ఏడేండ్ల పీడను పాతరేసేందుకు  మరో ఉద్యమం

ఏడేండ్ల పీడను పాతరేసేందుకు  మరో ఉద్యమం

ఒక ప్రాంతం విడిపోవడానికి బలిదానాలు చేసిన ఘనత ప్రపంచ చరిత్రలో తెలంగాణకే దక్కుతుంది. అంతటి ఘన చరిత్ర ఉన్న రాష్ట్రంలో స్వయం పాలన వచ్చినా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరకపోవడం నిజంగా దురదృష్టకరం. ‘మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి. కోర్కె ఒక్కటి. తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలె..’ అని కవి కాళోజీ అన్నారు. ఆయన వాక్కు ఫలించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఐతే, రాష్ట్రసాధన కోసం 1952 ముల్కీఉద్యమంలో ఎనిమిది మంది, 1969 పోరాటంలో 369 మంది ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేశారు. అన్నింటికీ మించి 2009–13 ఉద్యమం సమయంలో 1,200 మంది ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు. ఎందరో లాఠీ దెబ్బలుతిన్నారు. ఇంకొంత మంది జైల్లో మగ్గి తమ భవిష్యత్ కోల్పోయారు. రాష్ట్రకోసం లక్షలాది మంది త్యాగాలు చేసి సాధించుకొన్న తెలంగాణలో.. ఇప్పడు ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ముడివడ్డ మూడోపోరు
ఆరు దశాబ్దాలుగా, రెండు తరాల ప్రజలు జరిపిన ప్రత్యేక రాష్ట్ర పోరాటంగా1969 ఉద్యమం చరిత్ర కెక్కింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని వియత్నాం విప్లవంతో పోలుస్తుంటారు రాజకీయ విశ్లేషకులు. 1952లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమంలో ఎనిమిది మంది, 1969లో జరిగిన పోరాటంలో పోలీస్ కాల్పుల్లో 369 మంది చనిపోయారు. తెలంగాణ రాష్ట్రోద్యమం 1984లో తిరిగి ప్రారంభమై 1989లో, 1994, 1996లో సాగినా అనుకున్న స్థాయిలో పుంజుకోలేదు, 2001లో మూడోసారి వచ్చిన ప్రత్యేక రాష్ట్రోద్యమం ఒక పార్టీ రూపంలో తెగించి పోరాడింది 2009లోనే. అప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు సాధించేందుకు అందరొక్కటై ఉద్యమించారు. ఆంధ్రుల కుట్రల వల్ల ప్రత్యేక రాష్ట్రం రాదేమో? మా బతుకులు మారవేమోననే అభద్రతా భావంతో1,200 మంది ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడుచు పెట్టుకుపోతుందని తెలిసినా సోనియాగాంధీ పార్లమెంట్​లో తెలంగాణ బిల్లు పెట్టించింది. బీజేపీ, సీపీఐ తదితర పార్టీలు ఆ బిల్లుకు అండగా ఉండి తెలంగాణ ఏర్పాటుకు చేయూతనిచ్చాయి. దేశం విస్మరించలేని అపురూప రాష్ట్రావతరణ చరిత్రిది.
కూడబెట్టిన తేనెను జుర్రుకొన్నారు
తెలంగాణ వాస్తవ చరిత్రకు మసిబూసి మారేడుకాయజేసి.. తానే తెలంగాణ సాధించానని టీఆర్ఎస్​ అధినేత కె.చంద్రశేఖర్​రావు బుకాయిస్తున్నారు. త్యాగాల తేనె తుట్టెను నిస్సిగ్గుగా పిండుకుంటున్నారు. తన కులం వాళ్లను ఎంపీగా ఒకరిని,  ఎమ్మెల్సీగా మరొకరిని, వీసీగా ఇంకొకరినిచేసి.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలువలేని కన్నకూతురును ఎమ్మెల్సీ చేసి కుటుంబ, కులస్వామ్యపు ముఖ్యమంత్రిగా మారారు. అంతటితో ఆగక తెలంగాణ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రిని చేసి ఉద్యమకారుల త్యాగాలను అపహాస్యం చేశారు. పచ్చని పైరుపై విషపుచూపు పడ్డట్టు.. ధనిక రాష్ట్రంపై టీఆర్​ఎస్ కన్నుబడి వల్లకాడవుతోంది. రాజకీయానుభవం తప్ప పరిపాలనానుభవం లేని, అవినీతి, దోపిడీ, బంధుప్రీతి సీఎం చేతిలో రాష్ట్రం బందీ అయింది. కనీస పరిజ్ఞానంలేని మంత్రులు, సలహాదారులు కొత్త రాష్ట్రాన్ని దివాళా తీయించారు. చాలా మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు భూకబ్జాలు, ఆర్థిక దోపిడీతో త్యాగాల తేనెను జుర్రుకున్నారు. చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తూ ఇసుక, భూమి, ఫార్మా,  ప్రైవేటు హాస్పిటల్ మాఫియాగా మారి ప్రజల్ని దోచుకుంటున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి ఏడాది కాలంలోనే ఎంతో మంది యువకులు ప్రాణాలు తీసుకున్నారు. నిర్లక్ష్యం చేయడంతో యూనివర్సిటీలు నిర్వీర్యమైనాయి. వైద్య విధానం వికటించి వైకుంఠధామాలు వెలిసినాయి. బంగారు తెలంగాణకు బదులు అప్పుల తెలంగాణగా మారి పాలన కుప్పకూలబోతోంది. ఒక దశాబ్దం పాటు జాతి చరిత్ర చీకటి కోణంలోకి చేరబోతోంది.

