- కేసీఆర్ చెప్తేనే చేశామంటున్న ఆఫీసర్లు
- విచారణ కమిషన్ల ముందు స్టేట్మెంట్లు..
- బీఆర్ఎస్ బాస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కారులో జరిగిన అవినీతి, అక్రమాల గుట్టు బయటకు వస్తున్నది. అసలు ఏం జరిగిందో, తాము ఎందుకు అప్పట్లో అట్ల చేయాల్సి వచ్చిందో ఎంక్వైరీల్లో ఆఫీసర్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ‘సారు’ చెప్తేనే చేశామంటూ కేసీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలు కాళేశ్వరం అవకతవకలు, విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల వరకు అంతా ‘సారు’ చుట్టే కథ తిరుగుతున్నది. సీఎం హోదాలో నాడు కేసీఆర్ చెప్పినట్లుగానే తాము నడుచుకున్నామని, ఆయన ఏది చేయాలంటే అది చేయక తప్పలేదని విచారణ కమిషన్ల ముందు ఆఫీసర్లు అంగీకరిస్తున్నారు.
‘‘సారు చెప్పిండనే కాళేశ్వరం డిజైన్లు మార్చినం.. సారు డెడ్‌లైన్ పెట్టిండనే పనులు ఆగమాగం చేసినం.. సారు చెప్పిండనే చత్తీస్‌గఢ్ నుంచి ఎక్కువ రేటుకు కరెంట్ కొన్నం.. సారు చెప్పిండనే యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించినం ’’.. ఇట్ల ఎంక్వైరీ కమిషన్ల ముందు ఉన్నతాధికారులు, వర్క్ ఏజెన్సీలు కూడా చెప్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు సైతం ‘సారు’ ఆదేశాల మేరకే తాము అప్పట్లో ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల లీడర్లు, ఇతరుల ఫోన్లు ట్యాప్ చేశామని ఇప్పటికే విచారణలో ఒప్పుకున్నారు.
ఈ లెక్కన కాళేశ్వరం అవకతవకలు.. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు.. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించిన వ్యవహారాలతో పాటు ఫోన్‌ట్యాపింగ్ కేసులోనూ బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందరి నోటా అదే మాట..!
కాళేశ్వరం అవకతవకలపై ఎంక్వైరీకి ఏర్పాటైన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆఫీసర్లకు, కాంట్రాక్ట్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసి ఎంక్వైరీని స్పీడప్ చేశాయి.
ఆఫీసర్లను పలు ప్రశ్నలు అడుగుతూ వివరాలు రాబడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి స్టేట్మెంట్లను కమిషన్లు రికార్డు చేస్తున్నాయి. ఎవిడెన్స్ కోసం వారి నుంచి ఆఫిడవిట్లను కూడా తీసుకుంటున్నాయి. విచారణ సందర్భంగా.. నాడు ‘సారు(కేసీఆర్)’ చెప్పినట్లు చేశాము తప్ప తమ ప్రమేయం ఏమీ లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ విషయాల్ని స్వయంగా జస్టిస్ ఘోష్, జస్టిస్నర్సింహారెడ్డి మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా బయటపెట్టారు. ‘‘అట్ల చేసుడు తప్పని తెలిసినప్పుడు మీరెందుకు వ్యతిరేకించలేదు” అని ప్రశ్నిస్తే.. ‘‘మేం చెప్పినా సారు వినిపించుకోలేదు”
అని కొందరు ఆఫీసర్లు అంటే, ఇంకొందరు మాత్రం మౌనంగానే ఉండడంతో కమిషన్ల చైర్మన్లు ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు అందించగా.. కాళేశ్వరం వ్యవహారంలోనూ త్వరలోనే కేసీఆర్‌కు జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
ఫోన్ ట్యాపింగ్లోనూ ‘సారు’ పేరే..
రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా కేసీఆర్కనుసన్నల్లోనే జరిగినట్లు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న రాధాకిషన్ రావు, దుగ్యాల ప్రణీత్‌రావు, భుజంగరావు, వేణుగోపాల్ రావు, తిరుపతన్న తమతో ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారో విచారణలో వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీమాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా, ఇండియాకు రప్పిస్తున్నారు. ఆ వెంటనే ఆయనను కూడా ఆదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు తెలిసింది.
ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నను విడివిడిగా చేసిన ఎంక్వైరీలో ముగ్గురూ ప్రభాకర్ రావు చేయాలంటేనే చేశామని చెప్పగా.. రాధాకిషన్‌రావు మాత్రం ‘బీఆర్ఎస్ సుప్రీం’ ఆదేశాలతోనే చేశామని చెప్పారు. ఏకంగా జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయించేంత ఆలోచన ఎవరికి ఉందని ఎంక్వైరీ చేస్తే.. అక్కడ కూడా ‘సారు’ పేరే వెల్లడైనట్లు సమాచారం. దీంతో ప్రభాకర్ రావును విచారించిన తర్వాత కేసీఆర్‌ను కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్లు పోలీసు సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది.
కాళేశ్వరంపై విచారణలో ఏం చెప్పారంటే..!
కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటివరకు 30 మంది ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లతోపాటు తాజాగా రిజర్వాయర్ల వర్క్ ఏజెన్సీలను విచారించింది. మాజీ ఈఎన్సీలు మురళీధర్ (జనరల్), వెంకటేశ్వర్లు (కాళేశ్వరం), నరేందర్‌రెడ్డి (డిజైన్స్).. ఇలా అందరూ ‘సారు చెప్తేనే’ చేశామని కమిషన్ ముందు అన్నట్లు తెలిసింది.
రిజర్వాయర్లను అంత ఆగమాగం ఎందుకు నిర్మించారని ఒక ఈఎన్సీని కమిషన్ ప్రశ్నించగా ‘‘సారు టైం బాండ్ పెట్టారు.. ఆ లోపు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనని అల్టిమేటం ఇచ్చారు. అందువల్లనే కొన్ని అంశాలను విస్మరించాం..’’ అని అన్నట్లు సమాచారం. పైగా అప్పట్లో సీఎంవోలో పనిచేసిన ఒక ఆఫీసర్ టైం బాండ్ పెట్టి ఆలోపు కంప్లీట్ చేయకపోతే సస్పెన్షన్ కు రెడీగా ఉండాలని బెదిరించినట్లు కమిషన్ ముందు ఒక రిటైర్డ్ ఇంజనీర్ వాపోయినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
స్పీడ్‌గా బ్యారేజీలు నిర్మించడంపై ఓ వర్క్ ఏజెన్సీ ప్రతినిధిని కమిషన్ ప్రశ్నిస్తే కూడా ఇలాంటి సమాధానమే వచ్చిందట. ‘‘రికార్డులన్నీ బ్రేక్ చేసేలా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సారు ఆదేశించడంతో అనుకున్నట్లు కాకుండా వేగంగా నిర్మించాం.. చివరికి అంతే వేగంగా డ్యామేజీ అయింది’’ అనడం గమనార్హం.
విద్యుత్ కొనుగోళ్లపై విచారణలో ఏం చెప్పారంటే!
చత్తీస్‌గఢ్‌తో చేసుకున్న పవర్ అగ్రిమెంట్‌పై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్.. మాజీ సీఎండీలు, మాజీ స్పెషల్ సీఎస్ సహా 25 మందికిపైగా ఆఫీసర్లకు నోటీసులు పంపి విచారిస్తున్నది.
తాను విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో చత్తీస్‌గఢ్ పవర్ ఒప్పందానికి ‘నో’ చెప్పినా ‘సారు’ ముందుకెళ్లారని కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ సురేష్ చందా అన్నట్లు తెలిసింది. ఆ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని నాడు ‘సారు’ నుంచి ఆదేశాలు ఉన్నాయని సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌కుమార్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో ఇతర ఆఫీసర్లు కూడా ‘సారు’ ఆదేశాలకు తగ్గట్టుగానే ముందుకువెళ్లామని కమిషన్ ముందు వెల్లడించినట్లు తెలిసింది.
యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించడం వెనుక ‘సారు’ పాత్ర ఉందని ఆఫీసర్లు చెప్పడంతో.. వారి స్టేట్మెంట్స్, ప్రాథమికంగా ఉన్న ఆధారాల మేరకే కేసీఆర్‌కు ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు ఇచ్చారు.
అధికారుల్లో ఆందోళన
అటు కాళేశ్వరం.. ఇటు విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అప్పుడు పోస్టులో కంటిన్యూ అయ్యేందుకు తల ఊపినందుకు.. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామని కొందరు ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ల పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత అసలు దోషులు ఎవరన్నది బయటకు రానుంది.