ఖైదీల లెక్కల వెనక  దాచేసిన నిజాలెన్నో!

ఇండియాలోని జైళ్లకు ఏమైంది? అక్కడ అసలు ఏం జరుగుతోంది?.. దేశ ప్రజలు సమాధానాల కోసం ఎదురుచూస్తున్న ప్రశ్నలివి. వీటికి ‘ప్రిజన్​ స్టాటిస్టిక్స్’​ మాత్రమే ఆన్సర్​ చెప్పగలవు. అయితే ఆ లెక్కలు కూడా కటకటాల వెనక దాగిన కఠోర నిజాలను ‘ఉన్నది ఉన్నట్లు’ బయటపెట్టలేని పరిస్థితి. అందుకే ఈ అంశంపై 1855 నాటి పారిస్ ‘ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్​ కాంగ్రెస్​’ నుంచి చర్చ సాగుతోంది. 2016 ప్రిజన్​ స్టాటిస్టిక్స్ మూడేళ్లు లేటుగా ఈ ఏప్రిల్​లో రావటంతో మరోసారి తెర మీదికి వచ్చింది.

మన దేశాన్ని బ్రిటిషర్లు​ పాలించే రోజుల్లో ఇక్కడి జైళ్ల స్థితిగతులను నాటి ఐజీపీ​ డాక్టర్​ ఎఫ్​జే మోవాత్​ ఇంటర్నేషనల్​ కాన్ఫరెన్స్​లకు రెగ్యులర్​గా తెలిపేవారు. ముఖ్యంగా రాయల్​ స్టాటిస్టికల్​ సొసైటీకి రిపోర్ట్​ ఇచ్చేవారు. ఆ సొసైటీకి ఆయన 1890–92లో ప్రెసిడెంట్​. 1876లో జరిగిన ఓ ప్రోగ్రాంలో మోవాత్ మాట్లాడుతూ జైళ్లలో ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలను వివరించారు.

‘జైలు రికార్డుల్లో, రిపోర్టుల్లో ఖైదీల వివరాలను, వారికి అందుతున్న సదుపాయాలను నమోదు చేసేటప్పుడు కచ్చితంగా వ్యవహరిస్తున్నాం. ఆ డేటాను వాళ్ల నుంచి కలెక్ట్​ చేసేటప్పుడు కూడా ప్రతి అంశమూ ముఖ్యమే అనే ఆలోచనతో పనిచేస్తున్నాం. ఈ ప్రిజన్​ స్టాటిస్టిక్స్​ జ్యుడిషియల్​ స్టాటిస్టిక్స్​లో భాగం కానున్నాయనే విషయాన్ని మరవకూడదనేదే మా ఉద్దేశం. జైళ్లు ఎలా పనిచేస్తున్నాయో చెప్పటానికి ఇదెంతో అవసరం’ అని ఆయన అన్నారు.

ఇండిపెండెన్స్​ తర్వాత..

ఇండియాకి ఇండిపెండెన్స్​ వచ్చాక జైల్​ రిఫార్మ్స్​పై జస్టిస్​ ఏఎన్​ ముల్లా నాయకత్వంలో కమిటీ ఏర్పడింది. అది దేశంలోని అన్ని జైళ్లకు సంబంధించిన లెక్కలను యూనిఫామ్​గా కలెక్ట్​ చేయాలని 1983లో రికమండ్​ చేసింది. నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో ఆ పని చేపట్టి దేశంలో తొలిసారిగా ‘ప్రిజన్​ స్టాటిస్టిక్స్ –1995’​ని 1996లో అందుబాటులోకి తెచ్చింది. తర్వాత పదేళ్ల పాటు (2015 వరకు) ప్రతి ఏడాదీ తాజా డేటాని పబ్లిష్​ చేసింది.

2016లో రిలీజ్​ చేయాల్సిన లెక్కలను మూడేళ్లు ఆలస్యంగా ఈ ఏప్రిల్​లో విడుదల చేశారు. ఇంత లేటెందుకైందో వివరణ ఇవ్వలేదు. 2017, 2018 రిపోర్ట్​లను ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో 2016 తర్వాత క్రైమ్​ డేటాని కూడా రిలీజ్​ చేయలేదు. నేరాల వివరాలను సేకరించే టాస్క్ మొదటిసారి 1953లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 2015 వరకు క్రైమ్​ డేటాని ఏటా విడుదల చేశారు. మూడేళ్ల కిందట అది కూడా మూలన పడింది.

