దేశాన్ని దోస్తులకు దోచిపెడుతున్నరు : మంత్రి సీతక్క

  •      అభివృద్ధి అడిగితే అక్షింతలు పంపుతున్రు

ఆదిలాబాద్, వెలుగు : ప్రధాని మోదీ దేశాన్ని తన దోస్తులకు దోచి పెడుతున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఎన్‌‌ఎస్‌‌యూఐ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్‌‌లో జరిగిన పార్లమెంట్‌‌ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బ‌‌డుగు, బ‌‌ల‌‌హీనవ‌‌ర్గాల కోసం పనిచేసిన ఘనత కాంగ్రెస్‌‌కే దక్కుతుందన్నారు. 

గత ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. అభివృద్ధి అడిగితే అక్షింత‌‌లు పంపుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ ఆదిలాబాద్‌‌కు వచ్చినప్పుడు నిధులు మంజూరు చేస్తారని ఇక్కడి ప్రజలు సంతోషించారని, కానీ డ్రైనేజీ పనులు మాత్రమే ప్రారంభించి వెళ్లిపోయారని విమర్శించారు. బీజేపీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తోందని, బ‌‌డి గురించి మాట్లాడ‌‌ని బీజేపీ గుడి గురించి మాట్లాడుతోందన్నారు. 

రైతుల‌‌కు రుణాలు మాఫీ చేయకుండా, బ‌‌డా పారిశ్రామికవేత్తలకు లోన్లు మాఫీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, కాంగ్రెస్‌‌ వచ్చిన తర్వాత అభివృద్ధి ఫలాలను అందజేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 22న సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదిలాబాద్‌‌లో పర్యటించనున్నారని తెలిపారు. 

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌‌ మాట్లాడుతూ హైకమాండ్‌‌ సూచన మేరకు పార్లమెంట్‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ క్యాండిడేట్లను గెలిపించేందుకు సైనికుల్లా పనిచేస్తామన్నారు. సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎంపీ క్యాండిడేట్‌‌ ఆత్రం సుగుణ, ఆదిలాబాద్, బోథ్ ఇన్‌‌చార్జులు కంది శ్రీనివాస్‌‌రెడ్డి, ఆడే గజేందర్, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, రేఖనాయక్ పాల్గొన్నారు.