భారత పురాణేతిహాసాల్లో ప్రముఖమైన వ్యక్తుల్లో ఒకరు వేద వ్యాసుడు. వేద సంపదను ఋగ్వేదం, యజుర్వేదం, సామ వేదం, అధర్వణ వేదం అని 4 భాగాలుగా విభజించడమే కాదు.. పంచమ వేదంగా చెప్పే మహా భారతం, భగవద్గీత, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులను రచించి, మనిషి ఎలా బతకాలన్నది మార్గనిర్దేశం చేసిన మహోన్నతుడు. రెవల్యూషనరీ రిఫార్మర్, విశ్వ గురువు అయిన ఆయనను మన భరత జాతి తొలి నిర్మాత (ఫస్ట్ నేషన్ బిల్డర్)గా చెప్పొచ్చు. ఆయన రచనలు, స్పిరిచ్యువల్ ఫిలాసఫీలు నేటికీ దేశాన్ని ఏకతాటిపై నడిపించే సూత్రాలుగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులకు కూడా యావత్ ప్రపంచం మొత్తానికీ అన్వయం అవుతాయి. హిందూ ఇజంలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తీసుకురావడంలో దళితులు, అట్టడుగు కులాల వాళ్లు చేసిన కృషి ఎంతో ఉందని చెప్పడానికి వ్యాసుడు సాధించిన అసాధారణమైన ఘనతలే ఒక నిదర్శనం.
భారత దేశంలో తొలి ఇంటర్ క్యాస్ట్ వివాహానికి ప్రతిఫలంగా పుట్టిన బిడ్డ కృష్ణ ద్వైపాయన వేద వ్యాసుడే. పరాశర మహర్షికి, నాటి పరిస్థితుల్లో అట్టడుగు వర్గంగా చూసే మత్స్యకార మహిళ అయిన సత్యవతి దంపతులకు ఆయన జన్మించాడు. ఇద్దరు భిన్నమైన జాతులకు చెందిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ మొత్తం హిందూ ఇజానికే ఒక ప్రతీకగా ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఆయన పుట్టిన ఆషాడ పౌర్ణమి రోజునే మనం ఏటా వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అని పండుగ జరుపుకుంటాం. ప్రపంచానికి ఎన్నో తత్వాలను బోధించిన ఆయనను గురువుగా భావిస్తాం. ఈ రోజున గురు పూజ చేసుకోవడం సంప్రదాయంగా మారింది.
తండ్రి బాటలో వికసించిన వ్యక్తిత్వం
చెట్టు ఒకటైతే విత్తనం మరొకటి ఎలా వస్తుంది అన్నట్టుగా.. వ్యాసుడు వ్యక్తిత్వం కూడా తండ్రి పరాశర మహర్షిలానే వికసించింది. పరాశరుడు అపార విజ్ఞాన గని. పెద్ద సంస్కర్త. సమాజంలోని భిన్న వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం కోసం ఆయన దేశమంతా యాత్రలు చేశాడు. వర్గానికీ, వర్గానికీ.. కులానికీ, కులానికీ మధ్య ఏ మాత్రం సఖ్యత లేని రోజుల్లో పరస్పరం ఒకరినొకరు గౌరవించుకునేలా పాజిటివ్ వ్యాల్యూస్ పెంచేందుకు అనేక ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు. చిన్నతనం నుంచే వ్యాసుడికి కూడా కుంచిత ఆలోచనలు, అర్థం లేని విభేదాలు నచ్చేవి కాదు. ఆయన ఆలోచనలు చాలా విశాల దృక్పథంతో ఉండేవి. అంతా ఒక్కటే అన్న భావనతో ఆయన అందించిన ప్రాచీన విజ్ఞానం నేటికీ ఆచరణీయం. వ్యాసుడు యువకుడిగా ఉన్న రోజుల్లో ఆయనతో ఏ విద్యలోనూ సరితూగే వ్యక్తి మరొకరు లేరు. తన గురువులు, తండ్రి నేర్పిన ప్రతి విషయాన్ని చిటికెలో గ్రహించి నేర్చుకునేవాడు. మానవాళికి తనవంతు సేవ చేయాలని, తాను సంపాదించిన అపార జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ పంచాలని ఆయన ఎంతగానో తపన పడ్డాడు.
