ఆవుల స్మగ్లర్ అనుకొని కాల్చి చంపారు

ఆవుల స్మగ్లర్ అనుకొని కాల్చి చంపారు
  • కారులో వెంటాడి కాల్పులు జరిపిన గోరక్షకులు
  • హర్యానాలోని ఫరీదాబాద్​లో ఘటన

న్యూఢిల్లీ: ఒక అనుమానం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గోవులను తరలిస్తున్నాడని పొరబడి 12వ తరగతి విద్యార్థిని గోరక్షకులు కాల్చి చంపారు. హర్యానాలోని ఫరీదాబాద్​లో గత నెల 24న ఈ సంఘటన జరిగింది. సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్యన్  మిశ్రా తన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. వారు ఆవుల స్మగ్లర్లని గోరక్షకులు అనిల్  కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్, సౌరభ్ అనుమానించారు. అంతకుముందు వారు ఫరీదాబాద్ లో రెక్కీ నిర్వహించినట్లు సందేహించారు. ఈ క్రమంలో ఆర్యన్, అతని స్నేహితులు వెళ్తున్న కారును మరో కారులో అడ్డుకునే ప్రయత్నం చేశారు.

కారును ఆర్యన్  స్నేహితుడు హర్షిత్  డ్రైవ్  చేస్తుండగా.. ఆర్యన్  పక్క సీటులో కూర్చున్నాడు. కారు ఆపాలని హర్షిత్​ను గోరక్షకులు అడిగారు. అయితే, ఆర్యన్ స్నేహితుడు శాంకీ అంతకుముందు ఎవరితోనో గొడవపడ్డాడు. అతనికి సంబంధించిన వ్యక్తులు తమ కోసమే వెతుకుతున్నారని, ఈ క్రమంలోనే తమను చేజ్ చేస్తున్నారని ఆర్యన్  స్నేహితులు అనుమానించారు. తాము గొడవపడ్డ వ్యక్తి తమను చంపేందుకు రౌడీలను పంపించాడని భయంతో కారును ఆపకుండా వెళ్లిపోయారు. నిందితులు కూడా వారి కారును వెంబడించారు.

ఆర్యన్  కారును గోరక్షకులు వెంబడిస్తున్న దృశ్యాలు ఆగ్రా‌‌‌‌‌‌‌‌–ఢిల్లీ నేషనల్  హైవేలో గాడ్ పురి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అనంతరం ఆర్యన్ కారును గోరక్షకులు అడ్డుకుని రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. రెండు బుల్లెట్లూ ఆర్యన్​కు తగిలాయి. ఒక బుల్లెట్ మెడలో దూసుకుపోగా.. మరో బుల్లెట్ ఛాతీకి తగిలింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆర్యన్ చనిపోయాడు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.