
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు మళ్లీ పెరిగింది. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని ఎత్తిపోసే పనుల ఖర్చును ఇంకో రూ.84.69 కోట్లు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-3లోని ప్యాకేజీ -9 (మిడ్ మానేరు టు అప్పర్ మానేరు) పనులకు గతంలో రూ.911.32 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వగా ఇప్పుడు దానిని రూ.996.013 కోట్లకు పెంచింది. టన్నెల్, అప్రోచ్ చానల్, గ్రావిటీ కెనాల్ పనుల వ్యయం పెరిగినట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మిడ్ మానేరు నుంచి రెండు దశల్లో అప్పర్ మానేరుకు 120 రోజుల్లో11.63 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. మిడ్ మానేరు తర్వాత 2.60 కి.మీ అప్రోచ్ చానల్, 12.03 కి.మీ.ల గ్రావిటీ టన్నెల్, పంపుహౌస్, 3 టీఎంసీల కెపాసిటీతో మలక్‌పేట్ రిజర్వాయర్, 18.32 కి.మీ.ల గ్రావిటీ కెనాల్, పంపుహౌస్, 6.59 కి.మీ.ల గ్రావిటీ కెనాల్ పనులు చేపడుతున్నారు. మలక్‌పేట్ రిజర్వాయర్‌ను రూ.566.11 కోట్లతో, మిగతా పనులను రూ.911.32 కోట్లతో ప్రారంభించారు. టన్నెల్ తవ్వకంతో ఎదురైన ఇబ్బందులు, సిమెంట్, స్టీల్ ఇతర ధరల పెంపు, రీ ఇంజనీరింగ్‌లో చేపట్టిన మార్పుల వల్ల పనుల వ్యయం పెరిగినట్టుగా పేర్కొన్నారు.