ఆధునిక ప్రపంచ స్కాలర్స్‌పై వ్యాసుడి ప్రభావం ఎక్కువ
వ్యాసుడు రెలిజియన్ రిఫార్మ్స్, హిందూ కల్చర్ చరిత్రపై తిరుగులేని ముద్ర వేశారు. నేటికీ ఒక వ్యక్తి తనను తాను తెలుసుకోవాలన్నా, ఆత్మ శోధన చేసుకోవాలన్నా ఆయన చేసిన తత్వ బోధనలతోనే సాధ్యమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక స్కాలర్స్‌పై ఆయన ప్రభావం ఎంతో ఉంది. జర్మనీకి చెందిన ఇండాలజిస్ట్ పాల్ డ్యుసెన్ మాటల్లో చెప్పాలంటే.. ‘‘నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో.. నీ పొరుగువాడిని కూడా అలానే చూడు అని అందరూ చెబుతారు. కానీ అలా ఎందుకు చేయాలని అన్న ప్రశ్నకు బైబిల్‌లో సమాధానం దొరకదు. అదే వేదాల్లో అయితే ‘తత్ త్వమ్ అసి’ అనే మూడు పదాల్లో గొప్ప ఫార్ములాను వ్యాసుడు చెబుతాడు. ‘నువ్వు నేను అంతా ఒక్కటే (నువ్వు, నీ పొరుగు వారు వేర్వేరు కాదు)’ అని దీని అర్థం కాబట్టి, నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో, అలానే పొరుగువారిని ప్రేమించాలన్న సమాధానం ఇక్కడ దొరుకుతుంది. పొరుగువారిని వేరుగా చూడడం ఒక భ్రమ, పొరబాటు అని వ్యాసుడు చెబుతాడు” అని పేర్కొంటారు. వేద వ్యాసుడు అసామాన్య మేధావి అని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలని పాల్ అంటారు.
ఉపనిషత్తులకు మించిన ఫిలాసఫీ లేదు
అప్పటి వరకు ఋషులు మాత్రమే కంఠస్తం చేసి తమ తర్వాతి తరాలకు అందిస్తూ వచ్చిన వేదాలను గ్రంథస్తం చేసిన వ్యక్తి వ్యాసుడు. వేదాలను నాలుగు భాగాలుగా (ఋగ్వేదం, యజుర్వేదం, సామ వేదం, అధర్వణ వేదం) విభజించి, భారత దేశానికి ఎనలేని సంపదను అందించాడు. ఇది మొత్తం మానవాళికే ఆయన చేసిన గొప్ప మేలు. వేద విభజన చేయడమే కాదు మానవాళిలో ఒక సామరస్య పూర్వక వాతావరణాన్ని పెంచేలా ప్రతి భాగంలోనూ మంత్రాలు, బ్రాహ్మణ (క్రతువులు, వాటిని ఆచరించే విధానం), అరణ్యక (దేవతల ఆరాధనా విధానం), ఉపనిషత్తులు(తాత్విక చింతనలు)గా అంతర్విభజన చేశారు. ఉపనిషత్తులను ప్రపంచ మానవాళికి అందిన అత్యున్నత విజ్ఞాన సంపద అని రెండో ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలోనే జర్మనీకి చెందిన స్కాలర్ ఆర్థర్ షోపెన్హ్యూవర్ అభిప్రాయపడ్డారు. దీనిపై అప్పట్లో వెస్ట్రన్ పత్రికల్లో రావడం, ఉపనిషత్తులపై చర్చ జరగడం ఈ శతాబ్ధానికే అందిన గొప్ప గిఫ్ట్‌గా ఆయన చెప్పారు. జీవితాన్ని సంతోషంగా గడపడానికి, చివరి క్షణాల్లో సంతృప్తిగా ప్రాణం వదిలేసే స్థితిని ఉపనిషత్తులు బోధిస్తాయని ఆర్థర్ తన రచనల్లో పేర్కొన్నారు. మనసు, బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి ఉపనిషత్తులను అర్థం చేసుకోవడానికి మించిన మార్గం లేదని, ఉపనిషత్తులకు మించిన ఫిలాసఫీ భూమిపై మరొకటి దొరకడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
