పద్మాక్షి ఆలయ భూముల కబ్జాపై కోర్టు మళ్లీ సీరియస్‍

  •     ఆక్రమణలు తేల్చి 14 నెలలైనా.. నో యాక్షన్‍
  •     కావాలనే చర్యలకు ఇష్టపడని మూడు శాఖల అధికారులు
  •     ఐదు ఆలయాల భూముల మార్కెట్‍ విలువ రూ.300 కోట్లు
  •     29.11 ఎకరాలను 69 మంది కబ్జా చేశారన్న దేవాదాయ శాఖ

వరంగల్,  వెలుగు:  హనుమకొండ  పద్మాక్షి ఆలయ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఫెయిల్‍ కావడంపై లోకాయుక్త కోర్టు మరోసారి సీరియస్‍ అయింది.  కోర్టు విచారణ సందర్భంగా పెద్దాఫీసర్లు కాకుం డా కిందిస్థాయి సిబ్బందిని పంపడం పట్ల లోకాయుక్త అసహనం వ్యక్తం చేసింది. పద్మాక్షి, సిద్దేశ్వర, వీరపిచ్చమాంబ, రంగనాయక స్వామి, వేణుగోపాలస్వామి  ఆలయాలకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన భూముల కబ్జా వాస్తవమేనని 4శాఖలతో కూడిన టాస్క్​ ఫోర్స్​ టీం 14  నెలల కింద కన్పర్మ్​ చేసింది.  డిజిటల్‍ సర్వే ఆధారంగా ఆక్రమణలను గుర్తించి మార్కు పెట్టింది.  ఎక్కడెక్కడ ఎంత స్థలం కబ్జా అయిందో రిపోర్టు ఇచ్చింది.  కబ్జా స్థలంలో ఏయే కట్టడాలున్నాయో..  అవి ఎవరివో చెబుతూ పేర్లతో సహా వివరాలు అందించింది.  కోర్టు కూడా వారిపై చర్యలు తీసుకుని భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అయినా భూకబ్జాదారులపై చర్యలు తీసుకునేందుకు ఏ ఒక్క ఆఫీసర్‍ అడుగు ముందుకేయట్లేదు. ప్రభుత్వ, ఆలయ భూముల ఆక్రమణల్లో ఎంతటివారున్నా వదిలిపెట్టమన్న జిల్లా మంత్రులు,  ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ టాపిక్‍ తీయడం లేదు.

రూ.300 కోట్ల ఆలయాల భూములు హాంఫట్‍ పద్మాక్షి, సిద్దేశ్వర, వీరపిచ్చమాంబ ఆలయాలకు చెందిన దాదాపు 10 ఎకరాల స్థలాన్ని కార్పొరేటర్లు, పార్టీల లీడర్లు, బిల్డర్లు, విద్యావేత్తల ముసుగులో ఉన్నోళ్లు కబ్జా చేశారు.  గజం స్థలం రూ.40 వేల నుంచి 50 వేల చొప్పున ఈ ప్రాంతంలో ఒక్కో ఎకరానికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు పలుకుతోంది. ఈ క్రమంలో రూ.150 కోట్ల విలువ చేసే 10 ఎకరాల స్థలాలు కబ్జా అయ్యాయి. ఇవేగాక హన్మకొండ చౌరస్తా చిన్న, పెద్ద కోవెల ప్రాంతంలో ఉండే రంగనాయకస్వామి ఆలయానికి..  బ్రాహ్మణవాడ, ములుగురోడ్, పెద్దమ్మగడ్డ ఏరియాల్లో ఉన్న 9.32 ఎకరాలు, వరంగల్​లోని  వేణుగోపాలస్వామి గుడికి చెందిన 1.11 ఎకరాల భూమిపై అక్రమార్కుల కండ్లు పడ్డాయి. వీటి విలువ మరో రూ.150 కోట్లు పలుకుతోంది. మొత్తంగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.300 కోట్లు పలుకుతోంది. 

కోర్టు చెప్తేనే.. 2022 జనవరి 5న రిపోర్టు 

రికార్డుల్లో 898 సర్వే నంబర్లో దేవాదాయశాఖకు 78.30 ఎకరాల భూములున్నాయనే విషయం స్పష్టంగా తెలిసినా.. కొందరు ఆఫీసర్లు అక్రమార్కులతో చేతులు కలిపారనే ఆరోపణలున్నాయి. ''రాష్ట్ర వినియోగదారుల మండలి, కాకతీయ ఆస్తుల పరిరక్షణ వేదిక'' ఆధ్వర్యంలో లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఎండోమెంట్, గ్రేటర్  అధికారులు డిజిటల్ సర్వే ద్వారా ఆక్రమణలు గుర్తించి రిపోర్ట్ అందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్‍ సీ.వీ.రాములు జిల్లా అధికారులను ఆదేశించారు. 

కబ్జాలపై చర్యలకు  జూన్‍ 1 డెడ్‍లైన్‍ 

మార్చి 16న జరిగిన విచారణకు ఎండో మెంట్‍ కమిషనర్‍ తరఫున ఉమ్మడి వరంగల్‍ జిల్లా అసిస్టెంట్‍ కమిషనర్‍ ఆర్‍.సునీత, అధికారులు రత్నాకర్‍రెడ్డి, ప్రసాద్‍, వెంకన్న హాజరయ్యారు. ఆలయ భూముల కబ్జా జరిగింది నిజమేనని ఒప్పుకున్నారు. చర్యలు తీసుకునే విషయంలో 14 నెలలుగా రెవెన్యూ, గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ అధికారులు ముందుకురావట్లేదని వివరించారు.  దీనిపై.. జస్టిస్‍ రాములు మరోసారి సీరియస్‍ అయ్యారు. వచ్చే జూన్‍  1వ తేదీ నాటికి భూముల పరిరక్షణ, కబ్జాదారులపై చర్యలపై పూర్తి రిపోర్టుతో హాజరుకావాలని ఆదేశించారు. 

కోర్టు చెప్పినా..  

అక్రమార్కులకే సపోర్టు చేస్తున్రు పద్మాక్షి మరో 4 ఆలయాలకు చెందిన భూముల విషయంలో జిల్లా అధికారులు మొదటి నుంచి అక్రమార్కులకు సహకరి స్తున్నారు. కబ్జాల విషయమై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుంటే లోకాయుక్తలో ఫిర్యాదు చేశాం. న్యాయ స్థానం డిజిటల్ సర్వే చేపించాలని చెప్పింది. 29.11 ఎకరాల కబ్జా నిజమేనని దేవాదాయ శాఖ ఆఫీసర్లు కోర్టుకు రిపోర్టు ఇచ్చారు. తీరా ఇదే అంశమై లోకాయుక్త న్యాయమూర్తి సీరియస్‍ అయ్యారు. జూన్‍ 1 వరకు అధికారులకు గడువిచ్చారు. - సాంబరాజు చక్రపాణి, చీకటి రాజు (లోకాయుక్త ఫిర్యాదుదారులు)