ఈసీకి కాంగ్రెస్ సూచన
న్యూఢిల్లీ : ఎన్నికల టైంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్ (ఈసీ)కి లేదని కాంగ్రెస్ తెలిపింది. ఈ అంశం ఓటర్ల విశ్లేషణపై ఆధారపడి ఉంటుందని...అందువల్ల దీన్ని వారి విజ్ఞతకే వదిలేయాలని చెప్పింది. ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేసి..స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడంపై ఈసీ ఫోకస్ పెట్టాలని సూచించింది. ఇటీవల మోడల్ ఎలక్షన్ కోడ్ సవరణ ప్రతిపాదనను ఈసీ, రాజకీయ పార్టీల ముందుకు తెచ్చింది. ఎన్నికల వాగ్దానాలు, వాటిని తీర్చే ఆర్థిక సాధ్యతపై ఓటర్లకు సరైన సమాచారాన్ని అందించే అంశమై అక్టోబర్ 4న పొలిటికల్ పార్టీల అభిప్రాయాన్ని కోరింది.
ఈ ప్రతిపాదనపై గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలు అక్టోబర్ 19లోపు తమ ఒపీనియన్ తెలియజేయాలని ఈసీ విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు శుక్రవారం లెటర్ రాశారు. ఉచిత హామీల సమస్య ఈసీ పరిధిలోకి రాదని, ఉచితాల నిర్వచనంపై ఎన్నికల సంఘం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు. ఉచిత హామీల కంటే బర్నింగ్ సమస్యలు చాలా ఉన్నాయని తెలిపారు. వాటిపై ఈసీ ఫోకస్ పెట్టాలని సూచించారు.