బైక్‌‌ అదుపుతప్పి కానిస్టేబుల్‌‌ మృతి

బైక్‌‌ అదుపుతప్పి కానిస్టేబుల్‌‌ మృతి

పటాన్‌‌చెరు/చేవెళ్ల, వెలుగు: అడవి పందిని తప్పించే ప్రయత్నంలో బైక్‌‌ అదుపుతప్పి కిందపడడంతో ఓ కానిస్టేబుల్‌‌ చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్‌‌ భానూర్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంకర్‌‌పల్లి మండలం బల్కాపూర్‌‌ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీనివాస్ (28) వికారాబాద్‌‌లో ఏఆర్‌‌ కానిస్టేబుల్‌‌ కాగా ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య వద్ద గన్‌‌మెన్‌‌గా పనిచేస్తున్నాడు. తన అమ్మమ్మ ఊరైన పటాన్‌‌చెరు మండలం ఎలిమెల గ్రామంలో ఆదివారం జాతర జరగడంతో గ్రామానికి వచ్చాడు. అనంతరం రాత్రి బైక్‌‌పై బుల్కాపూర్‌‌ గ్రామానికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఎలిమెల తండా శివారులోకి రాగానే అడవి పంది అడ్డు వచ్చింది.

పందిని తప్పించబోయే ప్రయత్నంలో బైక్‌‌ అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌‌ అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, శ్రీనివాస్‌‌ మృతదేహాన్ని పటాన్‌‌చెరు హాస్పిటల్‌‌కు తరలించారు. శ్రీనివాస్‌‌ మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య పటాన్‌‌చెరు హాస్పిటల్‌‌కు చేరుకున్నారు. శ్రీనివాస్‌‌ నాలుగేండ్లుగా తన వద్ద గన్‌‌మెన్‌‌గా పనిచేస్తున్నాడన్నారు. శ్రీనివాస్‌‌ కుటుంబానికి సానుభూతి తెలిపారు. అనంతరం రూ. 50 వేల ఆర్థికసాయం అందజేశారు.