- ప్రజల సమస్యలు, ప్రకృతి, సామాజిక స్పృహ కల్పించిండు
- పల్లె అందాలు కళ్ల ముందు కనిపించేలా చేసిండు
- ఉద్యమాలకు ఊపుతెచ్చేలా పాటలు రాసిండు
- తాజాగా వరించిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
‘పొమ్మంటే పోవెందిర పోరా ఓ ఆంధ్ర దొర’ అని తెలంగాణ ఉద్యమంలో పాడినా.. ‘అపర ధనుర్దాసు మా నాయనా ఆది చెన్నుది అంశ మా నాయనా’ అంటూ తండ్రి గురించి చెప్పుకున్నా.. ‘సంతా మా ఊరి సంతా’ అని పల్లెల్లో వారం వారం కనిపించే వినోదాన్ని మన కళ్ల ముందు కదిలేలా చేసినా..'పల్లె కన్నీరు పెడుతుందో' అని అక్కడి సమస్యలతో కంట నీరు తెప్పించినా.. ప్రజల సమస్యలు, ప్రకృతి, సామాజిక స్పృహ ఉద్యమాలకు ఊపుతెచ్చేలా పాటలు రాసినా గోరటి వెంకన్నకే చెల్లింది. ఇవన్నీ ఆయనను ప్రజాకవిగా, గాయకుడిగా మనందరికీ దగ్గర చేశాయి. పల్లె సొగసులను పాటలోకి మార్చగలిగే భావుకత వెంకన్న సొంతం.. తెలంగాణ ప్రజల భాషకు, సహృదయతకు నిలువెత్తు రూపం.. ప్రజల హృదయాలను మురిపించే అలతి పదాలు ఆయన ప్రత్యేకత.. అందుకే గోరటి వెంకన్నకు ఎన్నో అవార్డులు, బిరుదులు పురస్కారాలు దక్కాయి. తాజాగా ఆయనను వరించిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఇందుకు నిదర్శనం.
పాలమూరు జిల్లాలోని నల్లమల కొండలకు దగ్గరలో ఉన్న 'గౌరారం'లో నర్సింహ, ఈరమ్మ దంపతులకు 1963లో గోరటి వెంకన్న పుట్టారు. పుట్టిన ఊరికి దగ్గరలో ఉన్న పల్నాడు ప్రాంతాన్ని ప్రభావితం చేసిన బ్రహ్మనాయుడు, కన్నమదాసు అంటే వెంకన్నకు అభిమానం. చెన్నకేశవాలయంలోని సంస్కృతి, బసవేశ్వరుడు ఆదరించిన స్త్రీవాద సంస్కృతిని అక్కమహాదేవి కవిత్వంలో గమనించారు వెంకన్న. ‘అపర ధనుర్దాసు మా నాయనా.. ఆది చెన్నుది అంశ మా నాయనా’ తన తండ్రి గురించి గొప్పగా చెప్పారు వెంకన్న. హఠయోగి చన్నదాసు శిష్యుడైన గోరటి నర్సింహ.. వెంకన్నలోని ఆధ్యాత్మిక, తాత్విక ఆలోచనలకు బీజం వేశారు. అదే వెంకన్నను గొప్ప సామాజిక, తత్వవేత్తగా నిలబెట్టింది. కొంతకాలం మావోను అభిమానించినా.. గ్యాస్ చాంబర్లలో వేసి జనాన్ని చంపిన ‘తియాన్మెన్ స్క్వేర్’ను ఆయన కోరుకోలేదు.
కాళోజీ పురస్కారం మరో మకుటం
ఉద్యమం తన పాటలో ఊటగా మారినప్పుడు, తన యవ్వనం ఉడుకురక్తం అవుతుందని గుర్తు చేసినప్పుడు ‘ఏకునాదం మోత' అనే గేయాల సంకలనాన్ని వెంకన్న వెలువరించారు. ప్రకృతి తాదాత్మ్యాన్ని దర్శించినపుడు ‘రేలపూతలు' అనే మరో గేయసంపుటిని అచ్చువేసుకొన్నారు. మరింత పరిపక్వత సాధించినప్పుడు 'అలసెంద్రవంక' అనే అద్భుత గేయాన్నందించారు. ఇటీవల 'వల్లంకి తాళం'లో కవితాశిల్ప విన్యాసంతో బౌద్ధ తాత్వికత, రమణుల -బ్రహ్మంగారి ఆత్మదృష్టి, శివయోగం, నల్లమల విధ్వంస వ్యతిరేకత, ఇలా అనేక అంశాలను ఏకకాలంలో మన కళ్లకు కట్టేలా చేశారు. అలాగే 'పూసిన పున్నమి'లో గాయపడిన తెలంగాణ అస్తిత్వం, కవనంలో తెలంగాణ సామర్థ్యం గురించి చెబుతూనే, ఆయనలో దాగిన సాంస్కృతిక ప్రాకృతికవాదం వెంకన్న బయటపెట్టారు. ఇప్పటికే 'హంసపురస్కారం' అందుకొన్న గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం మరో మకుటం అని చెప్పాలి. పాటను ప్రజల మెదళ్లలోకి పంపిన వెంకన్న పల్లెల దారిద్ర్యాన్ని కోరలేదు. గ్లోబలైజేషన్ మాయకు పల్లె ఎలా ధ్వంసమయిందో చెబుతూనే, అందులోని ఒకప్పటి నిశ్శబ్ద శాంతిని ఆస్వాదించమన్నారు.
పల్లె సొగసులను పాటగా మలిచే సత్తా..
పల్లె సొగసులను పాటల్లోకి మళ్లించగల సత్తా వెంకన్న ప్రత్యేకత. చిన్నప్పటి నుంచి ఏ వాతావరణంలో జీవించారో దాన్ని అందిపుచ్చుకొని సాహిత్యాన్ని సృష్టించిన సృజనకారుడు వెంకన్న. ఆయన సాహిత్యంలో ఓ గొప్ప మైలురాయి 'పల్లెకన్నీరు పెడుతుందో' పాట. 'సుదీర్ఘతత్వ గీతం' బాణీని తీసుకొని ధ్వంసం అవుతున్న పల్లెను పాట ద్వారా తెలియజేశారు. అది ప్రపంచ సుదీర్ఘ గేయాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ పాటతో నేడు పల్లెల్లో అంతరించిపోతున్న వృత్తుల గురించి అద్భుతంగా చెప్పారాయన. ప్రపంచీకరణ నేపథ్యంలో వృత్తి నశించడమే కాదు, దాని వెనుక వస్తున్న ఆధునికీకరణ, నశిస్తున్న మానవ సంబంధాలను ఈ పాట కళ్లకు కట్టింది. అందుకే ఈ పాట పల్లెల్లో పెరిగిన ప్రతి మనిషి హృదయాన్నీ తాకింది.
పల్లెల్లోని ధ్వంసమై పోతున్న వృత్తుల గురించి చెప్పిన వెంకన్న అందరి హృదయాలను గెలుచుకున్నారు. పని సంస్కృతిని ఆవిష్కరించింది మనమే అని చెబుతున్న మేధావులు, ఆ ధ్వంసమైపోయిన వృత్తుల గురించి ఆలపిస్తే వెనుకబాటుతనం అంటూ వెక్కిరిస్తున్నారు. బ్రహ్మం గారిలో కులతత్వ నిరసన ఎంత ఉందో శ్రమ సంస్కృతి కూడా అంతే ఉందన్నది వెంకన్న వాదం. అలాగే మాలోని ఆర్థిక సమానత్వంతో పాటు బుద్ధుడిలో, వేమనలో, శిరిడిసాయిలో మానవతను కూడా వెంకన్న గుర్తించారు. దేశీయమైన మార్క్సిజాన్ని వెతుకుతూనే మన సిద్ధులు, పదకర్తలు, బైరాగులు, తాత్వికులు పల్లెల్ని ఎలా సమదృష్టితో నడిపించారో పట్టుకున్నాడు. ప్రతిదానికీ మార్క్స్, కాంట్, ఆస్ఫనాక్, జాన్ డ్యూయీ, బర్రెండ్ రస్సెల్, ఐన్ స్టీన్ కారణం అనుకునే అజ్ఞానులకు కమ్మరి, కుమ్మరి, భజనలు, బతుకమ్మ పాటలు బానిసత్వంలో ఉన్న ఈ దేశ ప్రజలలో జీవత్వాన్ని ఎలా నింపాయో గుర్తు చేశారు.
సంబంధాలు నెలకొల్పాలనే సంకల్పం..
ఇంతకుముందు వడ్రంగుల వారీళ్లల్లో ఊరంతా కూర్చొని తమ వ్యవసాయ పనిముట్లు చేసుకొంటూ కూర్చొని మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల కష్టసుఖాలు ఒకరికొకరు చెప్పుకొనేవారు. ఇప్పుడు వాళ్ల వాకిలి పొక్కిలి లేచి (దుమ్ములేచి) దుఃఖిస్తుంది కదా అని పల్లె పాటలో ఆవేదన వ్యక్తం చేశారు వెంకన్న. దీని వెనుక మనుషుల మధ్య సంబంధాలు నెలకొల్పాలనే ప్రగాఢ సంకల్పం కన్పిస్తుంది. ఇటువంటి మరో సుదీర్ఘ గేయం 'సంత పాట'. పల్లెల్లో వారం వారం జరిగే సంతలో కన్పించే వింతలను ఇందులో వర్ణించారాయన. సంత సామాన్యుల మార్కెట్. ఇంకా చెప్పాలంటే బహుజనుల విపణి. 'ఒక దళారి పశ్చాత్తాపం' అంటూ జాన్ పెర్మెన్స్ పుస్తకం రాస్తే వహ్వా అని జబ్బలు చరిచే మనం కోట్లాది బహుజనుల మార్కెట్‌లోని మంచి, చెడులను వర్ణిస్తే అభినందించడం నేరమా? ఎల్డస్ హక్స్ లే మొదటిసారి ఎల్‌ఏ అనే మత్తుమందు తీసుకొని పొందిన అనుభూతి సంతకల్లు తాగిన సామాన్యుడిలో ఎలా ఉంటుందో చెబుతూ వెంకన్న కుండబద్దలు కొట్టారు. ఈ పాటలో ఎన్నో విషయాలను కళ్లకు గట్టారు.