పుట్టుక, బ్యాగ్రౌండ్.. మనిషి గొప్పదనాన్ని జడ్జ్ చేయలేవ్
ఇండియన్ కల్చర్ మూలాలను, భారతీయ గొప్పదనాన్ని చెప్పే ఇతిహాసాల్లో మొదటిది రామాయణమైతే, రెండోది మహాభారతమే. ఈ మహాభారతాన్ని రచించింది వ్యాసుడు. దీనిలో అంతర్భాగంగా రోజువారీ జీవితంలో మనిషి ప్రాక్టికల్‌గా, స్థిర చిత్తంతో ఎలా బతకాలన్నది చెప్పే ఒక హ్యాండ్ బుక్ లాంటి భగవద్గీతను ఆయన అందించాడు. వేదాల్లో ఉండే మొత్తం సారాన్ని చాలా సింపుల్‌గా ఒక్క భగవద్గీత ద్వారా ఆయన చెప్పేశాడు. సామాన్య సంసార జీవితం మొదలు రాజకీయం వరకు అన్నీ ఇందులో విశ్వ మానవాళికి అందించాడు. మనిషి పుట్టుక, బ్యాగ్రౌండ్ అనేవి ఆ వ్యక్తి గొప్పదనాన్ని, ఏం సాధించగలడనేదానిని జడ్జ్ చేయలేవని వేద వ్యాసుడి విజయాలు చెబుతాయి.
సమస్యలను ఎట్ల ఎదుర్కోవాలో చెప్పిండు
వ్యాసుడు ఉపనిషత్తులతో పాటు బ్రహ్మసూత్రాలను కూడా భారత దేశానికి అందించాడు. మనం ఎవరన్నది ఉపనిషత్తులు చెబితే, దానిని అనలైజ్ చేసి, మనిషికి స్పష్టతనిస్తాయి బ్రహ్మసూత్రాలు. అంతా ఒక్కటే అని చెప్పే అద్వైత వేదాంతమైన ఇండియన్ ఫిలాసఫీకే పునాది రాళ్ల వంటివి బ్రహ్మసూత్రాలు. వేద జ్ఞానానికి ఇవి గొడుగులా నిలబడతాయని నేటి తాత్విక వేత్తలు అంటారు. వేద వ్యాసుడి దూరదృష్టి అసమాన్యమైనదని స్వామి చిన్మయానంద చెబుతారు. ఎప్పుడో ప్రాచీన కాలంలోనే నేటి కాలంలోనూ వచ్చే సమస్యలను సైతం ఎట్ల ఎదుర్కోవాలన్నది ఊహించి, తన రచనల్లో మార్గదర్శనం చేశాడని ఆయన పేర్కొన్నారు.
హిందూ ధర్మానికి పునాది
సామాన్య ప్రజలకు సైతం తన అపారమైన జ్ఞానం అందాలని వ్యాసుడు దేశమంతా యాత్రలు చేసి, ఎందరో ఋషులు, మునులు, పుర ప్రజలకు బోధనలు చేశాడు. అష్టాదశ పురాణాలను రాసి తన తత్వాన్ని వాటిలో సరళంగా ప్రజలకు అర్థమయ్యేలా, వాటిని కల్చర్‌లో ఒక భాగం చేసేలా ఎన్నో క్రియేటివ్ ఆలోచనలు చేశాడు వ్యాసుడు. ‘దేవతారాధన, ఋషి మార్గాల ఆచరణ, తత్వ బోధన లాంటి వాటి ద్వారా హిందూ ధర్మానికి వేద వ్యాసుడు పునాది వేశాడు. వీటి ద్వారా సమాజంలో అందరినీ గౌరవించడంతో పాటు ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూడాలని నేర్పిన వ్యక్తి. అయినా సరే ఎక్కడా తన విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు చేసే సంప్రదాయాన్ని ఆయన నెలకొల్పలేదు’ అని అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ స్టడీస్ ఫౌండర్ డేవిడ్ ఫ్రావ్లే తన రచనల్లో పేర్కొన్నారు.
- సుదర్శన్ రామభద్రన్, - గురు ప్రకాశ్ పాశ్వాన్
వీరిద్దరూ కలిసి రచించిన ‘మేకర్స్ ఆఫ్ మోడర్న్ దళిత్ హిస్టరీ’ బుక్‌లోని కొంత భాగం ఇది.