1969 ఉద్యమకారులే స్ఫూర్తి
స్వరాష్ట్ర సాధనకు 1969 ఉద్యమకారులే స్ఫూర్తి. పోరాడి పోలీసు కాల్పుల్లో మరణించిన 369 మంది అమనేల కీర్తి అజరామరం. అయితే, రాష్ట్రం వచ్చిన నాటి నుంచి టీఆర్​ఎస్​ సర్కార్ అమరులను, ఉద్యమకారులను పూర్తిగా విస్మరించింది. తెలంగాణ పోరాట యోధుల సంఘం కృషి వల్ల రాష్ట్ర ద్వితీయ అవతరణ రోజు(02-06-2016)న హోం మంత్రి, సీఎం పెన్షన్లు ప్రకటిస్తారని ఉద్యమకారుల్ని ఆహ్వానిస్తే ఆనాటి సభ రసాభాసై అర్థాంతరంగా రద్దయింది. దీంతో ముఖ్యమంత్రి ఉద్యమ కారులకు ఇచ్చిన పెన్షన్ల హామీ మూలకు పడింది. అదే అసంతృప్తితో తెలంగాణ అసలైన ఉద్యమకారులంతా రగిలిపోతున్నారు. ఉద్యమ ద్రోహులను టీఆర్​ఎస్ లో కలుపుకొని ప్రజలకు అన్యాయం చేస్తుండడం సహించలేక ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మరో తెలంగాణ ఉద్యమానికి వారంతా ఏకమవుతున్నారు. 19న వరంగల్ లో జరిగే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలవేదిక సభలో టీఆర్​ఎస్ గుండెల్లో గుబులు పుట్టేటట్టు దరువు ఎల్లన్న, కాకతీయ సాంస్కృతిక సంస్థ ధూం ధాంలు, కవులు, మేధావులు ఉద్యమ శక్తుల్ని ఏకం చేయడానికి ప్రత్యామ్నాయ సిద్ధాంతంతో మరో ఉద్యమానికి ఊపిరి పోస్తారు. ఈ ఏడేండ్ల పీడను పాతరవేస్తూ తెలంగాణలో రాజకీయాల్లో కొత్త మార్పులకు ఈ సభ దోహదపడుతుంది. 

                                                                                                                               -  ననుమాస స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ యోధుల ఫోరం