మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు విచారణకు సహకరించడం లేదని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. గంగిరెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేయడంలేదని గంగిరెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు గురువారానికి ( ఏప్రిల్ 27) వాయిదా వేసింది.
బెయిల్ రద్దు చేయండి
వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. గత రెండు నెలలుగా ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. బుధవారం ( ఏప్రిల్ 26) కూడా బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలు జరుగగా తీర్పును హైకోర్టుగురువారానికి వాయిదా వేసింది. ఎర్రగంగిరెడ్డి బయట ఉండటం సమంజసం కాదని, ఎర్రగంగిరెడ్డి ప్రధాన నిందితుడని, కేసులో కీలక సాక్షులను ప్రభావితం చేస్తున్నందున బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోరింది.గంగిరెడ్డికి రాజకీయ అండదండలు ఉన్నాయని, అతడి సంబంధాల ద్వారా సాక్షులపై ఒత్తిడి తెచ్చి.. సాక్షాలను తారుమారు చేస్తున్నారని సీబీఐ న్యాయవాది గత విచారణలో వాదించారు. గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారనడానికి కొన్ని ఆధారాలు సమర్పించాలని జస్టిస్ డి. రమేష్ సీబీఐనే ఆదేశించింది.
ఏప్రిల్ 27న తీర్పు
అయితే ఎర్రగంగిరెడ్డి ఎక్కడా కూడా సాక్ష్యులను ప్రభావితం చేయలేదని ఎర్రగంగిరెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఎర్రగంగిరెడ్డి బెయిల్ నిబంధనలు విస్మరించకుండా.. నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని తెలిపారు. సీబీఐ అధికారులు పిలిచిన ప్రతీసారి విచారణకు హాజరయ్యారని, 72 సార్లు సీబీఐ ఎదుట హాజరయ్యారని కోర్టుకు చెప్పారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. గురువారం ( ఏప్రిల్ 27) తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.
తీర్పుపై ఉత్కంఠ
గతంలో ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ హైకోర్టును సీబీఐ ఆశ్రయించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అయితే అప్పటికే వివేకా కేసు తెలంగాణకు బదిలీ అయిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం సూచించింది. ఈ మేరకు ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ... తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 26న హైకోర్టులో వాదనలు ముగియగా.. తీర్పు 27కు వాయిదా పడింది. ఈ క్రమంలో ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే ఉత్కంఠ నెలకొంది
గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ..గంగిరెడ్డిని 2019 మార్చి 28న అరెస్టు చేసింది.ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 90 రోజులలోపు సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైనందున సాంకేతిక కారణాలతో గంగిరెడ్డికి పులివెందులలోని స్థానిక కోర్టు 2021 అక్టోబర్‌లో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
విచారణలో సునీతా రెడ్డికి అనుమానాలు
ఈ హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాలని సీబీఐని సుప్రీంకోర్టు కోరింది. వైఎస్ వివేకానందరెడ్డి. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. 68 ఏళ్ల మాజీ మంత్రి, మాజీ ఎంపీ తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి హత్య చేశారు. కొంతమంది బంధువులపై అనుమానం వ్యక్తం చేసిన వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 2020లో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది.ఆంధ్రప్రదేశ్‌లో న్యాయమైన విచారణ, దర్యాప్తు జరగడంపై సునీతారెడ్డి లేవనెత్తిన సందేహాలు సహేతుకమైనవేనని పేర్కొంటూ సుప్రీంకోర్టు కేసును హైదరాబాద్‌కు బదిలీ చేసింది.