బర్త్​డే వేడుకల్లో మంత్రిని పొగిడిన ఏసీపీషోకాజ్‍ నోటీసులిచ్చిన సీపీ

బర్త్​డే వేడుకల్లో మంత్రిని పొగిడిన ఏసీపీషోకాజ్‍ నోటీసులిచ్చిన సీపీ
  • కేసులు, వివాదాల్లో ఉన్న వ్యక్తితో కలిసి కేక్‍ కట్‍ చేసిన వరంగల్ ​ఏసీపీ నందిరామ్​
  • కార్యక్రమంలో తోపులాట..పటాకులు కాల్చడంతో గాయపడ్డ యువతి 
  • సోషల్‍ మీడియాలో వైరల్‍ కావడంతో వివరణ కోరిన సీపీ  

వరంగల్‍, వెలుగు: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బర్త్​డే వేడుకల్లో పాల్గొని కేక్​ కట్‍ చేయడమే కాకుండా మీడియా ముందు మంత్రి దంపతులను పొగుడుతూ స్పీచ్‍ ఇచ్చిన వరంగల్‍ ఏసీపీ నందిరామ్‍ నాయక్‍కు..వరంగల్‍ సీపీ అంబర్‍ కిషోర్ ​ఝా షోకాజ్‍ నోటీసులు ఇచ్చారు. మంత్రి సురేఖ బర్త్​డే సందర్భంగా సోమవారం వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో ఆమె అనుచరులు వేడుకలు నిర్వహించారు. పలు కేసులతో పాటు ఇతరత్రా వివాదాల్లో ఉండే ఓ లీడర్‍ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వరంగల్‍ ఏసీపీ నందిరామ్‍ నాయక్‍ హాజరై వారితో కలిసి కేక్‍ కట్​ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వరంగల్‍ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పేదల అభ్యున్నతి కోసం  అహర్నిశలు కృషి చేస్తున్న డైనమిక్‍ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మేడం గారి జన్మదినం సందర్భంగా గోపాల నవీన్‍రాజ్‍ అన్నగారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. కొండా దంపతుల ఇమేజ్‍ ఏంటనేది ఈ పంపిణీ చూస్తే అర్థమవుతోంది. నిజంగా చెప్పాలంటే.. కొండా దంపతులు అంటేనే ప్రజలకు ఓ అండా.. ఓ ధైర్యం.. ఓ నమ్మకం.. అనేది వరంగల్​లో చూస్తున్నా. ఇతర ఏరియాల్లో ప్రొగ్రాంలు, పండుగల సందర్భంగా అక్కడి లీడర్లు పెట్టే ఫ్లెక్సీల్లో వారి పేరు, హోదా ఉంటుంది. కానీ కొండా వీరాభిమాని అని ఫ్లెక్సీల్లో రాసే ఏకైక నియోజకవర్గాన్ని వరంగల్‍ తూర్పులో మాత్రమే చూస్తున్నా.

అట్లాంటి డైనమిక్‍ ఎమ్మెల్యే మేడం గారి పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరం. మేడం గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండి నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి’ అంటూ స్పీచ్​ ఇచ్చారు. కాగా, ఈ కార్యక్రమానికి జనాలు ఎక్కువగా తరలిరావడంతో  తోసుకోవడంతో పలువురు గాయపడ్డట్టు తెలిసింది. మరో ఘటనలో కార్యకర్తలు పటాకులుకాల్చడంతో దగ్గర్లో ఉన్న ఓ యువతి గాయపడి రక్తం కారుతుండగా కన్నీరు పెట్టుకుంది. ఏసీపీ వేడుకల్లో పాల్గొన్న, మాట్లాడిన వీడియోలతో పాటు గాయపడ్డ వీడియోలు సోషల్‍ మీడియాలో వైరలయ్యాయి. దీంతో వరంగల్‍ సీపీ అంబర్‍ కిషోర్​ఝా స్పందించారు. ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఏసీపికి మంగళవారం నోటీసులు ఇచ్చారు. దీనికి తోడు సెంట్రల్‍ జోన్‍ డీసీపీ షేక్‍ సలీమా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు.