ప్రాణాధార మందుల్లోనూ నకిలీల దందా! ..బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి డూప్లికేట్ మెడిసిన్​

ప్రాణాధార మందుల్లోనూ నకిలీల దందా! ..బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి డూప్లికేట్ మెడిసిన్​
  • స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ తోపాటుక్యాన్సర్ చికిత్సలో వాడే ​డ్రగ్స్​లోనూ కల్తీలు
  • ప్రిస్క్రిప్షన్ లేకుండానే యూత్​కు మందులు
  • ఇటీవల మత్తు కోసం సెలైన్​లో పెయిన్ కిల్లర్ కలిపి ఇంజెక్షన్ వేసుకున్న వ్యక్తి మృతి 
  • రాష్ట్రంలోని 500 కంపెనీలు, 50 వేల మెడికల్ 
  • షాపులకు ఉన్న డ్రగ్ ఇన్​స్పెక్టర్లు కేవలం 72 మందే 
  • ఒకే డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్.. శాంపిల్ టెస్టింగ్స్​ లేట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నకిలీ మందుల దందా జోరుగా సాగుతున్నది. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో డూప్లికేట్ మందులు మార్కెట్​లోకి వస్తున్నాయి. పెయిన్​కిల్లర్స్​, యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్​లాంటి ప్రాణాధార మందుల (ఎసెన్షియల్​ మెడిసిన్​)తోపాటు క్యాన్సర్​లాంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో వాడే డ్రగ్స్​లో కల్తీలు పెరిగిపోతున్నాయి. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాల్సిన హ్యాబిచ్యువల్ ట్యాబ్లెట్స్ (రోజూ వాడే మందులు) ను మెడికల్​షాపుల్లో ఎలాంటి డాక్టర్​ చీటీ  లేకుండానే ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. దగ్గు, జ్వరం, తలనొప్పి దగ్గరి నుంచి పెయిన్ కిల్లర్స్, గుండె, క్యాన్సర్ కు సంబంధించిన నకిలీ మందులు రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో అమ్ముతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల తనిఖీల్లో బయట పడుతున్నది.

ప్రముఖ కంపెనీలైన సన్, గ్లెన్ మార్క్, అరిస్టో, టోరెంట్ వంటి ఫార్మా కంపెనీలకు చెందిన వివిధ రకాల ట్యాబ్లెట్లను  పోలి ఉండేలా తయారు చేసి.. మార్కెట్లలోకి వదుల్తున్నారు. ప్రజలు ఎక్కువగా వినియోగించే పాన్ 40, పాంటాప్రజోల్, డోలో, టెల్మా, మాంటెక్ ఎల్సీ, రొజువాస్, లివిపల్ లాంటి ట్యాబ్లెట్లను అచ్చం ఒరిజినల్ బ్రాండ్ లా ఉండేలా తయారు చేసి అక్రమార్కులు సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో ఏది నకిలీదో, ఏది ఒరిజినలో తెలియని పరిస్థితి ఉన్నది. మరికొందరు కేటుగాళ్లు మందులకు బదులు సుద్దముక్కలనే ట్యాబ్లెట్లుగా మార్చి మార్కెట్లలో వదులుతున్నారు. దీంతో ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా జబ్బు నయం కాకపోగా.. ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కాగా,  వీటికి కట్టడి చేసేందుకు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ, అక్రమార్కులను కటకటాల వెనక్కి పంపించాల్సిన  డ్రగ్ కంట్రోలింగ్ డిపార్ట్​మెంట్​ సమస్యల్లో కూరుకుపోయింది. 

నార్త్ టు సౌత్..

నకిలీ మందులు ఎక్కువగా నార్త్ ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నట్టు అధికారులు గుర్తించారు.  జనాలు ఎక్కువగా వినియోగించే మందులనే లక్ష్యంగా చేసుకున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా దగ్గు, జ్వరం, తలనొప్పి ఇలా రెగ్యులర్​  సమస్యలకు వినియోగించే ట్యాబ్లెట్లకే నకిలీలు తయారు చేసి ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరాఫరా చేస్తున్నట్టు బయటపడింది. ఈ మందులైతే ఎక్కువ రోజులు మెడికల్ షాపుల్లో నిల్వ ఉండవు.  వెంట వెంటనే సేల్ అయిపోతుంటాయని, డ్రగ్ కంట్రోలింగ్ అధికారులకు తనిఖీల్లో దొరికే  అవకాశాలు తక్కువగా ఉంటాయని అక్రమార్కులు భావిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు ప్రాణాంతక వ్యాధుల  మందులకూ నకిలీలు తయారు చేసి, మార్కెట్​లోకి వదులుతున్నారు.  మచ్చబొల్లారంలో లైసెన్స్ లేని ఓ కంపెనీలో రూ.4 కోట్ల విలువైన క్యాన్సర్ నకిలీ మందులను డీసీఏ అధికారులు గతంలో సీజ్ చేశారు. తక్కువ ధరలకు లభిస్తుండటంతో ప్రజలు కూడా వాటిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారని, మందులను ధరలను బట్టి కాకుండా క్వాలిటీని బట్టి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. నకిలీ మందుల తయారీ దారులకు చెక్ పెట్టేందుకు కొన్ని ప్రముఖ కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇటీవలే కొన్ని ఖరీదైన ట్యాబ్లెట్లపై క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నాయి. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే కంపెనీ వివరాలు, ట్యాబ్లెట్ వివరాలు వస్తాయి. దీనితో కొంతమేర నకిలీలకు చెక్ పెట్టొచ్చని ఫార్మా కంపెనీలు భావిస్తున్నాయి.  

