ఓ చిన్న యూట్యూబ్ ఛానెల్ ద్వారా లేటుగా కెరీర్ ప్రారంభించిన యూట్యూబర్ మిల్కూరి గంగవ్వ. రోజురోజూకీ ఎంతో పాపులారిటీని దక్కించుకుంటున్నారు. మొన్నటివరకూ సినీ తారకే పరిమితమైన ఆమె పాపులారిటీ.. తాజాగా రాజకీయ నాయకుల వరకూ చేరింది. ఇటీవలే ములుగు ఎమ్మెల్యే సీతక్కను గంగవ్వ కలిశారు. వారిద్దరూ కలిసి సరదాగా ముచ్చటించుకున్న ఓ వీడియో సీతక్క సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో గంగవ్వపై ఎమ్మెల్యే సీతక్క అత్యంత అభిమానం చూపించారు. సీతక్కను కలిసిన వెంటనే.. నువ్వు నక్సలైట్ వి అంట కదా.. అన్న మాటలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కరీంనగర్ అంటేనే పోరాటాలు, అణచివేత, తిరుగుబాటు.. నువ్వు చేయలేదా పోరాటాలు అంటూ సీతక్క నవ్వుతూ చెప్పడం మరింత ఆహ్లాదంగా అనిపిస్తోంది. నువ్వు కట్టే కాటన్ చీరలు బాగుంటాయని.. తాను కూడా అవే కడతానని, నీ కోసం ఓ చీర కొని పంపిస్తానని సీతక్క వ్యాఖ్యానించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క.. అక్కడికి వచ్చిన గంగవ్వ మధ్య సాగిన సరదా సంభాషణపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు.