తూప్రాన్ లో పిల్లర్ల స్టేజీలో... మనోహరాబాద్ లో ఇంకా షురూ కాలే..
ఇరుకు గదుల్లోనే కార్యాలయాలు.. ఇబ్బందుల్లో సిబ్బంది, ప్రజలు
మెదక్/ తూప్రాన్/మనోహరాబాద్, వెలుగు : మెదక్ జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్ మండల కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ లు మంజూరయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ నుంచి తూప్రాన్ కు రూ.8 కోట్లు, మనోహరాబాద్‌కు రూ.5 కోట్లు కేటాయించింది. గత మేలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు ప్రారంభించి ఆరు నెలలో బిల్డింగ్ లు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ఆరు నెలలు కావస్తున్నా పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉండటం గమనార్హం.
ఇదీ పరిస్థితి...
తూప్రాన్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. పనులు ఇలాగే కొనసాగితే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన తూప్రాన్‌లో తహసీల్దార్ ఆఫీస్ ను పాత గ్రామ పంచాయతీ భవనంలో నిర్వహిస్తుండగా, ఇతర డిపార్ట్ మెంట్ల ఆఫీసులను ఎంపీడీఓ బిల్డింగ్ ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. సరైన వసతి సౌకర్యాలు లేకపోవడంతో ఆయా ఆఫీసుల అధికారులు, సిబ్బంది, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మనోహరాబాద్ మండల కేంద్రంలో స్థల సేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ మండలం కొత్తగా ఏర్పడగా తహసీల్దార్ ఆఫీస్ పాత ప్రభుత్వ పాఠశాల భవనంలో కొనసాగుతుండగా, ఎంపీడీఓ, తదితర ఆఫీసులు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తయితే ఇబ్బందులు దూరమవుతాయని భావించగా ఇంతవరకు పనులే మొదలు కాకపోవడంతో ఇబ్బందులు ఇంతట్లో తీరేలా కనిపించడం లేదు. సీఎం నియోజకవర్గంలోనే పనుల పరిస్థితి ఈ విధంగా ఉండటంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాంప్లెక్స్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
త్వరగా పూర్తయ్యేలా చర్యలు
తూప్రాన్, మనోహరాబాద్ లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ బిల్డింగ్ లను గడువులోగా పూర్తి చేసేందుకు కాంట్రాక్ట ర్ కు ఆదేశాలు జారీ చేశాం. కాంట్రాక్టు ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ వరకు సమయం ఉంది. అప్పటి వరకు పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. మనోహరాబాద్ లో స్థల సేకరణ ప్రాసేస్ పూర్తికాగానే పనులను ప్రారంభిస్తాం.
- నర్సింలు, పంచాయతీ రాజ్ డీఈఈ, తూప్రాన్