ఇంటిగ్రేటెట్​ మార్కెట్ల నిర్మాణం.. పునాదులకే పరిమితం!

  • కోదాడ, హుజూర్​నగర్​లో బిల్లులు రాక పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు
  • రెండేండ్లు గడిచినా ముందుకు సాగట్లే.. 
  • సూర్యాపేటలో కంప్లీట్​ అయినా ప్రారంభం కానీ మార్కెట్

సూర్యాపేట, వెలుగు 
సూర్యాపేట జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం పునాదులకే పరిమితమైంది. కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం, చేపల మార్కెట్లను ఒకే చోట ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని వస్తువులు ఒకే దగ్గర అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సూర్యాపేట జిల్లాలో వీటికి ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేసి తమ ఘనతగా ఎన్నోసార్లు చెప్పుకున్నారు. కానీ  నిధుల లేమి, మార్కెట్ల నిర్మాణంపై ప్రజా ప్రతినిధులు అశ్రద్ధ ఈ  నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా కేవలం మూడు మున్సిపాలిటీల్లోనే ఈ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అందులో హుజూర్ నగర్ లో 2017లో రూ. 7.60కోట్లతో, కోదాడలో 2021లో రూ. 7.20కోట్లతో చేపట్టిన మార్కెట్ నిర్మాణం పనులు ఇంకా పునాదుల వద్దే ఉన్నాయి. బిల్లులు ఇన్​టైంలో రాకపోవడంతోనే కాంట్రాక్టర్లు పనులు ఆపేసినట్లు తెలుస్తోంది. 

సూర్యాపేటలో కంప్లీట్​ అయినా... 

రూ.29కోట్ల ఎస్టిమేషన్​తో 2017లో సూర్యాపేట షురూ చేసిన ఇంటిగ్రెట్​ మార్కెట్​ప్రస్తుతం కంప్లీట్​అయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. సూర్యాపేటతో పాటు పనులు ప్రారంభించిన సిద్దిపేట, జగిత్యాల మార్కెట్లు నిర్మాణాలు ఎప్పుడో పూర్తి  అయ్యి వ్యాపారాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ మార్కెట్​ ఎన్నికల టైంలో  ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది చిరు వ్యాపారులకు సరైన చోటు దొరక్క రోడ్లపైనే విక్రయాలు చేపడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిగ్రేటెడ్‌మార్కెట్లు పూర్తయితే వ్యాపారులకు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటాయని, త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు. 

పనులు స్పీడప్​ చేయాలి 

కొత్తగా నిర్మాణం చేపట్టిన మటన్ చికెన్ షాపులు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి. మార్కెట్​ ప్రారంభిస్తే అన్నీ రకాల ఇంటి అవసరాలు ఒక్క దగ్గర సులభంగా దొరుకుతాయి . వినియోగదారులకు , వ్యాపారులుకు కూడా లాభం ఉంటుంది. 

- యర్రగొర్ల గంగరాజు, మాంసం వ్యాపారి, హుజూర్ నగర్

త్వరలోనే పూర్తి చేస్తాం

స్పెషల్ ఫండ్స్ తో చేపట్టిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు మొదలైన తర్వాత బిల్లులు రావడం కాస్త ఆలస్యం కావడంతో పనులు స్లోగా సాగుతున్నాయి.  త్వరలోనే పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి మార్కెట్ ను అందుబాటులోకి తీసుకొస్తాం.

- లావణ్య, మున్సిపల్ డీఈ, హుజూర్ నగర్