
ఆసిఫాబాద్, వెలుగు: దేశంలో మతతత్వ రాజకీయాలు నడుస్తున్నాయని, రాజ్యాంగం పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అలీ అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ లో ఏర్పాటు చేసిన సంవిధాన్ బచావో సభ లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు జై బాపూ, జై సంవిధాన్, జై భీమ్ ప్రోగ్రాం పకడ్బందీగా నిర్వహిస్తున్నామ న్నారు.
కాంగ్రెస్ లో వ్యక్తి కన్న పార్టీ ముఖ్యమని, పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని చోట్ల గెలవడం ఖాయమన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. ఆసిఫాబాద్ లో కొందరు పోలీస్, రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, పనులపై ఆఫీసులకు వెళ్తే.. విలువ ఇవ్వడం లేదని, బీఆర్ఎస్, బీజేపీ నేతలు డబ్బులు ఇస్తున్నారని, తీరు మారకుంటే ఇబ్బందులు పడతారని ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఇన్ చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ హెచ్చరించారు. మాట వినని అధికారులను పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.