బ్రెజిల్​లో ‘ఎక్స్’​పై సస్పెన్షన్

బ్రెజిల్​లో ‘ఎక్స్’​పై సస్పెన్షన్
  • సేవలు నిలిపివేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆర్డర్​

సావోపోలో : బ్రెజిల్​లో ఎక్స్​(ట్విట్టర్) సేవలను నిలిపివేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు  ఆదేశించింది. బ్రెజిల్​లో ట్విట్టర్ తరపున న్యాయ ప్రతినిధిని నియమించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ట్విట్టర్ బేఖాతరు చేయడంతో సదరు ప్లాట్​ఫాంపై  సస్పెన్షన్ విధిస్తూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్  అలెగ్జాండర్  ది మోరిస్  శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. న్యాయ ప్రతినిధిని నియమించకపోతే ట్విట్టర్​ను బ్లాక్  చేస్తామని మోరిస్ 3 రోజుల క్రితమే హెచ్చరించారు.

 ‘‘బ్రెజిల్  సార్వభౌమత్వాన్ని ట్విట్టర్  అధినేత ఎలాన్  మస్క్  అవమానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా న్యాయవ్యవస్థను ఆయన అగౌరవపరిచారు. ఇక్కడి(బ్రెజిల్) చట్టాలకు తాను అతీతం అనుకున్నట్లు మస్క్ తీరు ఉంది. కోర్టు ఆదేశాలు పాటించే వరకు ట్విట్టర్​పై సస్పెన్షన్  కొనసాగుతుంది. అలాగే వర్చువల్  ప్రైవేట్  నెట్ వర్క్ (వీపీఎన్) వాడేవారికి రోజూ రూ.7.5 లక్షల జరిమానా విధిస్తున్నాం” అని మోరిస్ తెలిపారు. 

ఈ ఆదేశాలతో శనివారం నుంచి బ్రెజిల్​లో ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. దేశంలో మొత్తం 4 కోట్ల మంది ట్విట్టర్  వాడుతున్నారు. కాగా, కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో బ్రెజిల్​లో తమ సంస్థ సేవలను బ్లాక్  చేస్తారని తాము ముందే ఊహించామని ట్విట్టర్  తెలిపింది. 

‘బ్రెజిల్​లో భావప్రకటన స్వేచ్ఛను హరించాలని చూస్తున్నారు’ అంటూ జస్టిస్ మోరిస్​పై సంచలన ఆరోపణలు చేసింది. మరోవైపు రష్యా, చైనా, ఇరాన్, మయన్మార్, ఉత్తర కొరియా, వెనెజులా, తుర్కెమినిస్తాన్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ దేశాలలో ట్విట్టర్​పై నిషేధం కొనసాగుతోంది.