బిగ్బాస్ 7 ఫైనల్ గొడవ కేసు.. 12మందికి 14 రోజుల రిమాండ్

బిగ్బాస్ 7 ఫైనల్ గొడవ కేసు.. 12మందికి 14 రోజుల రిమాండ్

బిగ్బాస్ తెలుగు 7 షో అనంతరం జరిగిన ఘటనలో 12 మందికి 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నలుగురు మైనర్లను జువైనల్ న్యాయస్థానంలో హాజరుపర్చారు పోలీసులు. ఆర్టీసీ బస్సులపై దాడి, ధ్వంసం చేసిన ఘటనలో 16 మందిని గురువారం (డిసెంబర్ 21న) పోలీసులు అరెస్ట్ చేశారు. 

తెలంగాణ ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని గుర్తించి అరెస్ట్  చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లు ఉన్నారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టు ఎదుట హాజరు పర్చారు. 

మరోవైపు.. బిగ్బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. తీర్పును శుక్రవారానికి (డిసెంబర్ 22న)  వాయిదా వేసింది. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది వేణుగోపాల్ కోర్టును కోరారు. పోలీసులు సరైన భద్రత లేకపోవడం వలనే ఇలాంటి పరిణామాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

పల్లవి ప్రశాంత్ విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారని  రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. 41 సీఆర్పీసీ నోటీస్ ఇచ్చేకే పల్లవి ప్రశాంత్ ను  అరెస్ట్ చేశామని చెప్పారు. ప్రశాంత్ కారణంగా పలువురు యువకులు వికృత చేష్టలకు పాల్పడి.. పోలీసుల ముందే ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని తెలిపారు. 

పోలీసులను డ్యూటీ చేయకుండా పల్లవి ప్రశాంత్ అడ్డుకున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ న్యూసెన్స్ మొత్తం పోలీసుల కళ్లముందే జరిగిందన్నారు.  భవిష్యత్తులో వీరికి సమాజంపై బాధ్యత, భయము ఉండాలనే ఉద్దేశంతోనే అరెస్టు చేశామన్నారు పోలీసులు. సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం  ఉన్న కారణంగా పల్లవి ప్రశాంతను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

పోలీసులు చాలాసార్లు పల్లవి ప్రశాంత్ కు విజ్ఞప్తి చేసినా కనికరించలేదని వెల్లడించారు.  పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టి కార్లు, బస్సులు ధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. రెండు కార్లను రెంట్ కు తీసుకుని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చారని చెప్పారు.  అక్కడికి వచ్చిన వారందరినీ విధ్వంసానికి ఉసిగొల్పి.. బిగ్ బాస్ షో కు వచ్చిన సెలబ్రిటీ కార్లను ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్టులో చెప్పారు పోలీసులు.