లేటెస్ట్​ రిపోర్ట్​లో ముఖ్య విషయాలు మిస్​

2016 ప్రిజన్​ స్టాటిస్టిక్స్​ని సర్కారు నామ్​ కే వాస్తేగా రిలీజ్​ చేసినట్లు కనిపిస్తోంది. అందులో ముఖ్య విషయాలు లేకుండా చేసింది. ఖైదీల కులం, మతం, ట్రైబల్​ ఐడెంటిటీ మచ్చుకైనా కనపడవు. ఈ లెక్కల్లో కొత్త కేటగిరీలను చేర్చారు. కానీ.. 2008 నుంచి రెగ్యులర్​గా ఇస్తున్న డెమొక్రఫిక్​ డేటాని ఎత్తేశారు. గత వివరాలను బట్టి మన దేశంలోని వివిధ జైళ్లలో ముస్లింలు, ఆదివాసీలు, దళితులు ఎక్కువగా ఉండేవారు.

ఇప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్​ని సడన్​గా, చెప్పాపెట్టకుండా తొలగించటం ఆరోపణలకు తావిస్తోంది. తాజా లెక్కలు ఒక విధంగా జైళ్ల దీనస్థితికి అద్దం పడుతున్నాయి. అయితే, దాన్ని మీడియా చేయాల్సిన స్థాయిలో హైలైట్ చేయలేదు. స్టాటిస్టిక్సే అరకొరగా ఉన్నాయి. ఇక వాటిని కూడా టీవీలు, పేపర్లు జనానికి చెప్పకపోతే అసలు విషయాలు ఎలా వెలుగులోకి వస్తాయని సామాజికవేత్తలు ప్రశిస్తున్నారు. ‘కటకటాల లెక్కల వెనక కప్పిపుచ్చిన నిజాలెన్నో’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

70 శాతం మంది చదవరానోళ్లే  

2016 లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం జైళ్లలో 4 లక్షల 33 వేల మందికిపైగా ఖైదీలు ఉన్నారు. వాళ్లలో 70.35 శాతం మంది అక్షరమ్ముక్క రానోళ్లు లేదా కనీసం టెన్త్​ క్లాస్​ కూడా చదవనోళ్లు. మిగతా లక్షా 30 వేల 443 మంది ఖైదీలు ఎలిమెంటరీ లేదా హయ్యర్​ ఎడ్యుకేషన్​ లేదా కంప్యూటర్​ అండ్​ వొకేషనల్​ ట్రైనింగ్​ చేసినవాళ్లు. జైలు స్టాఫ్​ పోస్టుల్లో 34.5 శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. జైళ్లలో సరిపోను సిబ్బంది లేరంటే ఖైదీల్లో మార్పు తెచ్చేవారు కరువవుతారని అర్థం.  ఇక ఖైదీల రికార్డునికూడా సక్రమంగా నిర్వహించాలని 2016 మోడల్​ ప్రిజన్​ మాన్యువల్​’ తాజా నివేదికలో పేర్కొంది. జైళ్లలో ప్రమాదవశాత్తూ చనిపోయినవారు, ఇతర ఖైదీల చేతిలో హత్యకు గురైనవారు, ఆత్మహత్య చేసుకున్నవారు వంటి వివరాలను ‘రీసెంట్​ రిపోర్ట్​లో సెపరేట్​గా పొందుపరిచారు. వివిధ రాష్ట్రాలు తమ జైళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా ప్రస్తావించారు. మొత్తం మీద ప్రిజన్​ స్టాటిస్టిక్స్​ మసి పూసి మారేడు కాయ చేసిన చందంగా ఉన్నాయి. మీడియాను చూసో, మరెవరిని చూసో నిజాలకు పాతరేయకూడదు. జైళ్లలోని సమస్యలకు పరిష్కారం చూపకుండా సమాధి కట్టకూడదు.

