే అనేక రాజకీయ పార్టీలకు రాయితీలు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి అనేక అంశాలకు కాంగ్రెస్ సిద్ధంగా లేకపోతే ప్రతిపక్ష ఐక్యత ఉండదు. తనతో ఎవరూ కలిసి రారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్షాల ఐక్యత రావాలంటే మాయావతిని చేర్చుకోవాలి. తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తేనే కూటమిలో చేరతానని మాయావతి గతంలో బహిరంగంగానే చెప్పారు. మాయావతి లేకుండా భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో ప్రతిపక్ష ఐక్యత ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్ ఐక్యత కావాలంటే కేసీఆర్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్‌కు దాదాపు 30 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని అనుకుంటే, మిగతా 90 స్థానాల్లో కేసీఆర్‌కు మద్దతివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల్లో గెలిస్తే, పార్లమెంటుకు పొత్తు కావాలా? వద్దా అని తేల్చుకోవడానికి ఆయనకు 6 నెలల సమయం ఉంటుంది. తద్వారా లాభం పూర్తిగా కేసీఆర్ దే అవుతుంది. ఢిల్లీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటే తనకు కష్టాలు తప్పవని కేసీఆర్ కు కూడా తెలుసు. బెంగాల్‌లో ఐక్యత కోసం, కాంగ్రెస్ చిన్న పాత్ర మాత్రమే పోషించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని మమతా బెనర్జీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మొన్న ఫిబ్రవరి 23న రాహుల్ గాంధీ మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌తో ఏకం కావాలంటే, పంజాబ్, ఢిల్లీ రెండింటిలోనూ కాంగ్రెస్ చాలా చిన్న పాత్రకు పరిమితమవ్వాలి. కొన్ని ఎంపీ స్థానాల కోసం తెలంగాణ, తమిళనాడులో మాదిరిగానే పంజాబ్, ఢిల్లీలోనూ కాంగ్రెస్ కార్యాలయాలను మూసేయాల్సి ఉంటుంది. ఐక్యత సాధించాలంటే, ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి కాదని కాంగ్రెస్ ప్రకటించాలి. అది జరగని పని!
చుట్టూ భజనపరులుంటే నష్టమే!
2024లో ఎవరు గెలుస్తారో తేల్చడం చాలా కష్టం. రాహుల్ గాంధీ ఎంపిక ఇంకా కష్టం. ప్రతిపక్షాల ఐక్యత కోసం రాహుల్ గాంధీ తన ఆశయాలను వదులుకోవాలి. రాహుల్ గాంధీ తన ఆశయాల వైపు మొగ్గు చూపితే మాత్రం ప్రతిపక్షాల ఐక్యత ఉండదు. నరేంద్ర మోడీ మూడోసారి గెలుపొందవచ్చని, కాంగ్రెస్ పతనం కొనసాగుతుందని కూడా గాంధీ కుటుంబానికి ఎక్కడో అనుమానం ఉన్నది. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, చుట్టూ భజనపరులు, కోటరీలు, మోసగాళ్లు ఉండకూడదు. రాయ్‌పూర్‌లో ప్రియాంక గాంధీకి స్వాగతం పలికేందుకు రూ.45 లక్షలతో 7000 కేజీల ఎర్ర గులాబీలు కొని 2 కిలోమీటర్ల పొడవున రోడ్డుపై పోశారు. ఇలాంటి భజనపరులు చుట్టూ ఉంటే.. నాయకుడు సరైన ఎంపికలు, నిర్ణయాలు చేయగలుగుతారా?
– డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్