- కరోనా పెరుగుతుండటంతో సర్కార్ నిర్ణయం
- స్కూళ్లు ఎప్పట్లానే నడుస్తాయని వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్, యాక్టివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నయ్. దీంతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నయ్. ఇంతకుముందు కేసులు భారీగా తగ్గడంతో ప్రజలు మాస్క్ ధరించడాన్ని రాష్ట్రాలు పట్టించుకోలేదు. ప్రస్తుతం కేసులు పెరుగుతుండటంతో ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మాస్క్‌ను కచ్చితం చేసింది. తాజాగా ఢిల్లీలోనూ మాస్క్‌ను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. మాస్క్ ధరించని వారికి రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) అధికారులు వెల్లడించారు. దీనిపై తర్వలో అధికారిక ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. అయితే, ఢిల్లీలో స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని తెలిపారు. ఈ అంశంపై నిపుణులతో సంప్రదించి విద్యాసంస్థల్లో ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, వైరస్ కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు డీడీఎంఏ ఆఫీసర్లు తెలిపారు.