రాజకీయాల్లో నేర చరితులకు అంతమేది?

క్రైం పాలిటిక్స్​ను మనదేశంలో తప్ప ఇంకెక్కడా మనం చూడం. ఎందుకంటే ఇక్కడ ఎంత ఎక్కువగా డబ్బుంటే అంత ఎక్కువగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉన్నట్లు.నేరాలు చేస్తే ఆ ఆర్హత ఇంకా పెరిగినట్టుగా ఉంటుంది. అలాంటి వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. మంత్రులవుతున్నారు. చివరికి రాష్ట్రాలను కూడా పాలిస్తున్నారు. రౌడీ, గూండా లాంటి బిరుదులు వాళ్ల పదవులకు ఎలాంటి ఆటకం కలిగించవు. గెలుస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు నేర చరిత్ర కలిగి ఉంటున్నట్టు  ఏడిఆర్ సంస్థ రీసెర్చ్​లో వెల్లడయ్యింది. రాజకీయ పార్టీలు కూడా నేర చరిత్ర లేని వారికే టికెట్లు ఇస్తామని చెప్పే ధైర్యం చేయడం లేదు.

నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు దేశానికి పెద్ద ఇబ్బందే. ఇలాంటి వారు అధికారంలో ఉండటం ప్రజాస్వామ్య మూలాలకే పెనుముప్పులాంటిది. 75 ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశంలో చట్ట సభలకు నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికయ్యే దౌర్భాగ్య పరిస్థితి నుంచి దేశం ఎప్పుడు బయట పడుతుందో. రాజకీయాల్లో నేరస్తుల ప్రవేశాన్ని కట్టడి చేయడానికి న్యాయ వ్యవస్థ దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినా స్వార్థ సంకుచిత రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు కేటాయించడంలో పోటీ పడడం వల్ల చట్ట సభలు ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన సాంఘిక, ఆర్థిక, సామాజిక న్యాయం చేకూరని సంకట స్థితి నెలకొంది. ఎన్నికల కమిషన్, సుప్రీం కోర్ట్ చేసిన హెచ్చరికలను, ఆదేశాలను స్వార్థ రాజకీయ పార్టీలు పెడచెవిన పెట్టడం వల్ల రాజకీయాల్లో అవినీతి, బంధుప్రీతి, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం వేళ్లూనుకొని పోయింది.

కుంభకోణాల్లో చిక్కుకున్నవారే నాయకులు

రాజకీయ పార్టీలు అవినీతిపరులకు, నేర చరితులకు, రకరకాల  స్కాంల్లో చిక్కుకున్న వారికే పట్టం కడుతున్నాయి. ధన స్వాములకు, కండబలం ఉన్న రౌడీలకు, గుండాలకు, హింస, హత్యలు, కుట్రలు, దోపిడీలు, కుంభకోణాల్లో సంబంధాలు ఉన్న అభ్యర్థులకు, మాఫియా గ్యాంగులకు, స్మగ్లర్స్, దేశ ద్రోహులకు టికెట్లు ఇస్తున్నాయి. ఇటువంటి వారిని ఎన్నికల బరిలో నిలపడం వల్ల, వాళ్లు ఓటర్లను ప్రలోభపెడుతూ.. డబ్బు, మద్యం, నోటుకు ఓటు, ఉచిత వస్తువులను ఎర చూపి ఓటును కొనే విష సంస్కృతి రాజ్యమేలుతోంది. ఎన్నికలు వస్తే చాలు పవిత్రమైన ఓటును ఎన్నికల మార్కెట్లో(ఓటరును) ఒక వస్తువు స్థాయికి దిగజార్చడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. రాజకీయాల్లో నేరస్తుల సంఖ్య పెరగడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళనను, అసహనాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులపై దాఖలైన క్రిమినల్ కేసుల్లో దశాబ్దాలుగా విచారణ సాగడం, వాయిదా పడడం.. తీర్పులు రాకపోవడంపై విచారాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ నేరస్తులపై ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని కోర్టులకు మార్గదర్శకాలను జారీ చేశారు. కేసులు నమోదై, అభియోగాలు, కోర్టులో ఆరోపణలు ఉన్న వారిపై విచారణను ఒక ఏడాది లోపు  పరిష్కారించేలా చూడాలిన సూచించారు. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ అందుకు విరుద్ధంగా ఉంది. రాజకీయ పార్టీలు.. కోర్టులకు విచారణకు కావలసిన సమాచారాన్ని సకాలంలో సమర్పించడం లేదు. రాజకీయ రంగంలో నేరస్తులను అడ్డుకోకుండా పార్టీ నాయకులే సమాచారాన్ని మాయం చేస్తున్నారు.

హన్సారియా సూచన ప్రకారం..

చట్టసభల సభ్యులపై నమోదైన కేసులను సత్వరమే  విచారించాలన్న పిటిషన్​ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారణకు తీసుకుంది. దీని ప్రాధాన్యతను గుర్తించి అత్యవసర విచారణ జరపాలని నిర్ణయించింది. సీనియర్ న్యాయవాది, కోర్టు సహాయకులు హన్సారియా ఈ పిటిషన్ దాఖలు చేశారు. నేరస్తులు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న హన్సారియా సూచన హర్షణీయం. తక్షణ జాతీయ అవసరంగా ప్రభుత్వం గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సూచనను రాజకీయ పార్టీలు ఆమోదించాలి. స్వాగతించాలి. సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రక్రియను వేగవంతం చెయ్యాలి. అయితే దశాబ్దాలు దాటినా ఈ ప్రక్రియ పూర్తి  కావడం లేదు. సీబీఐ విచారణ తీరుపై సుప్రీంకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అవినీతి దర్యాప్తు సంస్థలు పాలక పక్షాలకు, అధికారంలో ఉన్న పాలకులకు అనుకూలంగా ఉన్నంత కాలం ప్రభుత్వాలు రాజ్యాంగ రక్షణ చట్టాలను అమలు చేసి సామాన్యులకు సంక్షేమ ఫలితాలు అందించలేవు. రాజ్యాంగం ప్రసాదించిన సాంఘిక, ఆర్థిక, సామాజిక న్యాయం జరగదు. కనీస అవసరాలు తీరక జీవన ప్రమాణాలు మెరుగుపడే పరిస్థితులూ కనిపించడం లేదు.

అభ్యర్థుల అఫిడవిట్లను ఆన్​లైన్​లో పెట్టాలి

చట్టసభల్లో పోటీ చేసే అభ్యర్థుల అఫిడవిట్లను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పెట్టాలి. అభ్యర్థులపై పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసుల వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఉంచాలని 2020లో అన్ని పార్టీలనూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ దీన్ని పార్టీలు పాటించకపోగా, తమపై నమోదైన కేసు వివరాలను టాంపరింగ్​ చేస్తున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు తమ పలుకుబడిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తమ మీద నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నారు.  హైకోర్టు అనుమతి లేకుండా కేసులను ఉపసంహరించరాదని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు కూడా అమలుకు నోచుకోవడంలేదు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను గురించి తెలుసుకోవడానికి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని 2018లో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటి వరకూ ఈ కమిటీ ఏర్పాటు కాలేదు. అధికార పార్టీకి నేర రహిత రాజకీయ వ్యవస్థ నిర్మాణం పట్ల, రాజ్యంగ చట్టాల అమలు పట్ల అవగాహన కలిగి చిత్తశుద్దితో అమలు చేయాలన్న దృక్పథం ఉండాలి. చట్టసభల్లో(రాజకీయాల్లో) నేరస్తులను అడ్డుకునే విషయంలో  ఎన్నికల కమిషన్  నిబంధనలు, ఆదేశాలను,  సుప్రీంకోర్టు సూచనలను అమలు చేసే విశ్వసనీయత కలిగి ఉండటం రాజకీయ నాయకులు తమ కర్తవ్యంగా భావించాలి.

ఉన్నత ప్రమాణాలు సాధించాలంటే..

ఆలిండియా పొలిటికల్ సర్వీస్ కమిషన్ నెలకొల్పి, ఈ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు చట్టసభల్లో పోటీ చేయడానికి అర్హులుగా నిర్ణయించే చట్టాన్ని రూపొందించాలి. రాజకీయ పార్టీలు ఉత్తములకు, ప్రజాభీష్టాన్ని, ఆకాంక్షలను నెరవేర్చే ప్రతిభ, సామర్థ్యం కలిగిన సంఘ సేవకులకు టికెట్లు ఇవ్వాలి. మేధావులు, సైంటిస్టులు, న్యాయ నిపుణులు, పాలనావేత్తలు, ఆర్థికవేత్తలు, చట్టసభల్లో ప్రవేశించాలి. జాతీయ చట్టాల నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించి రాజ్యాంగ లక్ష్యాలైన సాంఘిక, సామాజిక, ఆర్థిక న్యాయం నెరవేర్చే ప్రతినిధులుగా వెలుగొందాలి. నేరరహిత రాజకీయాలకు రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. పార్టీలు నేరమయ రాజకీయాలకు కళ్లెం వేసే దిశగా ఉద్యమించి నిస్వార్థ రాజకీయ సంకల్పంతో  క్రైం పాలిటిక్స్‌‌‌‌ను అడ్డుకోవాలి. అప్పుడే దేశంలో అన్ని వర్గాలకు అవకాశాలు దక్కుతాయి.

రాజకీయాల్లో నేరచరితుల సంఖ్య..

2004లో 24 మంది, 2009లో 30, 2014లో 34, 2019లో 43 మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ ఎంపీలుగా గెలిచారు. పార్లమెంట్‌‌‌‌లో కనీసం 43 శాతం మంది ఎంపీలపె క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. వీళ్లను ఎవరూ ఎంపీలు కాకుండా అడ్డుకోలేకపోయారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున నేరస్తులకు సీట్లు కేటాయించాయి.  2018లో చట్టసభల సభ్యులపై నమోదైన కేసుల సంఖ్య 4,110 ఉండగా 2021 నాటికి 4,984కు చేరాయి. ఈ కేసుల్లో దాదాపు మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులు అసంఖ్యాకంగా ఉన్నాయి. 2,320 కేసులు ప్రస్తుత చట్టసభ సభ్యులపై నమోదై ఉన్నాయి. 1,675 కేసులు మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్నాయి. 1,991 కేసుల్లో అభియోగాలు ఇంకా దాఖలు కాని స్థితిలో ఉన్నాయి.  264  కేసులు వివిధ హైకోర్టుల్లో స్టే ఉండటం వల్ల విచారణ ముందుకు సాగడం లేదు. 1,339 కేసులతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రాజకీయ పార్టీలకు నేరస్తులకు మధ్య సంబంధం రోజురోజుకూ బలపడుతోందని ఈ లెక్కలు చెబుతున్నాయి.

పోటీచేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత ఉండేలె..

రాజకీయ పార్టీల ఉదాసీనతతో చట్ట సభల్లో నేరస్తుల సంఖ్య పెరిగి ప్రజలకు చట్టబద్ధ పాలన, జవాబుదారీతనం, పారదర్శకత, ప్రగతి ఎండమావిగా తయారయ్యింది. పార్టీలు రాజకీయాల్లో ఉత్తమ ప్రజా ప్రతినిధులను గుర్తించడానికి ఆన్​లైన్​లో ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించాలి. ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన వివరాలను పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చెయ్యాలి. ఎనికైన అభ్యర్థి ప్రమాణ పత్రాన్ని పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చెయ్యాలి. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే వ్యయం మీద ఉన్న చట్టాలను కఠినంగా అమలు చెయ్యాలి. ఎన్నికలకు ముందు పదవీ కాలం ముగిశాక ప్రజాప్రతినిధులు తమ ఆస్తులు, అప్పుల వివరాలు బహిరంగంగా ప్రకటించాలి. స్థానిక సంస్థల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు పోటీచేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు నిర్ణయించాలి. రాజకీయాలు వృత్తిగా మారాలి. నిరుద్యోగ యువత రాజకీయాల్లోకి ప్రవేశిస్తే నిరుద్యోగ సమస్య కొంతైనా తగ్గుతుంది. విద్యావంతులు చట్ట సభల్లో ప్రవేశించడం వల్ల మెరుగైన చట్ట నిర్మాణం జరిగి, రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న లక్ష్యాలు నెరవేరి నూతన పాలనా విధానాలతో నవ సమాజం ఆవిర్భవిస్తుంది.

:: నేదునూరి కనకయ్య, అధ్యక్షుడు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం