- రూ.4 కోట్లతో 40 ఎకరాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు
- నిరుడు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
- గుంతలు తీసి చేతులు దులిపేసుకున్న కుడా ఆఫీసర్లు
- రూ.లక్షలు పెట్టి తెచ్చిన మొక్కలన్నీ వృథా
హనుమకొండ, వెలుగు: జీడబ్ల్యూఎంసీ పరిధిలోని రాంపూర్ వద్ద నిర్మించతలపెట్టిన ఆక్సిజన్ పార్క్ నిర్మాణం ఆఫీసర్లు, లీడర్ల పట్టింపులేనితనం వల్ల మధ్యలోనే ఆగిపోయింది. జనాలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అర్బన్ లంగ్ స్పేస్ గా ఏర్పాటు చేయాలనుకున్న ఈ పార్క్ పనులు.. ఏండ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడటం లేదు. గత గ్రేటర్ ఎలక్షన్స్ ముందు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన చేసినా ఇంతవరకు మొక్కలు నాటిన పాపానపోలేదు. దీంతో రూ.కోట్లతో ప్లాన్ చేసిన ఆక్సిజన్ పార్కు కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఆ స్థలమంతా మందుబాబులకు అడ్డాగా మారింది.
2019లోనే ప్లాన్..
కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు రాంపూర్ వద్ద ‘ఆక్సిజన్ పార్క్’ ఏర్పాటుకు 2019లో అప్పటి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్లాన్ చేశారు. రాంపూర్ చెరువును ఆనుకుని ఉన్న ప్రభుత్వానికి చెందిన స్థలం 40 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసి, అందులో కాకతీయుల నిర్మాణ శైలి కనిపించేలా రాతి కట్టడాలు, 10 ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్, 2 ఎకరాల్లో మియావాకీ ఫారెస్ట్, వాకింగ్ ట్రాక్స్, ఫుడ్ కోర్ట్స్, పిల్లలకు ఉపయోగపడే గేమ్స్ ఎక్విప్మెంట్, వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు నాటేందుకు ప్లాన్ చేశారు. దీనికి రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
శంకుస్థాపనకే పరిమితం..
2019లో పార్కు నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉన్నా.. రెండేండ్ల తర్వాత 2021లో గ్రేటర్ వరంగల్ ఎలక్షన్స్ కు కొద్దిరోజుల ముందు మంత్రి కేటీఆర్ కొబ్బరికాయ కొట్టి వెళ్లారు. ఆ తరువాత పట్టించుకునే నాథుడే లేడు. పార్కు డిజైనింగ్లోపాల కారణంగానే పనులు ముందుకు సాగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
గుంతలే మిగిలినయ్
ఆక్సిజన్ పార్కు కోసం ఆఫీసర్లు నిర్దేశించుకున్న స్థలం వద్ద ఒక ఆర్చీని నిర్మించారు. ఆ స్థలం చుట్టూ రూ.లక్షలు ఖర్చు పెట్టి కాంపౌండ్ కట్టారు. తర్వాత పార్కులో ‘లేక్ వ్యూ’ కోసం రాంపూర్ చెరువు మధ్య వరకు హద్దు ఏర్పాటు చేశారు. మిగతా స్థలంలో మొక్కలు ఏర్పాటు చేశారు. మంత్రి శంకుస్థాపన చేసిన తరువాత హడావుడిగా కొన్ని మొక్కలు నాటారు. మరికొన్ని నాటేందుకు గుంతలు తీశారు. కానీ ఆ తరువాత పడిన భారీ వర్షాల వల్ల చెరువు నిండి ఆక్సిజన్ పార్కుకు కేటాయించిన స్థలం సగం వరకు మునిగింది. దీంతో నాటిన మొక్కలతో పాటు, నాటడానికి తెచ్చినవీ మునిగిపోయాయి. ఆ తరువాత ఏ పనులు చేపట్టకుండా అలాగే వదిలేశారు. ఫలితంగా రూ.లక్షలు పెట్టి తెచ్చిన మొక్కలు ఎండిపోగా.. ఆ స్థలంలో కేవలం గుంతలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అదంతా పిచ్చిమొక్క లకు నిలయంగా మారింది. సరైన రక్షణ ఏర్పాట్లు లేక ఆహ్లాదాన్ని అందించాల్సిన పార్కు కాస్త అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఎక్కడపడితే అక్కడ బీరు సీసా లు దర్శనమిస్తున్నాయి. కొంతమంది టాయిలెట్ కోసం ఉపయోగిస్తుండటంతో ఆ ప్రాంగణమంతా కంపుకడుతోంది. ఇకనైనా జీడబ్ల్యూఎంసీ, కుడా ఆఫీసర్లు చొరవ తీసుకుని సాధ్యమైనంత తొందర్లో ఆక్సిజన్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలని నగర ప్రజలు విజ్ఞప్తిచేస్తున్నారు.
ఇంకా ఫైనల్ కాలే
ఆక్సిజన్ పార్కులో వాకింగ్ ట్రాకులు, ఫుడ్ కోర్టులు, పిల్లల కోసం స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇంకా ప్రతిపాదనలు ఫైనల్ కాలేదు. రాంపూర్ చెరువు, గ్రీనరీ, వివిధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తొందర్లోనే ఆక్సిజన్ పార్కును అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. - సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, కుడా చైర్మన్