
పారిస్: వంద గ్రాముల అధిక బరువు కారణంగా తనపై అనర్హత వేటును సవాల్ చేస్తూ ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన అప్పీల్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో శుక్రవారం వాదనలు ముగిశాయి. అయితే ఈ అంశంలో తీర్పు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. శనివారం రాత్రి తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. తీర్పు వెల్లడించే సమయాన్ని ఆదివారానికి కాస్ పొడిగించింది. ఒలింపిక్ గేమ్స్ సమయంలో తలెత్తే వివాదాల పరిష్కారం కోసం పారిస్‌లో ఏర్పాటు చేసిన కాస్ తాత్కాలిక విభాగంలో వినేశ్ తరఫున ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) నియమించిన ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా తమ వాదనలు వినిపించారు.
వినేశ్ ఎలాంటి మోసానికి పాల్పడలేదని, బుధవారం మూడు బౌట్లలో పోటీ పడిన తర్వాత - శరీరం సహజ పునరుద్ధరణ ప్రక్రియ కారణంగానే ఆమె బరువు పెరిగిందని కోర్టుకు నివేదించారు. పోటీల తొలి రోజు ఆమె బరువు నిర్ణీత పరిమితిలోపే ఉంది కాబట్టి ఇది మోసం కాదన్నారు. ఫైనల్ చేరినందుకు ఆమెకు రజతం ఇవ్వాలని కోరారు. దీనిపై కాస్ శనివారం తీర్పును ఇచ్చే అవకాశం ఉందని అంతా ఆశించారు. కానీ.. తీర్పు మరింత ఆలస్యమవుతూ వస్తోంది. తీర్పును ఆదివారం రాత్రి వెల్లడించే అవకాశం ఉంది.
వినేశ్ ఫొగాట్ వివాదంపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చీఫ్ థామస్ బాచ్ స్పందించారు. వినేశ్ కేసులో మానవీయ కోణం ఉందన్న బాచ్ తాము కాస్ నిర్ణయానికి కట్టుబడతామని చెప్పారు. కానీ, వంద గ్రాముల బరువు మాత్రమే ఎక్కువ ఉందని నిబంధనలు సడలించి వినేశ్‌కు మినహాయింపు ఇస్తే అది ఇక్కడితో ఆగబోదన్నారు. మున్ముందు 102 గ్రాములు, ఇంకా ఎక్కువ ఉన్న వాళ్లు ఇదే డిమాండ్ చేస్తారని అన్నారు. సెకండ్‌లో ఐదు వేల వంతు తేడాతో ఫలితాలు తారుమారు అవుతున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్‌లోనూ ఇలాంటి మినహాంపులు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. వినేశ్ కోరినట్టు రెండు రజతలు ఇవ్వడం కూడా సాథ్యం అయ్యే విషయం కాదన్నారు.