డీసీఏలో అధికారులు కరువు

ఒకవైపు నకిలీ మాఫియా పెరిగిపోతున్నట్లు డ్రగ్ కంట్రోలింగ్ అడ్మినిస్ట్రేటివ్ (డీసీఏ) డిపార్ట్​మెంట్​ లెక్కలే చెబుతున్నాయి.  కానీ.. పెరుగుతున్న తయారీ  కంపెనీలు, మెడికల్ షాపులకు అనుగుణంగా డీసీఏలో అధికారులు లేరు. దీంతో.. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో 500 దాకా మెడికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, 50 వేలకు పైనే మెడికల్ షాపులు ఉన్నాయి. డీసీఏలో మాత్రం కేవలం 72 మంది మాత్రమే డగ్ర్ ఇన్​స్పెక్టర్లు ఉండడం గమనార్హం. ఇక.. ఒక్కో డ్రగ్ ఇన్​స్పెక్టర్ రోజూ కనీసం 7 నుంచి 8 శాంపిల్స్​ సేకరిస్తారు. అంటే అందరూ కలిసి సగటున 500కు పైనే శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంది.  ఈ శాంపిల్స్ టెస్ట్ చేయడానికి రాష్ట్రంలో ఒక్కటే ల్యాబ్ ఉండటంతో.. టెస్టింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నది.  ప్రస్తుతం ల్యాబ్​లో రోజుకు సగటున 5 నుంచి 10 శాంపిల్స్ టెస్టులు చేస్తున్నట్లు తెలుస్తున్నది.  కాగా, డ్రగ్ ఇన్​స్పెక్టర్ల  సంఖ్యను 150 కి పెంచాలని, మరో 4  టెస్టింగ్ ల్యాబులు ఏర్పాటు చేయాలని డీసీఏ గతంలో ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు అవసరాలకు తగ్గట్టుగా డీఐలు, టెస్టింగ్ ల్యాబ్​లు పెంచుతామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు.

మెడికల్ మత్తులో యువత 

డ్రగ్స్, గంజాయితోపాటు పలువురు యువత మత్తునిచ్చే మెడిసిన్​కు సైతం అలవాటు పడుతున్నట్లు డ్రగ్ కంట్రోలింగ్ అధికారులు చెబుతున్నారు. కోడిన్ ఫాస్ఫైట్, నైట్రావెట్, ఆల్ ప్రజోలమ్, అల్ట్రాసెట్, టపెంటడాల్, ట్రమడాల్ తదితర పెయిన్ కిల్లర్ ట్యాబెట్లను నొప్పులు, మానసిక ప్రశాంతత కోసం వైద్యులు రాస్తుంటారు. ఈ ట్యాబ్లెట్లను డాక్టర్లు రాసిచ్చే ప్రిస్క్రిప్షన్ తో సంబంధం లేకుండా విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ బ్రాండ్లతోనూ నకిలీ మందులు చలామణి అవుతున్నట్టు కనుగొన్నారు.  ఇటీవలే బాలాపూర్ లో ముగ్గురు యువకులు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఓ మెడికల్ షాపు నుంచి టపెంటడాల్ ట్యాబ్లెట్ ను కొనుగోలు చేసి, సెలైన్ వాటర్ లో కలిపి ఇంజెక్షన్ గా తీసుకున్నారు. దీంతో ముగ్గురు యువకుల్లో ఒకరు డోస్ ఎక్కువై చనిపోయారు. మరో ఇద్దరు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  మెడికల్ షాప్ యజమాని ఎక్కువ డబ్బులకు ఆశపడి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆ పిల్లలకు ట్యాబ్లెట్లు అమ్మినట్లు తేలింది.

సాధ్యమైనంత వరకు తనిఖీలు చేస్తున్నాం... 

నకిలీ మందులను కట్టడి చేసేందుకు ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ సహాయంతో సాధ్యమైనంత వరకు తనిఖీలు నిర్వహిస్తున్నాం. నకిలీ, నాసిరకం మందులు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు కలిగిన ఉన్న మందులను సీజ్ చేస్తున్నాం. చట్ట ప్రకారం నిందితులపై కేసులు నమోదు చేస్తున్నాం. కొన్ని  ప్రాంతాల్లో తనిఖీలకోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశాం.  సిబ్బందిని పెంచాలని, కొత్త ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. 
-వీబీ కమలాసన్ రెడ్డి,  డైరెక్టర్ జనరల్,
 డ్రగ్ కంట్రోలింగ్ అడ్మినిస్ట్రేషన్