తెలంగాణ పబ్లిక్సర్వీస్కమిషన్ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వ ఉద్యోగాల పేపర్ లీకేజీ కేసు నమోదై ఇప్పటికే నెల రోజులు గడిచింది. కానీ ఆ లీకుల వెనకాల ఉన్న ప్రధాన సూత్రధారులెవరో ప్రపంచమంతటికీ తెలిసినా చట్టం నుంచి వారు రక్షణ పొందుతున్నారు. గత నెల రోజులుగా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అఖిలపక్ష పార్టీలన్నీ ఏకమై ఈ నెల18న ఇందిరా పార్క్‌వద్ద ‘నిరుద్యోగుల దీక్ష – అఖిలపక్ష భరోసా’ నిరసన దీక్ష చేపట్టి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాం. వారం రోజుల్లోగా ప్రభుత్వం లీకేజీ కేసును సీబీఐ లేదా సిట్టింగ్జడ్జికి అప్పగించకపోతే, నిరుద్యోగ అభ్యర్థులకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వకపోతే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇండ్లను ముట్టడించాలని ఐక్యంగా ఆ వేదిక నుంచి పిలుపునిచ్చాం.
టీఎస్పీఎస్సీ మెంబర్ బయటకెందుకు వెళ్లాడు?
పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు19 మందిని అరెస్ట్‌చేసి అదుపులోకి తీసుకున్నారు. కానీ అసలైన దోషులెవరో ఇప్పటి వరకు తేల్చలేదు. ఇదిలా ఉండగా లీకేజీ కేసులో కొత్తగా బయటకు వచ్చిన విషయాలేంటంటే.. 2021లో కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డితో సహా నియమితులైన సభ్యుల్లో ఆరవెల్లి చంద్రశేఖర్‌రావు ఒకరు. అయితే అతను ప్రస్తుతం కమిషన్సభ్యుడిగా కొనసాగడం లేదు ఎందుకు? అతడిని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారా? లేక ఈ లీకుల గురించి ముందే తెలిసి ఆయన బయటకు వెళ్లారా? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరో సభ్యుడు కారం రవీందర్‌రెడ్డికి సంబంధించిన వివరాలు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్నుంచి తొలగించారు ఎందుకు? వచ్చే మే17 నుంచి 27 వరకు ఈ దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్తున్నట్లుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు గల కారణాలేమిటి? ఏ కారణంతో వెళ్తున్నారు? ఒక పక్క బోర్డు సభ్యులందరికీ సిట్నోటీసులు ఇచ్చి విచారించింది. అలాగే ప్రస్తుతం లీకేజీ కేసును ఈడీ కూడా విచారిస్తున్నది. ఈ సందర్భంలో కమిషన్ సభ్యులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? కేసు నుంచి తప్పించుకోవడానికే వెళ్తున్నారా? సిట్విచారణలో ఈ సభ్యులు ఏం చెప్పారు? ఇలాంటి అనేక అనుమానాలు నిరుద్యోగులకు కలుగుతున్నాయి.
టెన్త్ పేపర్లో చూపిన స్పీడ్ టీఎస్ పీఎస్సీపై ఏది?
ఏప్రిల్3వ తేదీన పదో తరగతి తెలుగు పేపర్ లీకైంది. వెంటనే స్పందించిన అధికారులు విచారణ చేపట్టి, అందుకు బాధ్యులైన వారందరినీ ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగించారు. అలాగే ఏప్రిల్4న పదో తరగతి హిందీ పేపర్ కూడా లీకైందనే వదంతులు ప్రచారం అయ్యాయి. కానీ ఆ హిందీ పేపర్ లీక్ కాలేదని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని గుర్తించి, వరంగల్ పోలీసు కమిషనరేట్పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కేవలం 48 గంటల్లోనే లీకేజీ వదంతులు సృష్టించిన వారిని గుర్తించారు. ఆ కేసులో ప్రధాన సూత్రధారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్‌సభ్యుడు బండి సంజయ్‌ను అరెస్ట్‌చేసి జైలుకు పంపించారు. ఈ సందర్భంగా వరంగల్పోలీసు కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించి, లీకేజీకి సంబంధించిన వివరాలు చాలా స్పష్టంగా నిందితుల కాల్‌డేటా, వాట్సాప్ చాట్ బయటపెట్టారు. పదో తరగతి పేపర్ లీకేజీ కేసును కేవలం 48 గంటల్లో ఛేదించిన పోలీసులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లీకేజీని ఎందుకు ఛేదించలేకపోతున్నారు? కేసును చేపట్టిన సిట్అధికారులు ఎందుకు ఇప్పటి వరకు కేసు వివరాలు ప్రకటించడం లేదు? పత్రికా సమావేశంలో ఎందుకు అధికారులు పాల్గొనడం లేదు?