వెంకన్న కవిత్వంలో ఫిలాసఫీ ఉంటుంది
ఈ రోజు నీటిని ఒడిసి పట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే మొదలైంది. కానీ ఆయన రాసిన ఈ పాట నీటికీ, మనుషులకూ మధ్య ఉన్న బంధాన్ని, దాని ఆవశ్యకతను మనకు ఎప్పుడో గుర్తుచేశారాయన. 'చెఱువోయ్ మా ఊరి చెఱువోయ్ ఊరి బరువు నంతా మోసే ఏకైక ఆదెరువు' అన్న పాట చెరువుకూ పల్లెలోని మనుషులకు మధ్య ఉన్న మానవ సంబంధాలను గుర్తుచేస్తుంది. ఇటీవల రచించిన 'నల్లతుమ్మ', వెన్నల పాట రసహృదయులకు తీపివంట. వెంకన్న పాటల్లో ‘గల్లీ శిన్నది’ అనే పాట పట్నంలోని వీధుల్లో నివసించే జీవితాలను గురించి గొప్పగా చెప్పిన పాట. ఇందులో మార్క్స్ చెప్పిన ఆర్థిక సమానత్వం కూడా ఉంది. దానితోపాటు ఈ దేశంలో ఎందరో తాత్వికుల్లో దర్శించిన 'మానవీయత' ఉంది. వెంకన్న కవిత్వానికి ఫిలాసఫీ ఉంది. వెంకన్న తెలుగునాట 'దళిత బహుజనవాదానికి' ఈ ఇరవై ఏండ్లలో ఓ కొత్తదారి చూపించారు. లంబాడాలు హథీరాం బాబాను, సేవాలాల్ మహరాజ్‌ను వదిలిపెట్టకుండా ఎలాగైతే ఆర్థిక శక్తిని పుంజుకుంటున్నారో, అలాగే దళిత బహుజనులు తమ జాతిలోని దార్శనికులను వదలకూడదని వెంకన్న భావిస్తారు.
కులతత్వాన్ని నిర్మూలించడానికి కృషి చేసిన వారందరినీ తన పాటల్లో స్మరిస్తారాయన. కేవలం మార్క్స్ మార్గం ద్వారానే కులతత్వం నిర్మూలించబడితే ఈ డెబ్బై ఏండ్లలో మనదేశంలో కులం 'ఆనవాళ్లు' ఏనాడో లేకుండా పోవాలి. వెంకన్న మార్క్స్, మారోజు వీరన్నతో పాటు నారాయణగురు, బసవేశ్వరుడు, మడివాలు మాచయ్యలను గౌరవిస్తారు. వెంకన్న పాటగాడు కూడా. తాను చిడతలు పట్టుకొని బైరాగిలా దరువేస్తూ పాడతాడు, ఆడతాడు, దుంకుతాడు. నిజజీవితంలో బైరాగిలా జీవిస్తారు. తెలుగు ప్రాంతంలోని తాత్వికులనే కాదు, దేశంలోని ఎందరో తత్వవేత్తల జీవనం తనకు ఆదర్శమని చెప్పుకుంటారు వెంకన్న.
నిఘంటువులకెక్కని పదాలుంటయ్..
“తాగి పెండ్లం తోటి తగువులాడుతడొకడు.. తాగమని పెండ్లాన్ని బతిమిలాడుతడొకడు” అని సంత పాటలో రాసిన వెంకన్న భాషలో నిఘంటువులకెక్కని పదాలుంటాయి. దక్షిణ తెలంగాణ భాషా సౌందర్యం వెంకన్నలో పుష్కలం. వాటి అర్థాల సుమగంధాలు పల్లె ప్రజల నోళ్లలో నానుతుంటాయి. ప్రజల హృదయపు తలుపులను తెరిపించి, మురిపించే అలతి అలతి పదాల సొబగులు వెంకన్న కవిత్వంలో అనేకం కన్పిస్తాయి. ‘‘పిట్టపరుగు నాగన్న’’ పాటలో ఒక ఎరుకలి వృత్తికారుడి జీవనాన్ని నవరసాల్లో వర్ణించారు. వాల్మీకి సూర్యవంశం, కాళిదాసు రఘువంశం, నన్నయ, తిక్కనల చంద్రవంశపు రాజుల చరిత్రలా కాకుండా సామాన్యునిలోని నిసర్గతత్వాన్ని, స్థితప్రజ్ఞతను, శృంగారాన్ని, వీరత్వాన్ని 18 పంక్తుల్లో వివరించగల సమర్థుడు వెంకన్న. - డా. వి. భాస్కర యోగి, సాహిత్య పరిశోధకులు