అన్ని రాష్ట్రాల జైళ్లలోనూ అరకొరగానే స్టాఫ్​  

జార్ఖండ్​లో ఒక జైలు ఆఫీసర్​ 23 మంది ఖైదీల మంచీచెడు చూడాల్సి వస్తోంది. 29 జైళ్లలో 23 మంది మెడికల్​ స్టాఫ్​ మాత్రమే ఉంది. దీని ప్రకారం ఒక్కో అధికారి 716 మంది హెల్త్​కి బాధ్యత వహించాలి. పశ్చిమ బెంగాల్​లో మరీ ఘోరంగా 59 జైళ్లలో 23 మంది మెడికల్​ ఆఫీసర్లే ఉన్నారు. అంటే దాదాపు వెయ్యి మంది ఖైదీలకు ఒక ఉద్యోగి చొప్పున ఉన్నట్లు లెక్క. ఉత్తరప్రదేశ్​, గుజరాత్​ జైళ్లలో ఖైదీల ప్రవర్తనలో మార్పు తెచ్చే కరెక్షనల్​ ఆఫీసర్లు ఒక్కరు చొప్పునే ఉన్నారు.

‘జైళ్లు’ అనొద్దు..‘దిద్దుబాటు కేంద్రాలు’ అనాలి.. 

దేశంలో జైళ్లలో ప్రొబేషన్​, వెల్ఫేర్​ ఆఫీసర్​, సోషల్​ వర్కర్​, సైకాలజిస్ట్​, సైకియాట్రిస్ట్​ తదితర పోస్టుల పరిస్థితి కూడా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’లా ఉంది. ప్రభుత్వాలు ఈ పోస్టుల్లో ఒకటీ రెండు మాత్రమే రిక్రూట్​ చేస్తున్నాయి. మిగతా వాటిని ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచుతున్నాయి. 2017లో జరిగిన ‘నేషనల్​ కాన్ఫరెన్స్​ ఆఫ్​ హెడ్స్​ ఆఫ్​ ప్రిజన్స్​’ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాన్ని అనుసరించి ప్రిజన్​ డిపార్ట్​మెంట్లను ఇకపై ‘కరెక్షనల్​ ఇన్​స్టిట్యూషన్స్​’ అనాలి.  ఖైదీల ప్రవర్తనలో మార్పు తెచ్చి, వాళ్లను మామూలు మనుషుల్ని చేయటమే తమ అంతిమ లక్ష్యమని ‘2016 మోడల్​ ప్రిజన్​ మాన్యువల్​’ తెలిపింది. ఆ ఉద్దేశం ఆచరణలో కనిపించట్లేదు. గత ప్రిజన్​ స్టాటిస్టిక్స్​లో విదేశీ ఖైదీల వివరాలు విడిగా ఉండేవి కాదు. ఇప్పుడు వాటిని ప్రత్యేకంగా రాశారు. ఇంతకు ముందు ఉన్న ఆప్షన్స్​ని తాజా డేటాలో డిలీట్​ చేశారు. ‘అన్​ కేటగిరైజ్డ్​ డెత్స్​’ అనే కాలమ్​ ఈ కోవలోకే వస్తుంది.

జైళ్లు మాత్రం హౌస్‌ ఫుల్​

వివిధ రాష్ట్రాల్లోని జైళ్లలో కెపాసిటీకి మించి ఖైదీలను కుక్కుతున్నారు. ఛత్తీస్​గఢ్​లో​ 9,813 మంది పట్టే చోట రెట్టింపు సంఖ్యలో ఉంచుతున్నారు. దీంతో జైళ్లు ఓవర్​ క్రౌడ్​ అవుతున్నాయి. కెపాసిటీ​ పర్సంటేజీ 189.9 శాతానికి చేరుతోంది. ఉత్తరప్రదేశ్​లో 58,111 మంది మాత్రమే ఉండగలిగే ప్రదేశంలో 95,336 మందిని అడ్జస్ట్​ చేస్తున్నారు. మొత్తం ఖైదీల్లో అండర్​ ట్రయల్స్​ 67.7 శాతానికి చేరారు. అందువల్ల కొత్త జైళ్లను కట్టడం కన్నా బెయిల్​ రిఫార్మ్స్​ తేవటం బెటరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.