‘డబుల్’ ఇళ్లు.. పంచక ముందే పగుళ్లు

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని పేదల కోసం మావల గ్రామ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు పంచక ముందే ఇలా పగుళ్లు పెడుతున్నాయి. మొత్తం 20 బ్లాకులుగా ఒక్కో బ్లాక్​కు 12 చొప్పున 240 ఇండ్ల నిర్మాణ పనులను నాలుగేండ్ల కింద ప్రారంభించారు. గేటెడ్ ​కమ్యూనిటీ తరహాలో అత్యంత క్వాలిటీతో నిర్మిస్తున్నామని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు అప్పట్లో గొప్పలు చెప్పారు. తీరా చూస్తే ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ క్వాలిటీని గాలికి వదిలేశాడు. ఫలితంగా ఇండ్లు ఎక్కడికక్కడ పగుళ్లు చూపుతున్నాయి. గోడలు, స్లాబ్​పెచ్చులు ఊడుతున్నాయి.

గోడల్లోంచి పైపులు, కరెంట్​ వైర్లు బయటకు వచ్చి వేలాడుతున్నాయి. లబ్ధిదారులకు పంపిణీ చేస్తే కనీసం వాళ్లయినా ఇండ్ల మెయింటనెన్స్​చూసుకునేవాళ్లు. కానీ పూర్తయి నెలలు గడుస్తున్నా పేదలకు పంచేందుకు ఆఫీసర్లకు, లీడర్లకు చేతులు రావడం లేదు. దీంతో ఇండ్ల చుట్టూ కంపచెట్లు మొలిచి భూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. 

– వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్