దొరల పాలనను అంతం చేద్దాం
ముఖ్యమంత్రి కార్యాలయం, కమిషన్ చైర్మన్ సభ్యులు, నిందితులు అందరూ కలిసి చేసిన పేపర్ లీక్ కుంభకోణంలో అసలైన దోషులను శిక్షించాలి. ఇప్పటికైనా కమిషన్ చైర్మన్, సభ్యులు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేసి, ప్రజలను క్షమాపణ కోరాలి. కేవలం ముఖ్యమంత్రి కనుసన్నల్లో పనిచేసే సిట్విచారణతో అసలైన దోషులను రక్షించే కుట్రలను అధిగమించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించే కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. పేద వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే పేదల రాజ్యంతోనే సాధ్యం. కాబట్టి పేదలందరం కలిసి బహుజన రాజ్యాన్ని సాధిద్దాం, దొరల పాలనను అంతం చేద్దాం.
ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరు?
30 లక్షల మంది తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగులు తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు భరోసా కల్పించడం లేదు? ఒకపక్క విద్యార్థి, నిరుద్యోగులు పేపర్ లీకేజీలతో అయోమయంలో ఉంటే, మరోపక్క కమిషన్‌చైర్మన్, సభ్యులు నిందితులుగా పేర్కొనబడి, విచారణకు హాజరై, ఇప్పుడు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా, అన్ని పరీక్షలు త్వరలో నిర్వహిస్తామని తేదీలు ప్రకటిస్తున్నారు. పేపర్ లీకేజీలో చైర్మన్, బోర్డు సభ్యుల పాత్ర ఉందని తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తుంటే, ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రజల, నిరుద్యోగుల నమ్మకం కోల్పోయిన అధికారులే మళ్లీ ఎలా పరీక్షలు నిర్వహిస్తారు? దొంగల చేతికి తాళాళిచ్చి, 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ప్రశ్నార్థకం చేస్తూ, ఒక్కో ఉద్యోగాన్ని పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు అమ్ముకునేందుకు సహకరించిన అధికారులే, ఇప్పుడు ఎలాంటి లీకులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామంటే నిరుద్యోగులకు ఎలా నమ్మకం కలుగుతుంది? ఇలా చేయడం వల్ల కమిషన్పట్ల తెలంగాణ ప్రజలు, విద్యార్థులు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగాలు రావనే అపనమ్మకం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి.
సీబీఐతో విచారణ జరిపించాలి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సాధారణమైనది కాదు. పోలీసులకు సమాచారం రాకపోయి ఉంటే.. గ్రూప్1 ఎగ్జామ్ పూర్తయి.. డబ్బులు పెట్టి పేపర్కొన్న దుర్మార్గులు ప్రభుత్వ కీలక స్థానాల్లో ఉద్యోగులుగా, పాలసీ అమలు ఆఫీసర్లుగా ఉండేవారు. ప్రభుత్వ కీలక, రహస్య సమాచారాన్ని దేశ ద్రోహులకు బేరం పెట్టేవారు. కాబట్టి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును ఇప్పటికైనా సీబీఐకి అప్పగించాలి. ఈ నేరంలో అసలైన దోషులను పట్టుకోవాలి. తాజాగా అరెస్ట్ అయిన ఇద్దరితోపాటు ఈ కేసులో మొత్తం అరెస్ట్అయిన 19 మంది నిందితుల ఫోన్‌కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్సేకరించాలి. వారు ఎవరితో సంబంధంలో ఉన్నారో పరిశీలించాలి. అంతేకాకుండా కమిషన్‌చైర్మన్, బోర్డు సభ్యుల కాల్‌డేటా, వాట్సాప్చాటింగ్బయటకు తీయాలి. నిందితులకు బోర్డు సభ్యులకు మధ్య సంబంధాలను గుర్తించాలి. ముఖ్యమంతి కార్యాలయంలో ఉన్న అధికారులతో, బోర్డు సభ్యులు, నిందితులకు ఉన్న సంబంధాలు కూడా తేల్చాలి. అప్పుడు మాత్రమే అసలైన లీకు వీరులెవరో దొరికే అవకాశం ఉంది.
2021లో టీఎస్పీఎస్సీలో నియమితులైన సభ్యుల్లో ఆరవెల్లి చంద్రశేఖర్‌రావు ఒకరు. ఆయన ప్రస్తుతం కమిషన్సభ్యుడిగా లేరు ఎందుకు? ఆయనను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారా? లేక ఈ లీకుల గురించి ముందే తెలిసి ఆయనే బయటకు వెళ్లారా? మరో సభ్యుడు కారం రవీందర్‌రెడ్డికి సంబంధించిన వివరాలు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించారు ఎందుకు? ఇలాంటి అనేక విషయాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్,బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు